Take a fresh look at your lifestyle.

ఆకాంక్షలకనుగుణంగా పాలన..

  • నాడు గుక్కెడు నీళ్ల కోసం తపన…
  • నేడు ధాన్యపు సిరుల జిల్లాగా సిద్ధిపేట
  • గోదావరి జిల్లాలను తలదన్నేలా సిద్ధిపేట జిల్లా
  • త్వరలో సిఎం కేసీఆర్‌ ‌చేతుల మీదుగా కలెక్టరేట్‌, ‌సిపి కార్యాలయం ప్రారంభోత్సవాలు
  • మీడియాతో మంత్రి హరీష్‌రావు
  • నిరాడంబరంగా రాష్ట్రావతరణ వేడుకలు

రంగధాంపల్లి అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించిన మంత్రి హరీష్‌రావు, కలెక్టర్‌ ‌తదితరులు
సిద్ధిపేట, జూన్‌ 2 (‌ప్రజాతంత్ర బ్యూరో): కొరోనా నేపథ్యంలో రాష్ట్రావతరణ వేడుకలు అత్యంత నిడాంబరంగా జరిగాయి. తెలంగాణ 7వ రాష్ట్ర అవతరణ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా జాతీయ జెండాను ఎగరవేసి, అమరవీరులకు నివాళులర్పించారు. ఈ మేరకు బుధవారం సిద్ధిపేటలోని రంగధాంపల్లి చౌరస్తాలో గల అమరవీరుల స్థూపం వద్ద మంత్ర తన్నీరు హరీష్‌రావు, ఎమ్మెల్సీ ఫారుఖ్‌హుస్సేన్‌, ‌జిల్లా పరిషత్‌ ‌ఛైర్‌పర్సన్‌ ‌వేలేటి రోజారాధాక్రిష్ణశర్మ, జిల్లా కలెక్టర్‌ ‌పరపతి వెంకట్రామరెడ్డి, మునిసిపల్‌ ‌ఛైర్‌పర్సన్‌ ‌కడవేర్గు మంజుల-రాజనర్సు, మునిసిపల్‌ ‌కమిషనర్‌ ‌డాక్టర్‌ ‌కెవి.రమణాచారి, వార్డు కౌన్సిలర్‌ ‌వంగ రేణుక-తిరుమల్‌రెడ్డి తదితరులు పూలు వేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టరేట్‌ ‌కార్యాలయంలో రాష్ట్రావతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌, ‌జిల్లా ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి హరీష్‌రావు మీడియాతో మాట్లాడుతూ…అమరుల త్యాగాలు, ప్రజా పోరాటాలు ఫలితంగా తెలంగాణ స్వరాష్ట్రం ను సాధించుకున్నామనీ, తెలంగాణ కోసం సిఎం కేసీఆర్‌ ‌పదవులతో పాటు ప్రాణాలను ఫణంగా పెట్టారన్నారు. కేసీఆర్‌ ‌నాయకత్వంలో ఢిల్లీని కదిలించి స్వరాష్ట్రంను సాధించుకున్నామన్నారు.

స్వరాష్ట్రం తెలంగాణలో ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల కు అనుగుణంగా పని చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి •కేసీఆర్‌ ‌సారథ్యంలో తెలంగాణను ఆదర్శ రాష్ట్రంగా, నమూనా రాష్ట్రంగా తీర్చిద్దుకున్నామనీ, 70యేండ్లలో జరగని పనులను 7యేండ్లలో పూర్తి చేశామన్నారు. సిద్ధిపేట జిల్లా ఏర్పాటు అనేది ఈ ప్రాంత ప్రజల 4 దశాబ్దాల కల అని, ఈ కలను సిఎం కేసీఆర్‌ ఆశీస్సులతో నెరవేర్చుకున్నామన్నారు. ఉద్యమానికి నాడు దిక్సూచిలా ఉన్న సిద్దిపేట జిల్లా నేడు అభివృద్ధికీ దిక్సూచిగా ఉందన్నారు. ఆలయాల జిల్లా, జలాశయాల ఖిల్లాగా సిద్దిపేట నేడు చరిత్ర పుటల్లో నిలిచిందన్నారు. ఒకనాడు గుక్కెడు నీళ్లు కోసం తపించిన జిల్లా, ఆకలి చావులు, ఆత్మహత్యలు, అంబలి కేంద్రాలకు చిరునామా ఉన్న సిద్దిపేట జిల్లా నేడు పసిడి పంటలు, ధాన్యపు సిరులుకు ప్రసిద్ధి పొందిందన్నారు. మండు టెండల్లో జిల్లాలోని వాగులు, వంకలు గోదావరి జలాలతో జలకలను సంతరించుకున్నాయన్నారు. ఈ నెల రెండో వారంలో కొత్తగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌, ‌పోలీస్‌ ‌కమిషన రేట్‌ ‌లను రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు హరీష్‌రావు తెలిపారు.

ఈ వానాకాలం నుంచే మల్లన్నసాగర్‌ ‌జలాశయం ఫలితాలు అందేలా చూస్తున్నామనీ, సిద్దిపేట జిల్లాలో పంట కాలువలు, పిల్ల కాల్వల నిర్మాణంకు రైతులు ఉద్యమ స్ఫూర్తితో స్వచ్చందంగా సహకరించాలనీ, గోదావరి జిల్లాలను తలదన్నేలా సిద్దిపేట జిల్లా ఆవిర్భవిస్తుందన్నారు. కరువు జిల్లా ను స్వరాష్ట్రంలో కల్పతరువు జిల్లాగా తీర్చిదిద్దామనీ, సంక్షేమం లోనూ సిద్దిపేట నెంబర్‌ ‌వన్‌గా చేస్తున్నామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పెన్షన్ల కోసం సిద్ధిపేట జిల్లాలో కేవలం 36 లక్షలు ఖర్చు చేస్తే…నేడు 100రేట్లు పంచి 37 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. రైతులకు వెన్ను దన్నుగా ఉండేందుకు రైతుబంధు, రైతు బీమాను అమలు చేస్తున్నామన్నారు. జలాశయాల నిర్మాణంతో ఆయిల్‌ ‌ఫామ్‌ ‌సాగుకు జిల్లాను అనువుగా తీర్చిదిద్దామన్నారు. ఈ నెల 5న జిల్లాలో 50 వేల ఆయిల్‌ ‌ఫామ్‌ ‌మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమంకు శ్రీకారం చుట్టనున్నామనీ, గోదావరి జలాలలో ఎకరాకు పంట దిగుబడి 5 క్వింటాళ్ల మేర పెరిగిందన్నారు. సిద్దిపేట జిల్లాను ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దేందుకు సంపూర్ణ సహకారం, ఆశీస్సులు అందజేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జిల్లా ప్రజల పక్షాన మంత్రి హరీష్‌రావు ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply