- మూడు గంటల పాటు నిరసన
- రైతు సంఘాల ఐక్య వేదిక సంయుక్త్ కిసాన్ మోర్చా పిలుపు
- దేశవ్యాప్త ఆందోళనకు సిద్ధమైన రైతులు
శనివారం మూడు గంటల పాటు రహదారుల దిగ్బంధం చేసి నిరసన తెలియజేయనున్నట్లు భాతీయ కిసాయన్ యూనియన్ నేత రాకేష్ తికాయత్ తెలిపారు. నిరసనలో ఉన్న ప్రజలకు ఆహారం, నీళ్లు తామే అందజేస్తామని, దానితో పాటు ప్రభుత్వం తమతో వ్యవహరిస్తున్న తీరును వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. హర్యానాలోని జిండ్లో చేపట్టిన నిరసనకు భారీ ఎత్తున స్పందన రావడంతో మరింత దూకుడుగా ముందుకు వెళ్తున్నారు.వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రైతులు దేశవ్యాప్త ఆందోళనకు సిద్ధమయ్యారు.
శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు దేశవ్యాప్తంగా రోడ్లన్నీ దిగ్బంధించి నల్ల చట్టాలపై నిరసన తెలపాలని మంగళవారం రైతు సంఘాల ఐక్య వేదిక సంయుక్త్ కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది. జనవరి 26న జరిగిన విధ్వంసం అనంతరం ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడాన్ని రైతులు తప్పు పడుతున్నారు. ప్రభుత్వం కావాలనే తమ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని వారు విమర్శిస్తున్నారు. ఇక దేశ రాజధాని సరిహద్దుల్లో నిరసన జరుగుతున్న ప్రదేశాల్లో పెద్ద ఎత్తున భారీకేడ్లు ఏర్పాటు చేయడాన్ని, వేల సంఖ్యలో పోలీసు బలగాల్ని మోహరించడాన్ని ఖండించారు.