Take a fresh look at your lifestyle.

పల్లె పదనికలు

జాతి వెన్నెముకలే కదా పల్లెలు
కర్షక శ్రామిక వర్గాల చెమటలు
వెచ్చటి తొలి సంధ్య ఘడియలు
ఉషోదయాన పక్షుల కిలకిల రావాలు
మంచు ముత్యాలు వెలసిన ఆకులు !

అలారం కూతతో లేచే పల్లెలు
ఊరిని చుట్టిన హరిత తివాచీలు
గుమ్ముల నిండా ధాన్యరాసులు
పాడిపంటలతో పల్లె సంబరాలు
లేగ దూడల నెమలి నాట్యాలు !

ఉడుత, పిచ్చుకల ముద్దు ముచ్చట్లు
ఆవులు, బర్లలే ఆత్మీయ స్నేహాలు
కల్లాపు పేడల కమనీయ వాసనలు
జోడెడ్లతో నాగటి సాల్లల్లో విత్తనాలు
చేను చెలకలల్లో పవన విన్యాసాలు !

పంటను చూసి కర్షకుడి ఆనందాలు
కంటి కునుకు మరిచి కల్లంలో కాపురాలు
వరి కోత మిషిన్లు.. కుప్పల తిప్పలు
ధాన్య సేకరణకే మీనమేషాల వేషాలు
గిట్టుబాటు ధరల కొనుగోలు కేంద్రాలు !

వరి గొలుసుల బరువుకే ఒరిగిన చేలు
పత్తి లాంటి సుతిమెత్తని మనసులు
ముక్క కంకుల చెంప గిచ్చితే పాలు
పల్లి కాయల్లోంచి నూనెల ధారలు
తాటి ఈత కల్లు కుండల మోతలు !

మైసమ్మ, ఉప్పలమ్మ, ముత్యాలమ్మలు
గ్రామదేవతలకే తీరొక్క పూజలు
బొడ్రాయి సాక్షిగా దసరా పండుగలు
బతుకమ్మ, బొడ్డమ్మ, బోనాల వేడుకలు
ఊరు ఊరంతా ఉత్సవ శోభలు !

పట్నం రంగేసుకున్న గ్రామీణ పల్లెలు
నవ్య నడవంత్రపు పోకడల ప్రవాహాలు
బెల్ట్ ‌షాపుల్లో హౌజ్‌ఫుల్‌ ‌బోర్డులు
కొట్టుకుపోతున్న నాటి పల్లె సౌందర్యాలు
గ్రామాలకే పట్టిన పట్టణీకరణ చెదలు !

పెంకుటిల్లు, గుడిసెల అవశేషాలు
అంతరిస్తున్న నాటి ఊరి వాసనలు
అభివృద్ధి పేరుతో గ్రామ విధ్వంసాలు
త్రిశంకు స్వర్గంలో అమాయక పల్లెలు
వాణిజ్య దాడులతో గాయాలపడ్డ గ్రామాలు !

శస్త్రచికిత్సలకే నయం కాని అగ్రహారాలు
ఆగమై పోతున్న అన్నదాత జాడలు
నిల్చున్న చెట్టునే నరుక్కునే రోజులు
ఎవరి బొంద వారె తవ్వే అకాలాలు
గ్రామాభిమానులే కరువైన ఘడియలు
పల్లెను కమ్మిన కాలుష్య కారుమబ్బులు !

చేతులు కాలక ముందే ఆకులు పడదాం
చేయి దాటక ముందే చేతులు కలుపుదాం
పల్లె పునాదుల్ని పునరుజ్జీవింపజేద్దాం
సాగుబడి రాబడితో పిల్లల్ని బడిలో చేరుద్దాం
రైతును మహారాజుగా పట్టాభిషేకం చేద్దాం
భారత సమాజాన్ని సాగుతో సక్కబెడదాం !

– మధుపాళీ
కరీంనగర్‌ – 9949700037

Leave a Reply