Take a fresh look at your lifestyle.

మేడారం ఆదాయం రూ.11 కోట్లు! కొనసాగుతున్న హుండీల లెక్కింపు

Rs 11 crore in revenues Count of ongoing Hundis
మేడారం మహాజాతర హుండీల లెక్కింపు ఇంకా కొనసాగుతున్నది. హుండీ ఆదాయం ఈసారి రూ.11కోట్లు దాటవచ్చని దేవాదాయశాఖ అసిస్టెంట్‌ ‌కమిషనర్‌ ‌వెల్లడించారు. హుండీలన్నీ భక్తుల కానుకలతో నిండిపోయాయి. హుండీల్లో మన కరెన్సీనోట్లతోపాటు విదేశీ కరెన్సీ, బంగారం, వెండి ఆభరణాలు పెద్ద ఎత్తున దర్శనమిస్తున్నాయి. హుండీల నుంచి కుప్పతెప్పలుగా బయట పడుతున్న కానుకలను చూసి లెక్కిస్తున్న సిబ్బంది ఆశ్చర్యానికి గురువుతున్నారు. హన్మకొండలోని తిరుమల తిరుపతి దేవస్థానంలో మేడారం జాతర హుండీల లెక్కింపు కొనసాగుతుంది. రూపాయి నాణెలు మొదలుకొని నోట్లతో పాటు రద్దు అయిన పాతనోట్లు, వెండి, బంగారు కడియాలు, కుంకుమ బరిణెలు, ప్రతిమలు బయటపడుతున్నాయి. దీంతో గత జాతర కంటే ఈసారి మరింత ఆదాయం అధికంగా వస్తుందని దేవాదాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మేడారం జాతర హుండీల లెక్కింపు వేగంగా కొనసాగుతున్నది. ఈ నెల 12న మొదలైన హుండీ లెక్కింపు మరో మూడు, నాలుగు రోజులు కొనసాగనున్నట్లు తెలుస్తుంది. భక్తుల రద్దీకి అనుగుణంగా ఈ సారి దేవాదాయ అధికారులు మొత్తం 494 హుండీలను ఏర్పాటు చేశారు.

ఇందులో 454 ఇనుప హుండీలు, 38 వస్త్రంతో తయారు చేసిన హుండీలు, ఇవిగాక ఒడి బియ్యం సమర్పించేందుకు ప్రత్యేకంగా మరో 2 హుండీలు ఉన్నాయి. భారీ భద్రత, సీసీ కెమెరాల నిఘా నీడలో లెక్కింపు కొనసాగుతున్నది. మొత్తం ఇప్పటి వరకు లెక్కించిన హుండీలలో రూ. 9 కోట్ల 81లక్షల 87వేలకు ఆదాయం లభించింది.2018లో జరిగిన జాతరకు హుండీలలో రూ.10కోట్ల 70 లక్షల ఆదాయం వచ్చింది. ఈసారి అంతకంటే అధికంగా ఆదాయం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరో మూడు రోజులలో కరెన్సీ లెక్కింపు పూర్తి అయిన తరువాత చివరి రోజున బంగారం, వెండి, విదేశీ కరెన్సీ, నాణెలు లెక్కించనున్నారు. దీంతో ఇంకో 30 శాతం ఆదాయం పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా. అయితే వర్షం కారణంగా హుండీల్లో నీరు చేరడంతో నోట్లు తడిసిపోయి బూజుపట్టాయి. వాటిని శుభ్రపరచి లెక్కించడంలో ఆలస్యం జరుగుతున్నదని దేవాదాయ అసిస్టెంట్‌ ‌కమిషనర్‌ ‌తెలిపారు.

Leave a Reply