Take a fresh look at your lifestyle.

వరి రైతుకు ఉరి బిగిస్తున్న పాలకులు

రైతు రాజ్యం తేస్తామంటూ, రాకాసి రాజ్యాన్ని తయారు చేస్తున్నారు నేటి పాలకులు. రైతే రాజు, రైతు సంక్షేమం, సౌభాగ్యం ప్రధాన ధ్యేయమని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామంటూ, రైతుల శ్రేయస్సు కోసం, పలు సంక్షేమ పథకాలు, రుణ సౌకర్యాలు, భీమా సౌకర్యం కల్పిస్తున్నామని, రుణమాఫీలు చేస్తున్నామని కల్లబొల్లి కబుర్లు చెబుతూ రోజురోజుకు రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా, అప్పుల ఊబిలో కూరుక పోయే విధంగా, రైతుల మనుగడే కష్టసాధ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు ఉండటంతో రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. ప్రకృతి వైపరీత్యాల కారణంగా వ్యవసాయం లాభసాటిగా లేక నష్టాల పాలు అవుతున్న టువంటి రైతులను ఆదుకోవాల్సిన, హామీలు ఇచ్చిన పాలక ప్రభుత్వాలు సరి అయిన విధంగా చర్యలు తీసుకోవడంలో, సకాలంలో రుణ పరపతి సౌకర్యాలు, రుణమాఫీ పథకం నిధులు, బడ్జెట్‌ ‌కేటాయింపులు అరకొరగా ఉండటంవల్ల రైతాంగం ఏటికేడు ఆర్థికంగా దీన పరిస్థితుల్లోకి నెట్టివేయబ డుతుండటం పాలకుల విధానాలే కారణం.

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగి, ప్రకృతి వనరులు పుష్క లంగా ఉన్న భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశంగానే కొనసాగుతూ జి డి పి లో ఎక్కువశాతం వ్యవసాయ రంగమే అందజేస్తున్న పూర్తిగా నిరాదరణ,నిర్లక్ష్యానికి గురి అవుతూ ఉన్నది., గత సంవత్సరంసెప్టెంబర్‌లో వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ల చేతికి అప్పనంగా అప్ప చెప్పేందుకు వ్యవసాయ సాగు చట్టాలను తీసుకురావడంతో దేశవ్యాప్తంగా వాటికి వ్యతిరేకంగా రైతాంగం ఉద్యమిస్తుంటే, వారిపై అనేక రకాల ఇబ్బందులకు గురి చేస్తూ, అక్రమంగ కేసులు బనాయించడం, వీటికి తోడు ప్రకృతి పరంగా వచ్చే ఇబ్బందులను ఎదుర్కొంటూ ఎముకలు కొరికే చలిలో సైతం రైతులు సాగుచట్టాలను రద్దు చేసే వరకు ఉద్యమానికి విరామం ఉండదని నిరసన దీక్షను కొనసాగిం చడంతో వందలాది మంది రైతులు చనిపోయిన, పాలకులు వాటి రద్దు కొరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం బాధాకరం..

ఆరుగాలం శ్రమించిన రైతన్న జీవితం అప్పుల ఊబిలో కూరుకు పోతుంటే అన్నదాతల ఆర్తనాదాలు పట్టించుకోకుండా మరో పిడుగు లాంటి వార్త రైతన్నల నెత్తిపై పడింది. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో వరిని అత్యధికంగా పండించేటువంటి రాష్ట్రాలైన పంజాబ్‌, ‌పశ్చిమ బెంగాల్‌ని అధిగమించి తెలంగాణ రాష్ట్రంలో వరి దిగుబడులు సాధించడం ఆనందదాయకం. కానీ ఆ ఆనందం తెలంగాణ నుంచి 24.75 లక్షల మెట్రిక్‌ ‌టన్నుల ఉప్పుడు బియ్యం( బాయిల్డ్ ‌రైస్‌) ‌మాత్రమే తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం చెప్పడంతో ఆవిరైపోయింది. 2020 -21 ఏడాది యాసంగి సీజన్కు 62.79 లక్షల మెట్రిక్‌ ‌టన్నుల ఉప్పుడు బియ్యం ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంటే 38.04 లక్షల మెట్రిక్‌ ‌టన్నుల రా రైస్‌ (‌పచ్చి బియ్యం) రూపంలో ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం మొండిగా ఉండడంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా వరి రైతులకు వర్రీ మొదలయ్యింది. దీనిపై చర్చించడానికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, పౌరసరఫరాల శాఖ మంత్రులు ఇరువురు కేంద్ర ఆహార ప్రజాపంపిణీ పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ ‌గోయల్‌ ‌తో చర్చించిన ఫలితం శూన్యం.

వరి వద్దు ప్రత్యామ్న్యాయం ముద్దు
గత యాసంగి లో రైతుల నుంచి 92.35 లక్షల మెట్రిక్‌ ‌టన్నుల వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల సంస్థను నోడల్‌ ఏజెన్సీ గా నియమించుకొని కొనుగోలు చేయడం జరిగింది. వాటిని మిల్లింగ్‌ ‌చేసిన తర్వాత 68 శాతం లెక్కప్రకారం 62.79 లక్షల మెట్రిక్‌ ‌టన్నుల బియ్యం ఉత్పత్తి అవుతుంది. యాసంగి పంట లో 100% బాయిల్డ్ ‌రైస్‌ ‌మాత్రమే వస్తుంది. కేరళ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలలో బాయిల్డ్ ‌రైస్‌ ‌డిమాండ్కు అనుగుణంగా ఆయా రాష్ట్రాల ప్రజా పంపిణీ సంస్థల అవసరాలకు తెలంగాణ నుంచి కేంద్రం బియ్యం పంపుతుంది. కానీ ఆ మూడు రాష్ట్రాలు స్వయం సమృద్ది సాధించడంతో తెలంగాణ బియ్యానికి డిమాండ్‌ ‌తగ్గిపో యింది.దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే యాసంగిలో వరి పంట సాగు చేయకూడదని, చేస్తే ఉరే నని ప్రత్యామ్నాయ పంటల సాగుకు సన్నద్ధం కావాలని సూచించడంతో, ఈ విషయం రైతుల్లో ఆందోళన భరితంగా ఉంది. తెలంగాణలో నీటి లభ్యత పెరగడం, 24 గంటల కరెంటు, రైతుబంధులు అందించడం, దీనికితోడు ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి దాన్యం సేకరించడంతో, వరికి కనీస మద్దతు ధర ఉండడంతో రైతులంతా వరి సాగుకి ఆసక్తి చూపడంతో వరి పంట దిగుబడి అధికమైంది. ఈ నేపథ్యంలో వరికి బదులు వేరే పంటల సాగు చేయాలని చెప్పడంతోరైతులు దిక్కుతోచని స్థితిలో అయోమయంలో పడ్డారు:

ప్రత్యామ్నాయ పంటలు ఇప్పటికిప్పుడు సాధ్యమా??….
ఈ సీజన్‌ ‌లో 1.4 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి కానుంది. కానీ కేంద్రం కొనుగోలు కోట మాత్రం 60 లక్షల టన్నులు మాత్రమే. ఫలితంగా వరి పంట సాగు చేయడం శ్రేయస్కరం కాదని వ్యవసాయరంగ నిపుణులు అభిప్రాయపడుతూ, శనిగలు, వేరుశనగలు, పెసర్లు, మినుములు, నువ్వులు, ఆముదాలు, పొద్దుతిరుగుడు గింజలు, కూరగాయలు, చిరుధాన్యాలు మరియు పామాయిల్‌ ‌వంటి వాటిని పండించాలని ప్రభుత్వం సూచిస్తుంది. కానీ ఈ పంటల సాగు భూములు అంత అనుకూలంగా లేవు, వాతావరణ పరిస్థితులు కూడా అంతా సవ్యంగా ఉండవు. ఉన్నఫలంగా పంటల మార్పిడి చేయడం అంత సులువు కాదు. ప్రపంచవ్యాప్తంగా నూనె గింజల, పామాయిల్‌ ‌సాగు డిమాండ్‌ ఉన్న వాటిని సాగు చేస్తే, నూనె తీయడానికి మిల్లు లేవు. వీటి సాగు వల్ల కనీసం మూడేళ్లు రైతు ఆదాయం ఉండదు. పంట చేతికి వచ్చిన తర్వాత కూడా మద్దతు ధర లభిస్తుందన్న హామీలు లేవు. వీటిలో కొన్ని పంటలకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటిస్తుంది. మిగతా వాటికి రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా మద్దతు ధర ప్రకటించాల్సిన అవసరం ఉంటుంది. అటువంటి దాఖలాలు తెలంగాణ రాష్ట్రంలో కనిపించడం లేదు. కనుక రైతులు ఇప్పటికిప్పుడు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపే అవకాశం లేదు.
పరిష్కార మార్గాలు….

ప్రత్యామ్నాయ పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించాలి. పంట ఉత్పత్తుల కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వాలి. మార్కెట్‌ ‌సెక్యూరిటీ ప్రకటించాలి. పంటల బీమా ను అమలు చేయాలి. ధరల స్థిరీకరణ నిధి ఉండాలి. పప్పు ధాన్యాలు, నూనె గింజలు, చిరుధాన్యాల సాగుకు రాష్ట్రంలో అనుకూల వాతావరణం ఉందని వ్యవసాయరంగ నిపుణులు చెబుతున్నారు. కనుక వీటి సాగు పెంచాల్సిన అవసరం, నాణ్యమైన విత్తనాలు అందించి ప్రోత్సహించాలి. మొక్కజొన్నలను మార్క్ఫెడ్‌ ‌సంస్థ ఎం ఎస్‌ ‌పి కి కొనుగోలు చేసి, పౌల్ట్రీ పరిశ్రమకు టెండర్ల ద్వారా సబ్సిడీ ధరకు అప్పగించడం జరుగుతుంది.ఆ విధంగానే సబ్సిడీపై ధాన్యాన్ని రైస్‌ ‌మిల్లర్లకు ఇవ్వాలి, అప్పుడు రైతులకు ఎంఎస్పి లభిస్తుంది. ఇండస్ట్రీ బాగుపడుతుంది. బియ్యం ఎగుమతులపై దేశంలో ఎలాంటి ఆంక్షలు లేనందున, బాయిల్డ్ ‌రైస్‌ ‌కు దక్షిణాఫ్రికా, మస్కట్‌, ‌బంగ్లాదేశ్‌ ,‌ఖతార్‌ ,‌దుబాయ్‌ ‌లాంటి వంద దేశాలు దిగుమతి చేసుకునే అవకాశం ఉన్నందున ఎగుమతులను ప్రోత్సహించాలి.

కర్ణాటక రాష్ట్రం చిరుధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు రాగుల కు కనీస మద్దతు ధర రెండు వేల రూపాయలు ప్రకటించినట్లు తెలంగాణ ప్రభుత్వం కూడా పప్పు ధాన్యాలు , నూనె గింజలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ,ఇవ్వకున్నా కనీస మద్దతు ధర ప్రకటించాలి. మార్కెట్‌ ‌భద్రత కల్పించాలి. పండించిన పంటలను ప్రాసెసింగ్‌ ‌చేసి ఎగుమతి చేస్తే మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉం‌టుంది. కావున ప్రాసెసింగ్‌ ‌పై దృష్టి పెట్టాలి.. బియ్యం నిల్వలకు కస్టమ్‌ ‌మిల్లింగ్‌ ‌రైస్‌ అనుగుణంగా నిల్వ చేసే సామర్థ్యం పెంచుకోవాలి. దేశమంతటికీ ఆహారాన్ని అందించేందుకు చెమట చుక్కలు ధార పోస్తున్న అన్నదాత ఆక్రందనలను పాలకులు పెడచెవిన పెట్టి, వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ, కార్పొరేటు, బడా పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా పాలనా విధానాలను కొనసాగిస్తూ ఉండడంతో భారత రైతాంగం అనేక సమస్యలతో విలవిలలాడుతుంది. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ప్రకటించిన పాలక ప్రభుత్వం ఆదాయం రెట్టింపు అయ్యేవిధంగా చర్యలు తీసుకోక పోగా రైతుల మనుగడనే ప్రశ్నార్థకం చేసే విధంగా, ఆత్మహత్యల పరంపర కొనసాగే విధంగా విధానాలను తీసుకురావడం ఇబ్బంది కరం. రైతుల ఆదాయాన్ని, సంక్షేమాన్ని మెరుగుపరిచేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో తగిన చర్యలు చేపట్టాలి ….

tanda sadhanandam
– తండా సదానందం, టీపీటిఏఫ్‌ ‌జిల్లాఉపాధ్యక్షుడు, మహబూబాబాద్‌ ‌జిల్లా

 

Leave a Reply