Take a fresh look at your lifestyle.

బతకడానికి, బతుకుదెరువుకు మధ్య పల్లె పోరు..!

దేశంలోని అర్హతగల 100 కోట్ల జనాభాకు వెంటనే టీకా కార్యక్రమం అమలు పరచడం ద్వారా హెర్డ్ఇమ్యునిటీ దశకు చేరే అవకాశం ఉంది. నీతి ఆయోగ్‌ అం‌చనాల ప్రకారం ప్రభుత్వ చొరవతో దేశంలో వ్యాక్సినేషన్‌ ‌కార్యక్రమం డిసెంబర్‌-2021 ‌నాటికి కొంత మెరుగు పడి అనుకూల పరిస్థితులు రావచ్చని తెలుస్తున్నది. నేడు దేశంలో విధించిన లాక్‌డౌన్‌లతో గ్రామీణ మరియు పట్టణ పేదల బతుకు చించేసిన విస్తరిని తలపిస్తున్నది. జీవనోపాధి దొరక్క ధీనంగా గడపడం అత్యంత బాధాకరం. ప్రస్తుత ప్రభుత్వాలు జీవనోపాధికి మరియు జీవితాలకు మధ్య సమతుల్యత సాధించాల్సి ఉంది. కొరోనా మరణాల కన్న ముందు ఆకలి చావుల కేకలు వినిపించరాదు.

కొరోనా రెండవ అల సునామీకి ప్రపంచ దేశాలు, ముఖ్యంగా ఇండియా భారీమూల్యాన్ని చెల్లిస్తున్నాయి. భారత్‌లో రోజుకు 2 – 4 లక్షల కొత్త కేసులు మరియు 3 – 4 వేల మరణాలు నమోదు అవుతున్నాయి. వాస్తవ కొరోనా గణాంకాలు కనీసం 5 రెట్లు ఎక్కువ ఉండవచ్చని ఐరాస లాంటి సంస్థలే అంచనా వేస్తున్నాయి. కొరోనా తొలి అలను భారత్‌ ‌సమర్థవంతంగా అదుపు చేయగలిగిందని ప్రపంచ దేశాలు ప్రసంశలు కురుపించాయి. రెండవ అల సునామీ దేశమంతా చుట్టేయడంతో ప్రభుత్వాలు, వైద్య వ్యవస్థలు బిత్తర పోవడం, అనేక సవాళ్ళను ఎదుర్కోవడం జరుగుతున్నది. అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్‌లు, కర్ఫ్యూలు కఠినంగా అమలు చేయడంతో కోవిడ్‌-19 ‌తీవ్రత తగ్గుముఖం పడుతున్నట్లు గణాంకాలు వివరిస్తున్నాయి. తొలి అల పట్టణాలకు మాత్రమే పరిమితం కావడంతో గ్రామీణ భారతం సురక్షితంగా బయట పడగలిగింది. రెండవ కొరోనా ప్రఛండ అల తాకిడికి గ్రామీణ పల్లెలు కూడా గజగజ వణకడం చూస్తున్నాం. ఆసుపత్రి పడకలు, వెంటిలేటర్లు, ఐసియూలు, టీకాలు, ఔషధాలు, స్మశానాలు, ఆక్సీజన్‌ ‌సిలిండర్లు మరియు వైద్య సిబ్బంది కోరతలతో కోవిడ్‌-19 ‌బాధితులు ప్రాణాలను కోల్పోయే దుస్థితి రావడం మన పాలకుల అలక్ష్యానికి నిదర్శనం. పాలకులకు ఎన్నికలు, గెలుపులు, అధికారాలు కావాలి. ప్రజలు పాల్గొన్న వ్యవసాయ ఉద్యమాలు, రంజాన్‌ ‌సందడులు, కుంభమేళాల ముందు ప్రజారోగ్యం ఓడి పోయింది. నేడు పరిస్థితులు కొంత మెరుగు పడినా 3వ అల రాకముందే కావలసిన వైద్య ఆరోగ్య వనరులను సమృద్ధిగా సమకూర్చుకోవలసిన అవసరాన్ని రెండవ అల గట్టి గుణపాఠాన్నే నేర్పింది.

17 మే 2021 ప్రభుత్వ గణాంకాల ప్రకారం దేశవ్యాప్త కరోనా కారణ సగటు మరణాల రేటు 1.10 ఉండగా, హరిత విప్లవానికి నాయకత్వం వహించిన పంజాబ్‌ అ‌గ్రభాగాన 2.39 మరణ రేటుతో సతమతం అవుతున్నది. ఉత్తరాఖండ్‌లో 1.67, గోవాలో 1.55, ఢిల్లీలో 1.54, మహారాష్ట్రలో 1.52 మరణాల రేటు నమోదు అవుతున్నాయి. అతి తక్కువ మరణాల రేటు ఉన్న రాష్ట్రాలుగా కేరళలో 0.30, ఒడిసాలో 0.38 బీహార్‌లో 0.59 మరియు ఆంధ్రప్రదేశ్‌లో 0.65 గుర్తించబడ్డాయి. దేశంలోని అర్హతగల 100 కోట్ల జనాభాకు వెంటనే టీకా కార్యక్రమం అమలు పరచడం ద్వారా హెర్డ్ఇమ్యునిటీ దశకు చేరే అవకాశం ఉంది. నీతి ఆయోగ్‌ అం‌చనాల ప్రకారం ప్రభుత్వ చొరవతో దేశంలో వ్యాక్సినేషన్‌ ‌కార్యక్రమం డిసెంబర్‌-2021 ‌నాటికి కొంత మెరుగు పడి అనుకూల పరిస్థితులు రావచ్చని తెలుస్తున్నది. నేడు దేశంలో విధించిన లాక్‌డౌన్‌లతో గ్రామీణ మరియు పట్టణ పేదల బతుకు చించేసిన విస్తరిని తలపిస్తున్నది. జీవనోపాధి దొరక్క ధీనంగా గడపడం అత్యంత బాధాకరం. ప్రస్తుత ప్రభుత్వాలు జీవనోపాధికి మరియు జీవితాలకు మధ్య సమతుల్యత సాధించాల్సి ఉంది. కొరోనా మరణాల కన్న ముందు ఆకలి చావుల కేకలు వినిపించరాదు.

నేటి మహా విపత్తు భీభత్స దృశ్యాల నడుమ ప్రభుత్వాలు కేంద్ర నిపుణుల కమిటీల ‘వార్‌ ‌రూమ్‌’ ‌చర్చల ద్వారా తీర్మానించిన సత్వర చర్యలను వెంట వెంటనే సూచించడం, పలు స్వచ్ఛంధ సంస్థల సహాయంతో పథకాల అమలు జరగాలి. గ్రామీణులకు టీకాలు ప్రాధాన్యత క్రమంలో ఇవ్వడానికి ఏర్పాట్లు చేయాలి. స్థానిక వైద్య వ్యవస్థను బలోపేతం చేయడం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో టీకాల నిల్వ చేసే వ్యవస్థను కల్పించాలి. గ్రామీణులకు కరోనా సోకితే వ్యవసాయ వ్యవస్థలు అవస్థలు పడటం మరియు అనుబంధ రంగాలు కుంటు పడటం జరుగుతుంది. అన్నదాతను ఆదుకోవడం మన ప్రథమ తక్షణ కర్తవ్యం కావాలి. గ్రామ పంచాయతీ స్థాయిలో టీకాలు, కొరోనా కిట్లు, ఐసొలేషన్‌ ‌కేంద్రాలు అందుబాటులో ఉంచే ప్రయత్నాలు చేయాలి. లాక్‌డౌన్‌లు మరింత కాలం కొనసాగితే కొన్ని మాసాలు ఉచిత ఆహార ధాన్యాల పంపిణి, నగదు సహాయం అమలు చేస్తూ పేదల ప్రాణాలను నిలబెట్టాలి. గ్రామీణ వ్యవసాయ ఆధారిత పరిశ్రమల స్థాపన కొంత ఊరటను ఇవ్వనుంది. గ్రామీణ అమాయక ప్రజలకు పని మీద ఉన్న శ్రద్ధ కొరోనా టీకాల మీద ఉండదు.

టీకా కోసం రెండుసార్లు బహు దూరాల్లో ఉన్న ఆరోగ్య కేంద్రాలకు వెళ్లడానికి గ్రామీణులు ఉత్సాహం చూపే అవకాశాలు తక్కువ. కరోనా సోకితే కనీసం 14 రోజులు ఇంట్లోనే కూర్చొని ఔషధాలు వాడుకుంటూ, ఉత్తమ పోషకాహారం తీసుకోవాలి. కోవిడ్‌-19 ‌రోగ లక్షణాలు కనిపించినా కొరోనా పరీక్షల వసతులు స్థానికంగా అందుబాటులో లేనందున అలాగే ప్రాణాపాయంతో జీవితం గడుపుతున్నారు. గ్రామీణ ప్రజల్లో కూడా కొరోనా విధించిన క్రమశిక్షణల పట్ల అవగాహన పెరిగింది. వీలైనంత వరకు సామాజిక దూరాలు, మాస్కుల వాడకాలు పాటించడం నేడు చూస్తున్నాం. గ్రామీణ భారతం జీవించడానికి మరియు జీవనోపాధికి నడుమ నలుగుతున్న కోవిడ్‌-19 అకాలంలో ప్రభుత్వాలు, ప్రజలు మరియు స్వచ్ఛంధ సంస్థలు సకాలంలో స్పందించి పల్లె జనాలను పదిలంగా రక్షించుకోవాలి.
– డా: బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి
విశ్రాంత ప్రధానాచార్యులు, ప్రభుత్వ డిగ్రీ పిజీ కళాశాల
కరీంనగర్‌ – 9949700037

Leave a Reply