- తెలంగాణ బచావో సదస్సులో ప్రొఫెసర్ హరగోపాల్
- కేసీఆర్‌ను గద్దె దించేందుకు ఉద్యమకారులంతా ఐక్యం కావాలి: టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్
- రాష్ట్రంలో సమస్యలపై ఎలా పోరాడతామనేది పెద్ద ప్రశ్న
- అదానీ, అంబానీ తర్వాత అత్యంత ధనవంతుడు కేసిఆర్
- తెలంగాణ బచావో అనేది భారత్ బచావోలో అంతర్భాగం
- సదస్సులో పలువురు వక్తల అభిప్రాయం
ముషీరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 10 : అసలు ఊహించని, దిగజారిన రాజకీయాలతో వ్యవస్థ నాశనం అయిపోతుందని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో వీఎస్టీ ఫంక్షన్ హాల్లో ‘మిలియన్ మార్చ్ స్ఫూర్తి కొనసాగిద్దాం – తెలంగాణను కాపాడుకుందాం’ అనే నినాదంతో ‘తెలంగాణ బచావో సదస్సు’ తెలంగాణ జనసమితి ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ పిఎల్.విశ్వేశ్వర్ రావు అధ్యక్షతన జరిగింది. వక్తలు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ కోసం చేపట్టిన మిలియన్ మార్చ్ స్ఫూర్తితో భౌగోళిక తెలంగాణ స్థానంలో ప్రజాస్వామిక తెలంగాణ ఆవిర్భావం కోసం ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సందర్బంగా హాజరైన ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ…తెలంగాణా కోసం పోరాటం చేసిన వాళ్లంతా సమాజాన్ని నాశనం చేసే రాజకీయ నాయకుల కోసం త్యాగం చెయ్యలేదని అన్నారు. ప్రజాస్వామ్య రాజకీయాల కోసమే తమ లాంటి వాళ్ళం ఉద్యమాల్లో పాల్గొన్నామని అన్నారు. ప్రజస్వామ్యానికి సింబల్స్‌గా ఉన్నది జయశంకర్ నారాయణ, కోదండరామ్ అని అన్నారు.
ప్రజల సంక్షేమం కోసం ఉద్యమించిన నాయకులు ఉన్నారు కానీ ఇప్పుడు దిగజారిపోయిన రాజకీయ వ్యవస్థ చూస్తున్నాం అని అన్నారు. తెలంగాణ నుండి ఇప్పుడు ప్రభుత్వం భారత రాష్ట్ర సమితికి వెళ్ళిందని, మనం అనుకున్న తెలంగాణ ఎటు పోయిందో తెలియని పరిస్థితి దాపురించిందని అన్నారు. తెలంగాణ వొచ్చాక ఏమి జరిగిందని విద్యార్థులు మమ్మల్ని ప్రశ్నించారని, దానికి సమాధానం లేదన్నారు. ప్రజాస్వామ్య తెలంగాణ కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు తెలంగాణ బచావో రేపు భారత్ బచావో అనే పరిస్థితి వస్తుందని అన్నారు. తెలంగాణను రక్షించుకోవాల్సిన అవసరం ఉందని, అందుకే ఈ సదస్సు నిర్వహించామని అన్నారు. రాష్ట్ర విభజన కారణంగా తెలంగాణకు వొచ్చిన వనరులు కారణంగానే సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి పాలనా సౌలభ్యం లభించినట్టు తెలిపారు. రాష్ట్రంలో ఎన్నడూ ఊహించని విధంగా అవినీతి విచ్చలవిడిగా పెరిగిందన్నారు తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ వొచ్చిన తర్వాత చేసే ఉద్యమం ఇంతకంటే పెద్దగా ఉండాలని ప్రొఫెసర్ జయశంకర్ చెప్పినట్టు గుర్తు చేశారు. టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ను గద్దె దించేందుకు ఉద్యమకారులంతా ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో ప్రజాస్వామిక పాలన కోసం ప్రతి ఒక్కరం ఉద్యమించాలన్నారు. నిజాం రాజ్యాన్ని కూల్చడానికి ప్రజా సంఘాలు కీలకంగా పనిచేసినట్టుగానే, ప్రతిపక్షమే లేని తెలంగాణలో ప్రజాసంఘాలు ప్రతిపక్ష పాత్రను పోషించి సీఎం కేసీఆర్ నిరంకుశ, నియంతృత్వ పాలనను గద్దె దించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నొక్కి చెప్పారు.
భారత్ జోడో అభియాన్ కన్వీనర్ ప్రొఫెసర్ యోగేందర్ యాదవ్ మాట్లాడుతూ…తెలంగాణ బచావో అనేది భారత్ బచావోలో అంతర్భాగమేనని అన్నారు. కేంద్రంలోని మోదీ, తెలంగాణలో కేసీఆర్లు రాజకీయాలను వ్యాపారంగా మార్చారని తీవ్రంగా ధ్వజమెత్తారు. రిటైర్డ్ ఐఎఎస్ అకునురి మురళి హాజరై మాట్లాడుతూ మనది పేద దేశం కాదు, పేద రాష్ట్రం కాదని అన్నారు. అదానీ, అంబానీ తర్వాత అత్యంత ధనవంతుడు కేసిఆర్ అని అన్నారు. అలీబాబా నలభై దొంగలు ఉంటే వీళ్ళు వంద దొంగలు ఉన్నారని ఎద్దేవా చేశారు. బడ్జెట్ పెరుగుతుంది కానీ ప్రజల బతుకులు మారడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. దిల్లీలో కూడా దొంగలు పడ్డారని, తెలంగాణ బచావో అనాలి, భారత్ బచావో అని కూడా అనాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి క్లియర్‌గా కనిపిస్తుందని అన్నారు. దేశ రాజకీయం ఒక వ్యాపార సామ్రాజ్యంగా మార్చుతున్నారని అన్నారు. ఏంఐఎం ఇతర రాష్ట్రాల్లో అభ్యర్థిని నిలబెడితే రెండు నుంచి ఐదు కోట్లు వాళ్లకు ఇస్తున్నారని అన్నారు. కేసిఆర్ వద్ద మూలుగుతున్న ధనంతో అదే రకంగా బీఆర్‌ఎస్ విస్తరణ చేయాలని కేసిఆర్ చూస్తున్నాడని అన్నారు. ప్రొఫెసర్ రమా మెల్కోటే మాట్లాడుతూ ఆధిపత్యం, భావ ప్రకటనా స్వేచ్ఛను హరిస్తున్న పరిస్థితి తెలంగాణలో ఇంకా ఉండటం బాధాకరం అన్నారు. 1990-2000 లో రైతుల ఆత్మహత్యలు ఉన్నట్టే ఇప్పటికీ కొనసాగుతున్నాయని, ఏమీ మారలేదన్నారు.
తెలంగాణలో సమస్యలపై ఎలా పోరాడతామనేది పెద్ద ప్రశ్నగా మిగిలి పోతుందన్నారు. స్త్రీల ఆత్మ హత్యలు, చంపుకోవడాలు, హింస పెరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. అంగన్వాడీలో ఆయాలకు జీతం సరిగ్గా రాదు, చాలా మంది ఆడపిల్లలకు టాయిలెట్లు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలన్నీ సామాజిక అంశాలు మాత్రమే కాదని, ఇవి రాజకీయ అంశాలే అని గుర్తించాలన్నారు. స్త్రీలు రావాలి, ఎదగాలి అనుకున్నప్పుడు సామాజిక అంశాలపై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి వెళ్తే ఇది హైదరాబాదేనా అని అనిపించిందన్నారు. ఈ సమస్యలు రాజకీయ పార్టీలవి కాదు, ప్రజలవని గుర్తించాలన్నారు. ఈ సదస్సులో ప్రొఫెసర్ తిరుమలి, ప్రొఫెసర్ వెంకట్ నారాయణ, పివోడబ్ల్యూ సంధ్య, వీక్షణం వేణుగోపాల్, ప్రజా వాగ్గేయకారులు గద్దర్, అందె శ్రీ, న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు గోవర్ధన్, టీజేఎస్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు ఎం.నర్సయ్య, నాయకులు సలీం పాషా, ధర్మార్జున్, ముస్తాక్ తదితరులు పాల్గొని మాట్లాడారు.