Take a fresh look at your lifestyle.

రోడ్లను నిరవధికంగా దిగ్బంధిచరాదు

  • రైతు ఉద్యమకారులకు నొక్కిచెప్పిన సుప్రీమ్‌ ‌కోర్టు
  • మూడువారాల్లోగా సమాధానం ఇవ్వాలని రైతు సంఘాలకు ఆదేశం
  • విచారణ డిసెంబర్‌ 7‌కు వాయిదా

రైతులకి నిరసన తెలిపే హక్కు ఉన్నప్పటికీ, వారు నిరవధికంగా రోడ్లను దిగ్బంధించరాదని గురువారం సుప్రీమ్‌ ‌కోర్టు వ్యాఖ్యానించింది. రైతు ఉద్యమ పోరాటంలో ఉన్న నిరసనకారులను రోడ్ల మీద నుండి తొలగించాలని కోరుతూ దాఖలు అయిన పిటిషన్‌పై తమ వాదాన్ని వినిపించటానికి రైతులు సుప్రీమ్‌ ‌కోర్టుకి వెళ్ళినప్పుడు అత్యున్నత న్యాయస్థానం రైతులతో పై విధంగా వ్యాఖ్యానించింది. మూడు కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు ఏడాదిగా పోరాటం చేస్తున్న రైతు సంఘాల నాయకత్వానికి సుప్రీమ్‌ ‌కోర్టు మూడు వారాల సమయం ఇచ్చి రోడ్లన్నీ ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

ఈ కేసుపై తదుపరి విచారణ డిసెంబర్‌ 7‌న అత్యున్నత న్యాయస్థానం చేపట్టనుంది. దేశ రాజధాని శివార్లలో చుట్టూ ఉన్న రోడ్ల మీద నుండి రైతు నిరసనకారులను తొలగించాలని కోరుతూ నోయిడా నివాసి దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ జరుపుతున్నది. ‘‘ఈ సమస్యకి ఒక పరిష్కారం కనుగొనవలసి ఉంది. దీనికి సంబంధించి కేసు ఇంకా పెండింగ్‌లో వున్నది. రైతులకి ఉన్న నిరసన తెలిపే హక్కుకు మేము వ్యతిరేకం కాదు, అయితే రోడ్లను బ్లాక్‌ ‌చేయటానికి మేము అంగీకరించలేము.’’ అని కోర్టు వ్యాఖ్యానించింది.

ఇంతకు ముందు కూడా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతులు దేశ రాజధానిని పొరుగు రాష్ట్రాలతో కలిపే హైవేలను దిగ్భంధనం చేస్తూ నిరసన తెలిపారు. అయితే రోడ్లను నిరంతరం బ్లాక్‌ ‌చేయటం సరికాదని సుప్రీమ్‌ ‌కోర్టు అభిప్రాయపడింది. ‘‘పరిష్కారాన్ని న్యాయ సంస్థల ద్వారానో, పార్లమెంటరీ చర్చల ద్వారానో, లేదా ఆందోళన మార్గం చేపట్టో వెతకాలి.

అంతేకాని హైవేలను ఎలా బ్లాక్‌ ‌చేస్తారు..? నిరంతరం హైవేలను బ్లాక్‌ ‌చేయటం ఎలా సబబు..? దీనికంతటికి ముగింపు ఏమిటి..?’’ అంటూ ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్‌కు నేతృత్వం వహిస్తున్న జస్టిస్‌ ఎస్‌కె కౌల్‌, ‌నిరసనల కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని దాఖలు అయిన నోయిడా నివాసి పిటిషన్‌ను విచారిస్తూ పై విధంగా  వ్యాఖ్యానించారు.

Leave a Reply