మీడియాకు వెల్లడించిన మంత్రి ఈటెల
కరోనా వైరస్‌పై సోషల్ డియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్రంలో ఉన్న ఎవరికీ కరోనా సోకలేదని అన్నారు. ప్రజలు వందతులు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన డియాతో మాట్లాడుతూ ప్రజలు సమస్య
తీవ్రతను అర్ధం చేసుకొని సహకరించాలని కోరారు. కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాపించదని, కరోనా అనుమానాలుంటే 104కి కాల్ చేయాలన్నారు. కరోనా సోకిన వ్యక్తి ఇంట్లోని సభ్యులకు నెగెటివ్ వచ్చిందని చెప్పారు. ఇంట్లో వాళ్లకే వ్యాధి వ్యాపించనప్పుడు ఇతరులకు వచ్చే అవకాశం తక్కువన్నారు. మహేంద్రహిల్స్‌లో ముందు జాగ్రత్త చర్యగా శానిటేషన్ నిర్వహించినట్లు చెప్పారు. దుబాయ్, ఇటలీ నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తుల్లో మాత్రమే కరోనా లక్షణాలు కనిపించాయని మంత్రి తెలిపారు. 47 మందికి పరీక్షలు నిర్వహించామని.. 45 మందికి నెగెటివ్ వచ్చిందన్నారు. ఇద్దరు అనుమానితుల శాంపిల్స్ పుణె పంపించామని ఈటల రాజేందర్ తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా కరోనా వైద్యానికి అనుమతి ఇచ్చినట్లు ఈటల రాజేందర్ చెప్పారు. ఐసోలేషన్ వార్డులు ఉన్న ప్రైవేట్ ఆస్పత్రులకు అనుమతులు ఇచ్చామన్నారు. శాంపిల్స్ సేకరణకు ప్రైవేట్ ఆస్పత్రులకు అనుమతి ఉందన్నారు. శాంపిల్స్ ఇచ్చేందుకు గాంధీకి రావాల్సిన అవసరం లేదన్నారు. మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉన్న ఆస్పత్రులు.. వైద్యసేవలు అందించేందుకు ముందుకొచ్చాయని.. కరోనా పర్యవేక్షణకు కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు మంత్రి ఈటల పేర్కొన్నారు. కరోనా వైరస్‌కు మనిషిని చంపే శక్తి లేదని వైద్యులు చెబుతున్నారని, కరోనా సోకిన చాలా మందికి దానంతట అదే తగ్గుతుందని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. 14 శాతం మందికి మాత్రమే వైద్య సేవలు అవసరమవుతుందన్నారు. రాష్ట్ర ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ఇవాళ కరోనా లక్షణాలతో 20 మంది మాత్రమే వచ్చారని, కరోనా పాజిటివ్ వివరాలను మాత్రమే కేంద్రం ప్రకటిస్తుందని మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.