అధికారంలో ఉన్నవారు చేస్తున్న అప్పు కొండలా పెరిగి పోతుంది. ప్రతి పక్షాలు, మీడియా పరి శీలకులు ఈ విష యాన్ని ఎప్ప టికప్పుడు ప్రజల ముందుకు తెస్తూనే ఉన్నారు. కాటికి కాళ్ళుచాపిన వారి నుండి పుట్టబోయే బిడ్డ వరకు ప్రజల ఒక్కొక్కరి నెత్తిమీద వేల రూపాయల అప్పు ఉందని ఆర్ధిక నిపుణులు తమ వ్యాసాల రూపంలో వెలుగులోకి తెస్తూనే ఉన్నారు. అయినా ప్రజలకు చీమ కుట్టినట్లు కూడా ఉండటంలేదు. కూరగాయలు అమ్ముకునే వ్యక్తి ఇంటి ముందుకు వస్తే రూపాయి, రెండు రూపాయల దగ్గర బేరమాడతారు. దీనిని మనం ఎలా చూడవచ్చంటే, వెనుక నుండి ఏనుగంత పోయినా పర్వాలేదు కానీ ఎదురుగా చీమ, దోమంత పోయినా తట్టుకోలేరు. దీని పూర్వపరాలను మనం ఒకసారి పరిశీలించినట్లయితే తెలంగాణ ప్రభుత్వం మరోసారి లేఅవుట్ క్రమబద్దీకరణ పథకం(ఎల్‌ఆర్‌ఎస్)ను జి.ఓ. 131 రూంలో ముందుకు తీసుకొచ్చింది. దీని ప్రకారం ఓటుకు వెయ్యి రూపాయలు తీసుకున్నవారు గానీ, టిఆర్‌ఎస్ అంటే చొక్కా చించుకునేవారైనా, ఎవరైనా బీద మధ్య తరగతి ప్రజలకు 200 గజాల స్థలం ఉన్నవారి జేబులో నుండి లక్ష రూపాయలకు పైగా సమర్పించుకోవాల్సిందే. అంటే మనకు ఎదురుగా ఓటుకు వెయ్యి రూపాయలు ఇచ్చి వెనకాల లక్ష రూపాయలు తీసుకున్నారన్నమాట. అయినా చాలా మంది ప్రజలు ముందు ఇచ్చిన వెయ్యికే జై కొడుతున్నారు తప్ప వెనుక లక్ష కొట్టేశారనేది చూడటం లేదు. అందుకే ఎల్‌ఆర్‌ఎస్ గురించి సోషల్ మీడియాలో ప్రభుత్వం మీద సెట్నెర్‌లు వస్తున్నాయి. వంద ఎకరాలు ఉన్న భూస్వామికేమో రైతు బంధు పేరిట పది లక్షల రూపాయలను ప్రభుత్వమే ఇస్తుంది. అదే ప్రభుత్వం వంద గజాల ఇంటి స్థలం ఉన్న అతి సామాన్యుల దగ్గర లక్ష రూపాయలు వస్తూలు చేస్తారా? ఇదెక్కడి న్యాయం అని అంటున్నారు.
ప్రభుత్వం ఇలా ఎల్‌ఆర్‌ఎస్ జి.ఓ. తీసుకురావడం వెనుక కారణం లేకపోలేదు. సామాన్య ప్రజలకు రోజు ఇల్లు గడవటానికి డబ్బులు ఏవిధంగా అవసరమో ప్రభుత్వం నడవటానికి కూడా అదేవిధంగా కావాలి. అప్పుల కుప్పైన రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం తాను నడవటానికి ఐదు వేల కోట్ల రూపాయల టార్గెట్‌తో ఈ ఎల్‌ఆర్‌ఎస్‌ను తీసుకువచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం తన మొత్తం అప్పుల్లో నుండి ఇప్పుడు మన దగ్గర ఐదు వేల కోట్ల రూపాయలు రాబట్టుకుంటుంది. ఇది ఇంతటితో ఆగుతుందా! ఆగదు, మున్ముందు కూడా భయంకరయమైన రోజులు వస్తాయనేది నిజం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు 2014లో రాష్ట్రంపై 69 వేల 517 కోట్ల రూపాయల అప్పు మాత్రమే ఉన్నది. నేడు అది 2019 మార్చి చివరి నాటికి లక్షా 80 వేల 239 కోట్లకు చేరినట్లు ఆనాటి లెక్కలు చెబుతున్నాయి. నేడది ఇంకా పెరిగి ఉంటుంది. ఇప్పుడు ఎల్‌ఆర్‌ఎస్ రూపంలో ఐదువేల కోట్లనే వసూలు చేస్తున్నారు. మరి లక్షా 80 వేల కోట్ల రూపాయల అప్పును పూడ్చటానికి ప్రభుత్వం సిద్ధపడితే పరిస్థితి ఏమిటి? కొండలాగ పేరుకుపోయిన అప్పుకు, ఇప్పుడు మరలా మనకు అప్పు పుట్టే అవకాశం లేదు. ప్రభుత్వం తన బండిని నడపాలంటే డబ్బు కావాలి. కావాలంటే ప్రజ్నపైన పరోక్షంగా ఏదోవిధంగా రుద్దాలి. ప్రభుత్వం ఈ విధంగా తెగబడితే 10 శాతం ధనవంతులకు ఏమీ కాదు. 90 శాతం పేద మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడతారు. కాళేశ్వరంతోపాటు అనేక ప్రాజెక్టులను రీడిజైన్‌ల పేరుతో అంచనాలు పెంచి జేబుల్లో వేసుకుంటే పరిస్థితి ఈ విధంగానే ఉంటుంది. ఎన్నికలకు సంవత్సరం ముందు వరాలు కురిపిద్దాం, ఎన్నికలప్పుడు ఓటుకు నోటు ఎలాగూ ఉంటుంది. ఇప్పటికీ మనం ఎలా తెగపడ్డా మనల్ని ఎవరేం చేయలేరనేది పాలకుల ధీమా. ఇదే విధమైన పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో కరోనా కంటే భయంకరమైన గడ్డు పరిస్థితి ముందుతరం కాదు సుమా, ఇప్పుడు మన కళ్ళతో మనమే చూస్తాం ! అందుకే ప్రజలు నోటుకు ఓటు కాకుండా ఈ పరిస్థితిని చూసి మంచివారికి ఓటు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

image.png
సీనియర్ జర్నలిస్ట్, ఇల్లెందు – భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.సెల్ : 9912010030