- భౌతిక దూరం పాటించేలా చర్యలు
- సిటీ బస్సులకు
- ఇప్పట్లో అనుమతి లేదు: ఆర్టీసీ ఎండి
విజయవాడ,మే 20 : ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి ఆర్టీసీ బస్సు సర్వీసులను పునఃప్రారంభించ నున్నట్లు సంస్థ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ తెలిపారు. గురువారం ఉదయం 7గంటలకు తొలి బస్సు సర్వీస్ ప్రారంభిస్తున్నామన్నారు. సిటీ బస్సు సర్వీసులు తరువాత ప్రారంభిస్తామని చెప్పారు. అంతర్రాష్ట్ర సర్వీసులపై నిషేధం కొనసాగుతుందన్నారు. రాత్రిపూట కర్ఫ్యూ ఉంటుంది. అయినా వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని రాత్రి పూట బస్సులు నడుపుతామని పేర్కొన్నారు. కానీ, బస్ స్టాండ్‌కి రాత్రి 7 లోపు చేరుకోవాలని సూచించారు. సూపర్ లగ్జరీ బస్సుల్లో సీట్లను కుదించాం. ప్లలె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో కూర్చోకూడని సీట్లకు మార్క్ చేశామన్నారు. నిత్యావసర వస్తువుల కోసం కొన్ని బస్సులు తిప్పాం. వలస కూలీల కోసం అన్ని చెక్ పోస్ట్‌లలో బస్సులు ఉంచాం. రిలీఫ్ సెంటర్లలో వాళ్లని చేరవేసేందుకు జిల్లా అధికారుల ఆదేశాల మేరకు బస్సులు ఏర్పాటు చేశాం. 65 ఏళ్ళు దాటిన వాళ్ళు, 10 ఏళ్ల లోపు పిల్లలను అత్యవసర మైతేనే బస్సులో అనుమతిస్తాం. నెమ్మదిగా ఆర్ధిక వృద్ధి పెంచే దిశగానే బస్సు సర్వీసులు పెంచుతున్నాం. కాబట్టి 70 శాతం సర్వీసులు, అంటే 1683 బస్సులు మాత్రమే ప్రారంభిస్తున్నాం. ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని ఏసీ బస్సులు నడుపుతాం. కానీ దుప్పట్లు ఇవ్వము. ఛార్జీలను పెంచట్లేదు ’ అని ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ చెప్పారు.విజయవాడ, విశాఖలో సిటీ బస్సు సర్వీసులు నడపట్లేదని చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి అనుమతి వచ్చిన తర్వాతే అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు ఉంటాయన్నారు. బుధవారం ఎండీ ప్రతాప్ డియా సమావేశంలో మాట్లాడుతూ కరోనా సోకే అవకాశం లేకుండా బస్సులో సీట్లు తగ్గించి, భౌతిక దూరం ఉండేలా ఏర్పాటు చేశామని అన్నారు.
ప్రయాణికులు తప్పనిసరిగా మాస్క్ ధరించాలన్నారు. ఇప్పటివరకు ప్రత్యేక సర్వీసులు మాత్రమే నడిపాం. ఆటోమేటిక్‌గా చేతులను శుభ్రపరిచే శానిటైజర్ యంత్రాలను అందుబాటులో ఉంచుతాం. ప్రతి బస్టాండ్‌లోని ప్రతి షాపులో మాస్క్‌లు, శానిటైజర్ అమ్మకాలు ఉంటాయి. మాస్క్ ధర రూ.10 మించకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నాం. ఆన్లైన్లో మాత్రమే టికెట్ బుకింగ్‌కు అవకాశం ఉంది. ఆర్డినరీ బస్సులకు కూడా ఆన్లైన్ రిజర్వేషన్ సౌకర్యం కల్పించాం. అన్ని వ్యాలెట్లు, కార్డులు సహా ఆన్లైన్ బుకింగ్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవచ్చని ఎండీ వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా రేపు 1683 బస్సు సర్వీసులు ప్రారంభమవుతాయని ప్రతాప్ ప్రకటించారు. దశల వారీగా బస్సుల సంఖ్య పెంచుతామన్నారు. అనుమతి వచ్చాకే ఇతర రాష్ట్రాలకు బస్సులు నడుపుతామన్నారు. అనుమతి కోసం తెలంగాణ సహా పొరుగు రాష్ట్రాల సీఎస్‌లకు లేఖలు రాశామన్నారు. ఇక ప్రతి ఒక్కరూ బస్సుల్లో భౌతిక దూరం పాటించి, మాస్కు ధరించాలన్నారు. ఆర్టీసీ అధికారులకు ప్రయాణికులు సహకరించాలని ఆర్టీసీ ఎండీ విజ్ఞప్తి చేశారు.