‘‘వేలాది పేజీల డాక్యుమెంటరీ, ఫోరెన్సిక్ సాక్ష్యాలను నిశితంగా అధ్యయనం చేసిన తర్వాత, దాదాపు 140 మంది వ్యక్తులను క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత, నలుగురు యువకుల హత్యలో పాల్గొన్న పది మంది పోలీసు సిబ్బందిని హత్య చేసినందుకు ‘‘సెక్షన్స్ 302 r/w 34 IPC,, 201 r/w 302 IPC, 341 IPC,’ కింద విచారణను ఎదుర్కోవాలని కమిషన్ సిఫార్సు చేసింది..’’
హైదరాబాద్‌లో యువ వైద్యురాలిపై అత్యాచారం, హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న నలుగురు పై డిసెంబర్ 6, 2019న జరిగిన ఎన్కౌంటర్ హత్యలపై విచారణ జరిపిన జస్టిస్ విఎస్ సిర్పుర్కర్ కమిషన్ తన నివేదికను సుప్రీం కోర్టుకు సమర్పించింది. 2022 మే 20వ తేదీన ఈ అంశాన్ని తిరిగి తెలంగాణ హైకోర్టుకు సూచించిన అత్యున్నత న్యాయస్థానం, కమిషన్ నివేదిక కాపీలను దిగువ సంతకం చేసినWT-JACసభ్యులతో సహా ఈ కేసు లో వున్న వాద ప్రతివాదులందరికీ అందుబాటులో ఉంచాలని ఆదేశించింది.
వేలాది పేజీల డాక్యుమెంటరీ, ఫోరెన్సిక్ సాక్ష్యాలను నిశితంగా అధ్యయనం చేసిన తర్వాత, దాదాపు 140 మంది వ్యక్తులను క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన తర్వాత, నలుగురు యువకుల హత్యలో పాల్గొన్న పది మంది పోలీసు సిబ్బందిని హత్య చేసినందుకు ‘‘సెక్షన్స్ 302 r/w 34 IPC 201 r/w,302 IPC,, 341 IPC కింద విచారణను ఎదుర్కోవాలని కమిషన్ సిఫార్సు చేసింది. నలుగురు యువకులపై పోలీసులు ఉద్దేశపూర్వకంగా చంపాలనే కాల్పులు జరిపారని, అవి వారి మరణానికి దారితీస్తాయనే స్పష్టమైన అవగాహనతోనే చేశారని కమీషన్ నిర్ధారించింది. నిందితులు పోలీసు పార్టీ నుంచి ఎలాంటి ఆయుధాలను లాక్కోలేదని, అందుకే ‘ఆత్మ రక్షణ’ కోసం కాల్పులు జరిపారనే వాదన తప్పు అని కూడా పేర్కొంది.
కమిషన్ నిస్సందేహంగా చెప్పిన అంశాలు: ‘‘చనిపోయిన నలుగురు అనుమానితులను సురక్షితంగా ఉంచడానికి వారిలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి. ఏవైనా కారణాలు లేదా చర్యలతో వారు తమ బాధ్యతను నెరవేర్చడంలో విఫలమైతే, చనిపోయిన నలుగురు అనుమానితుల మరణానికి దోహదపడేవిధంగానే వీరందరి ఉద్దేశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. అనుమానితుల మరణాల తర్వాత ఆ రికార్డులను తప్పుదోవ పట్టించడం, తప్పుడు సమాచారం ఇవ్వాలనే ఉద్దేశ్యంతో వ్యవహరించారు.
నవంబర్ 28, 2019న హైదరాబాద్ శివార్లలోని చటాన్‌పల్లి వద్ద వంతెన కింద 25 ఏళ్ల పశు వైద్యురాలు దిశ మృతదేహం అవశేషాలు దొరికిన తర్వాత సైబరాబాద్ పోలీసులు నలుగురు అనుమానితులను (మహ్మద్ ఆరిఫ్, చింతకుంట చెన్నకేశవులు, జొల్లు శివ, జొల్లు నవీన్) అదే రోజు అర్ధరాత్రి వారి ఇళ్ల నుంచి ఎత్తుకెళ్లిన విషయం, ఆ తర్వాత 2019 డిసెంబర్ 6వ తేదీ తెల్లవారుజామున పోలీసులు జరిపిన ‘ఎన్కౌంటర్’లో నలుగురు యువకులు చనిపోయిన విషయం గుర్తుండే ఉంటుంది.
అదే రోజు సాయంత్రం, ఈ కింద సంతకం చేసిన వారితో సహా తెలంగాణకు చెందిన 15 మంది మహిళా హక్కుల, పౌర హక్కుల కార్యకర్తలు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఒక మెమొరాండం ఇచ్చారు. దానిని సుఓమోటో గా తీసుకున్న న్యాయస్థానం పిల్ గా WP(PIL) నం.173 ఆఫ్ 2019) స్వీకరించింది. ఈ సంఘటనలో చనిపోయినవారి మృతదేహాలను భద్రపరచాలని, స్వతంత్ర శవపరీక్ష,PUCL vs యూనియన్ ఆఫ్ ఇండియాలో SC మార్గదర్శకాలను పాటించడం, కోర్టు పర్యవేక్షణలో విచారణతో పాటు హత్యకు పాల్పడిన అధికారులపై విచారణ జరపాలని సామాజిక కార్యకర్తలు తమ మెమొరాండం లో విజ్ఞప్తి చేసారు. దీని మీద హైకోర్టు వెంటనే స్పందించి మృతదేహాలను భద్రపరచాలని, పియుసిఎల్ మార్గదర్శకాల అమలుకు ఉత్తర్వులు జారీ చేయాలని ఆదేశించింది.
తెలంగాణ హైకోర్టు ఈ అంశాన్ని విచారణ జరుపుతున్నప్పటికీ, ‘ఎన్కౌంటర్’పై విచారణ కోరుతూ సుప్రీంకోర్టులో కొంతమంది రిట్ పిటిషన్ వేసారు. దీనిమీద విచారణ చేపట్టిన సుప్రీమ్ కోర్ట్, జస్టిస్ వి.ఎస్. సిర్పుర్కర్ నేతృత్వంలో జస్టిస్ రేఖ బల్డోటా (ముంబయి హెచ్‌సి మాజీ న్యాయమూర్తి), డా. డి.ఆర్. కార్తికేయన్ (సీబీఐ మాజీ డైరెక్టర్)లను ఇతర సభ్యులుగా విచారణ కమిషన్‌ను డిసెంబర్ 12, 2019న ఏర్పాటు చేసింది. అయితే ఈ నలుగురు యువకుల మృతదేహాలు, సాక్ష్యాధారాల సేకరణ గురించి అపెక్స్ కోర్ట్ ఆర్డర్ మౌనంగా ఉండటంతో సాక్ష్యాల సేకరణ, సంరక్షణలతో పాటు సురక్షితమైన కస్టడీ కోసం ఆదేశాలను కోరుతూ నలుగురు సామాజిక కార్యకర్తలు K..సజయ, v.సంధ్య, M.. విమల, మీరా సంఘమిత్ర లు సుప్రీం కోర్టు ముందు కేసును WP (Crl) 364/2019 నమోదు చేశారు.
ఈ విషయమై తిరిగి హైకోర్టులోనే పిటిషన్ వేసుకోవచ్చని పై నలుగురు దరఖాస్తుదారులకు సుప్రీంకోర్టు సూచన చేసింది. తదనంతరం, సాక్ష్యాలను భద్రపరచడం, సేకరించడంపై ఆదేశాలను కోరుతూ కె. సజయ తెలంగాణ హైకోర్టులో ఒక దరఖాస్తును దాఖలు చేశారు. దీని మీద రెండోసారి శవపరీక్ష, స్వాధీనం, సాక్ష్యాలను భద్రపరచడంపై తెలంగాణ హైకోర్టు వివరణాత్మక ఉత్తర్వులు జారీ చేసింది.
సిర్పుర్కర్ కమిషన్ 2021 ఆగస్టు 21న తెలంగాణ హైకోర్టు భవనంలో తన విచారణను ప్రారంభించింది. కోవిడ్ ఇంకా ఉధృతంగా ఉన్నందున, కమిషన్ భౌతిక, వర్చువల్ విచారణలను కలిపి ఒక హైబ్రిడ్ ప్రొసీడింగ్‌లను నిర్వహించడం జరిగింది. ఈ కింద సంతకం చేసిన వారి తరపున, కె. సజయ 13-09-2021న కమిషన్ ముందు విచారణకు హాజరవటం తో పాటు, కమిషన్‌కు వివరణాత్మక వ్రాతపూర్వక వాదనలను సమర్పించారు. 2021 ఆగస్టు నుండి నవంబర్ వరకు, కమిషన్ జరిపిన విచారణ కార్యకలాపాలు క్రమం తప్పకుండా ఇంగ్లీష్, తెలుగు మీడియాలో వచ్చాయి.
న్యాయవాదులు వృందా గ్రోవర్, వసుధా నాగరాజ్, సౌతిక్ బెనర్జీ లు సామాజిక కార్యకర్తల తరఫున సుప్రీం కోర్టు, తెలంగాణ హైకోర్టు, విచారణ కమిషన్ ముందు స్వచ్చందంగా కేసును వాదించారు.
అరెస్టు, రిమాండ్, దర్యాప్తు విధానాల్లో జరిగిన ఉల్లంఘనలను 387 పేజీల కమిషన్ నివేదిక బట్టబయలు చేసింది. దుర్మార్గమైన విషయం ఏమంటే, నిందితులుగా పేర్కొన్న ముగ్గురు యువకులు పాఠశాల రికార్డుల ప్రకారం మైనర్లు అనే వాస్తవాన్ని పోలీసులు ఉద్దేశపూర్వకంగా పక్కకు పెట్టిన విషయాన్ని నివేదిక బహిర్గతం చేసింది. ఈ సంఘటన సమయంలో ఈ కేసుకి నేతృత్వం వహిస్తున్న పోలీసు శాఖ సీనియర్ అధికారులు, పోలీసు డిపార్టుమెంటు ముందుకు తీసుకువచ్చిన కథనాన్ని అంగీకరించి ‘‘విచారణ’’ నిర్వహించిన సిట్ అధికారుల మీద కమిషన్ ఏ విధమైన చర్యలకు సిఫార్సు చేయనప్పటికీ, వాటికి సంబంధించిన సాక్ష్యాలను వివరంగా నమోదు చేయటం జరిగింది.
ప్రభుత్వ అధికారులు ప్రధానంగా చట్టానికి అతీతమైన పద్ధతులను అమలు చేస్తున్న సమయంలో, కమిషన్ చేసిన పరిశీలనలు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ‘‘మూకోన్మాదం ఎలా అయితే ఆమోదయోగ్యం కాదో, తక్షణ న్యాయం అనే ఆలోచన కూడా అదే కోవలోకి వస్తుంది. ఎలాంటి పరిస్తితిలోనయినా సరే ‘రూల్ ఆఫ్ లా’ ని అమలు చేయటమే ప్రాధాన్యంగా ఉండాలి. నేరానికి శిక్ష చట్టం ద్వారా నిర్దేశించబడిన విధానం ద్వారా మాత్రమే ఉండాలి’’. అత్యంత క్లిష్ట తరమైన బాధ్యతను చేపట్టిన కమిషన్ పనిని మేము అభినందిస్తూ, నివేదికను స్వాగతిస్తున్నప్పటికీ, సంఘటనలో దర్యాప్తు, ఎన్కౌంటర్, ఆ తర్వాత సాక్ష్యాలను కప్పిపుచ్చడంలో స్పష్టమైన ప్రమేయం వున్న అత్యంత సీనియర్ పోలీస్ ఆఫీసర్ల పేర్లను మినహాయిస్తూ, వారి పాత్ర మీద ఏ విధమైన చట్టపరమైన చర్యలకు సిఫార్సు చేయకపోవడం లోపం గానే మేము భావిస్తున్నాము.
కమిషన్ నివేదిక నేపథ్యంలో, తెలంగాణ హైకోర్టు లోనే ఈ అంశం మీద విచారణ జరపాలని సుప్రీమ్ కోర్ట్ ఆదేశించింది. ఈ సందర్భంగా మా డిమాండ్లు:
1. కమీషన్ నివేదికలో పేర్కొన్న పోలీసులందరిపై వెంటనే ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయాలి. వారిని వెంటనే అరెస్టు చేయాలి.
2. పౌరుల ప్రాణాలను చట్టవిరుద్ధంగా హరించిన పోలీసు సిబ్బంది, సీనియర్ మోస్ట్ ఆఫీసర్ల ‘కమాండ్ రెస్పాన్సిబిలిటీ’తో సహా జవాబుదారీతనాన్ని తీసుకురావటానికి ఆదేశాలు ఇవ్వాలి. చట్టబద్ధమైన కార్యాచరణ మీద ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరింపజేయడానికి నివేదికలో పేర్కొన్న పది మంది పోలీసు సిబ్బందిపై వేగవంతమైన ప్రాసిక్యూషన్ కోసం చర్యలు తీసుకోవాలి.
3. నలుగురు అనుమానితులుగా పేర్కొన్న ఈ నలుగురి మీద జరిగిన హత్యల కారణంగా, ‘దిశ’ పై జరిగిన దారుణ హత్యాచారం విచారణ మరుగున పడిపోయింది. దీనిపై త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేయాలి. ఆ అంశం మరుగున పడకుండా చూడాలి.
4. ఎన్కౌంటర్ లో మరణించిన నలుగురి యువకుల కుటుంబాలకు ప్రభుత్వం సరి అయిన పరిహారం అందించాలి. అలాగే ప్రతి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి.
5. ‘మహిళలకు భద్రత, స్వేచ్ఛ’ పేరుతో పోలీసులు, ప్రభుత్వ వ్యవస్థలు అన్యాయంగా, చట్టవ్యతిరేకంగా అనుమానితుల హత్యలకు పాల్పడటం అనేది ఎప్పటికీ కూడా అన్యాయానికి గురైన మహిళలకు, హింస నుండి బయటపడినవారికి, వారి కుటుంబాలకి ఏమాత్రం న్యాయం చేయలేక పోవటమే అవుతుంది. చట్టబద్ధమైన వ్యవస్థల ద్వారా మహిళల హక్కులను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము.
ఈ బూటకపు ఎన్‌కౌంటర్‌ను సీనియర్ పోలీసు అధికారులు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు విపరీతంగా ప్రశంసించారు. వారందరికీ సామాజిక కార్యకర్తలుగా మేము గుర్తు చేస్తున్న అంశం ఒక్కటే. రాజ్యాంగ విరుద్ధమైన పద్ధతులను నిరంతరం సవాలు చేస్తూ, న్యాయం కోసం, మా హక్కులను పొందేందుకు ప్రతి వ్యవస్థనూ బాధ్యులుగా, జవాబుదారీగా ఉంచుతాము.
అపెక్స్ కోర్టు ముందుకి వెళ్ళిన పిటిషనర్లు
– K. సజయ, వి. సంధ్య, ఎం. విమల, మీరా సంఘమిత్ర
(‘దిశ ఎన్కౌంటర్’ కేసులో సుప్రీమ్ కోర్ట్ నియమించిన సిర్పుర్కర్ కమిషన్ వెల్లడించిన నివేదికపై తెలంగాణ మహిళా ట్రాన్స్‌జెండర్ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ప్రకటన..)