Take a fresh look at your lifestyle.

అవి ధృతరాష్ట్ర కౌగిళ్ళేనా..?

అదొక అపూర్వ దృశ్యం. అలా జరుగుతుందని ఎవరూ ఊహించని ఘట్టం. రెండుగా విడిపోయిన రాష్ట్రాల ముఖ్యమంత్రుల అపూర్వ కలయికది. మొదటి సమాగమనం నాటి ఆలింగన దృశ్యఘట్టం చూసినవారంతా దాయాదులంటే ఇలా ఉండాలనుకున్నారు. అంతపెద్ద ఉద్యమం తర్వాత ఈ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇంతటి అపూర్వ స్నేహబంధం ఏర్పడుతుందని ఎవరూ ఊహించని పరిణామమది. కాని సంవత్సరకాలంలోనే అది ధృతరాష్ట్ర కౌగలిగా మారుతుందనికూడా ఎవరూ ఊహించి ఉండరు. ఇప్పుటి వరకైతే ముఖ్యమంత్రులిద్దరు గుంబనంగా ఉన్నా, వారి అనుచరులు మాటలు మాత్రం కాస్త కఠినంగానే వినిపిస్తున్నాయి. నీళ్ళయినా, ఆస్తుల పంపకాలైనా ఒకరినొకరు సంప్రదించుకుని పరిష్కరించుకోవాలనుకున్న వారి బాసలకు 203 జీవో గండికొట్టింది. గత పాలకులకు తానేమీ భిన్నంకాదని ఏపి ముఖ్యమంత్రి జగన్‌ ‌మోహన్‌రెడ్డి ఈ జీవో విడుదలద్వారా చెప్పకనే చెప్పాడు. ఇదిప్పుడు ఇరు రాష్ట్రాల మధ్య రాజకీయవేడిని రగిలిస్తున్నది. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్ధ్యాన్ని పెంచేందుకు విడుదల చేసిన ఈ జీవో గతంలో కృష్ణ రివర్‌ ‌బోర్డు నిబంధనలకు విరుద్దంగా ఉండడంతో తెలంగాణ సర్కార్‌కూడా దీన్ని సీరియస్‌గానే తీసుకుంది. ముందస్తుగా తమకు ఎలాంటి సమాచారం లేకుండా ఈ జీవోను విడుదలచేయడంపై కృష్ణా బోర్డుకు ఫిర్యాదుచేయడం, బోర్డు ఏపిని వారించడం, అలాగే నేషనల్‌ ‌గ్రీన్‌ ‌ట్రైబ్యునల్‌కూడా స్టే విధించడము ఇప్పటికైతే జరిగిపోయింది. దీనిపై కోర్టు విచారణకూడా చేపడుతోంది. దీనిపె సమగ్ర విచారణ జరిపి రెండు నెలల్లో నివేదికను ఇవ్వాలని ట్రైబ్యునల్‌ను కోర్టు అదేశించింది కూడా. కాని, పోతిరెడ్డిపాడు సామర్ధ్యాన్ని పెంచి రాయసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా నీటిని మళ్ళించుకుపోయే విషయంలో జగన్‌ ‌పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తున్నది. ఇరురాష్ట్రాల ఒప్పందం మేరకు తమకు కేటాయించిన నీటిని మాత్రమే తాము వాడుకునే ప్రయత్నంలో భాగమే ప్రాజెక్టు సామర్ద్యపెంపు అంటూనే రాయలసీమకు నీటికోసం మానవతా దృక్పథంతో ఆలోచించాలంటోంది. ఇదిప్పుడు ఇరురాష్ట్రాల మధ్య పెద్ద వివాదాంశంగా మారింది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మద్య దూరం పెరగడానికి ఇది కారణమవుతుందనుకుంటున్నారు. ఇదిలాఉంటే ఏపి నిర్ణయం వల్ల వికారాబాద్‌, ‌రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, ‌నల్లగొండ జిల్లాలకు తీవ్రమైన నీటి ఎద్దడి ఏర్పడుతుందంటూ తెలంగాణలోని ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. ప్రాజెక్టు సామర్ధ్యం పెంచడం ద్వారా రోజుకు పది టిఎంసిల నీటిని తరలించుకుపోయే ఎత్తుగడను ఏపి వేస్తోందంటు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సాగు, తాగు నీటి విషయంలో దశాబ్దాలుగా అన్యాయం జరిగిన విషయం తెలియందికాదు. అసలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడానికి నీటి సమస్యే ప్రధాన కారణం కూడా. అలాంటిది రాష్ట్రం విడిపోయిన తర్వాతకూడా ఇంకా నీటి దోపిడి జరుగుతున్నా పట్టించుకోకపోవడమేంటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రతిపక్షాలు ఈ విషయాన్ని సీరియస్‌ ‌తీసుకున్న తర్వాతే ప్రభుత్వం జోక్యం తీసుకుందని ఆ పక్షాలు దుయ్యబడుతున్నాయి. తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై ఉద్యమించడానికి కాంగ్రెస్‌ ‌పార్టీ ఇప్పటికే సిద్దమైంది. అందుకు రాష్ట్ర అవతరణ రోజు జూన్‌ ‌రెండవ తేదీని ఎంచుకుంది. ఆ రోజున ఎస్‌ఎల్‌బిసి టన్నెల్‌ ‌వద్ద పార్టీ రాష్ట్ర అథ్యక్షడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దీక్ష చేపట్టేందుకు నిర్ణయించారు. దీంతోపాటు పార్టీ పక్షాన పలు ప్రాంతాల్లో ఆందోళన కార్యక్రమాలు, దీక్షలు, ధర్నాలు చేపట్టాలనికూడా పార్టీ నిర్ణయించింది. పోతిరెడ్డిపాడు విషయంలో తెలంగాణ సర్కార్‌ ‌కావాలనే నిర్లక్ష్యం చేస్తుందని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. వాస్తవంగా పోతిరెడ్డిపాడు నుండి నీటి దోపిడికి రంగం సిద్దమవుతున్న విషయాన్ని గత డిసెంబర్‌లోనే ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినా పట్టించుకోకపోవడాన్నికాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పు పడుతున్నది., పోతిరెడ్డిపాడు నుంచి 88 క్యూసెక్కులు, సంగమేశ్వరం నుంచి మూడు టిఎంసీల నీరు ప్రతిరోజు తీసుకుపోవడానికి జగన్‌ ‌సర్కార్‌ ‌పథకాన్ని రచిస్తుంటే తెలంగాణ సర్కార్‌ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుందంటున్నారు. .పరిస్థితులను గమనిస్తే ఇద్దరు ముఖ్యమంత్రులు ఈ విషయంలో కుమ్మ్కయ్యారేమోనన్న అనుమానాన్ని కూడా ఆ పార్టీ వ్యక్తంచేస్తోంది. ఇవ్వాళ ఇంజనీరింగ్‌లో మేటి అని చెప్పుకుంటున్న కాళేశ్వరంతో పోలిస్తే పోతిరెడ్డిపాడు ద్వారా ఏపికి తరలించే నీళ్ళే ఎక్కువని, దీనివల్ల రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రాంతం ఎడారిగా మారే అవకాశాలున్నాయంటూ ఆ పార్టీ ఆరోపిస్తోంది. ప్రభుత్వ ఈ ఉదాసీన వైఖరిని నిరసిస్తూ, తెలంగాణ నీటి ప్రాజెక్టులను కాపాడేందుకు కార్యాచరణను రూపొందించే పనిలోపడింది కాంగ్రెస్‌. ‌నీళ్ళు, నిధులు, నియామకాల సిద్దాంతంతో సాధించుకున్న తెలంగాణలో నీటి దోపిడీ ఇక ఎట్టి పరిస్థితిలో జరుగడానికి వీల్లేందంటున్నారు ఆ పార్టీ అగ్రనేతలు. అందుకే తెలంగాణ ఆవిర్శావ దినోత్సవం రోజున్నే పోతిరెడ్డి పాడు విషయంలో ముందస్తుగా దీక్షలు చేపడుతున్నట్లు ప్రకటించింది. ఈ దీక్షతో ప్రజల్లో ప్రాజెక్టుల పట్ల సమగ్ర అవగాహన కల్పించాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం లాక్‌డౌన్‌ ‌కొనసాగుతున్నందున ప్రాజెక్టులపై సామాజిక మాధ్యమాలద్వారా చర్చావేదికలను కూడా ఏర్పాటుచేసే ఆలోచనను కాంగ్రెస్‌పార్టీ చేస్తోంది. సమైక్య పాలనలో పోతిరెడ్డి పాడు జలాల వినియోగం పై కాంగ్రెస్ పార్టీ వైఖరి వివాదాస్పదమయినా …ప్రత్యేక రాష్ట్రంలో నీటి పంపకాల అంశం పై ఆ పార్టీ తీసుకున్న వైఖరి సమర్ధనీయం ..అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ఉదాసీనత , దక్షిణ తెలంగాణా పై నిర్లక్ష వైఖరి ఆక్షేపణీయం ..!

Leave a Reply