కొరోనా వైరస్ తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న నేపథ్యంలో అధిక సంఖ్యలో పరీక్షలు నిర్వహించడం సమస్యగా మారింది. పైగా కరోనా పరీక్షల కిట్లు ఖర్చుతో కూడుకున్న పని. అయితే ఈ సమస్యను అధిగమించేందుకు ఐఐటీ హైదరాబాద్ పరిశోధక బృందం రూ.600కే కరోనా నిర్దారణ పరీక్ష కిట్‌ను అభివృద్ధి చేసింది. దీనితో 20 నిమిషాల్లోనే ఫలితాన్ని తెలుసుకోవచ్చు. క్లినికల్ ట్రయల్స్ పూర్తయిన ఈ కిట్‌కు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) నుంచి అనుమతి లభించగా.. పేటెంట్ కోసం దరఖాస్తు చేసినట్లు సుప్రజ పేర్కొన్నారు. ఐఐటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ శివ్‌గోవింద్‌సింగ్ పర్యవేక్షణలో విద్యార్థులు సూర్యస్నాత త్రిపాఠి, పట్టా సుప్రజ ఈ కిట్ అభివృద్ధిలో భాగస్వాములయ్యారు.
ప్రస్తుతం కరోనా నిర్దారణ కోసం ఆర్‌పీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీనివల్ల ఫలితాల కోసం ఎక్కువ సమయం పడుతోంది. ఖర్చు కూడా ఎక్కువగా ఉంటోంది. ఈ కిట్ అభివృద్ధి చేసిన ఇద్దరు సభ్యుల బృందంలో పట్టా సుప్రజ వివరాలు వెల్లడించారు. ఒకేసారి ఎక్కువ మొత్తంలో వీటిని ఉత్పత్తి చేస్తే రూ.350లకే ఈ కిట్‌ను అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉన్నట్లు ఆమె తెలిపారు. అయితే తమ కిట్‌ను సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చని అన్నారు.