Take a fresh look at your lifestyle.

నదుల పరిరక్షణకు పటిష్ఠమైన కార్యాచరణ అవసరం

‘‘ఆర్ధర్‌ ‌కాటన్‌, ‌మోక్షగుండం విశ్వేశ్వరయ్య వంటి ఎంతో మంది మహనీయులు నీటి ప్రాజెక్టుల విషయంలో ఎంతగానో శ్రమించి లక్షలాది ఎకరాల భూమిని సశ్యశ్యామలం చేశారు. అయితే అప్పటి మేథావుల కృషి,పట్టుదల వర్తమానంలో కానరావడం లేదు. అప్పటి కంటే ఇప్పుడు సాంకేతికంగా ప్రపంచం ఎంతో ముందంజలో ఉంది.అయినా ప్రతీ చోట జలవివాదాలు తలెత్తుతున్నాయి.అపారమైన జలసంపద కడలి పాలౌతున్నది. పంటలకు,తాగునీటి అవసరాలకు వినియోగించవలసిన జలరాశులను సముద్రాల పాలు చేయడం బాధాకరం.’’

నదుల గురించి అవగాహన కలిగించడం, నదుల్లో పెరుగుతున్న కాలుష్యాన్ని అరికట్టి జీవవైవిధ్యాన్ని కాపాడడం వంటి అనేక చర్యల ద్వారా జనజీవితాలకు, ఇతర జీవరాశులకు మేలు చేయడమే నదుల కోసం కార్యచరణ పేరుతో జరిగే అంతర్జాతీయ దినోత్సవ లక్ష్యం.ప్రపంచంలో ఎన్నో నదులున్నాయి. నైలు నది, మిసిసిపి, హోయాంగ్‌ ‌హో, అమెజాన్‌, ‌కాంగోలు ప్రపంచంలో ప్రఖ్యాత నదులు. ప్రపంచంలో పొడవైన నది నైలు నది, రెండవది అమెజాన్‌. ‌ప్రపంచంలో మూడవ పొడవైన,ఆసియాలో మొదటి పొడవైన నది యాంగ్జీ.ఈజిప్టులో అధికశాతం ప్రజలు నైలునదీ పరివాహక ప్రాంతాల్లో జీవిస్తారు. నైలునదిని ‘‘ఈజిప్టు వరప్రసాదం’’ గా పిలుస్తారు.’’ఫాదర్‌ ఆఫ్‌ ఆ‌ఫ్రికన్‌ ‌రివర్స్’’ ‌గా పిలవబడే నైలునది 10 దేశాల గుండా ప్రవహిస్తుంది.చైనా దుఃఖదాయని గా హోయాంగ్‌ ‌హో (ఎల్లో నది) పిలవబడుతుంది. మిస్సోరి, మిసిసిపి, యూకోన్‌ ‌నదులు అమెరికాలో పొడవైన నదులు. ఓల్గా, నేవా, ఓబ్‌ ‌నదులు రష్యాలో ప్రముఖ నదులు. ప్రపంచంలో ఒక్క నదికూడా లేని దేశం సౌదీ అరేబియా,ఖతార్‌ ‌లో కూడా నదులు లేవు.

భారత దేశం నదులకు పుట్టినిల్లు. 250 మిలియన్ల హెక్టార్ల ఆయకట్టు 10 కి పైగా ప్రధాన నదులకు చెందుతుంది.భారత దేశ నదీ వ్యవస్థ త్రాగునీటికి,సాగునీటికి,విద్యుత్‌, ‌రవాణాకు అనుకూల మైనది.భారత దేశంలో గంగ, సింధు, గోదావరి, కృష్ణానదులు ప్రసిద్ధి చెందినవి.సింధునది అత్యంత పొడవైన నదిగా పేరొందినా, ఈ నదీ ప్రవాహం ఎక్కువగా పాకిస్తాన్‌ ‌లో ఉంది. భారతదేశంలో గంగానది ఎక్కువ పరిధిని కలిగి ఉంది.పాక్‌ ‌జీవనాడి సింధు నది. సింధు నది వలన పాకిస్తాన్‌ ‌సస్యశ్యామలంగా మనగలుగుతుంది.పాక్‌ ‌ప్రజల త్రాగు నీటికి, సాగునీటికి, విద్యుత్‌ అవసరాలకు సింధునది ఆయువు పట్టు.సంవత్సవం పొడవునా ప్రవహించే నదులను జీవనదులు లేదా శాశ్వత నదులుఅంటారు. గంగ, యమున, తపతి, బ్రహ్మ పుత్ర, నర్మద తదితర నదులన్నీ జీవనదులు.ఏ సముద్రం లోను కలవని నదిగా రాజస్థాన్‌ ‌లోని లూనీనది పేరుగాంచింది.

‘‘నదీనాం సాగరో గతిః’’ అనేది వాస్తవం. అయితే అది గతం. విజ్ఞానం వికసించని రోజుల్లో నదులకు ఆనకట్టలు కట్టి, నీటిని రక్షించడం కష్టతరం గా ఉండేది. ఆర్ధర్‌ ‌కాటన్‌, ‌మోక్షగుండం విశ్వేశ్వరయ్య వంటి ఎంతో మంది మహనీయులు నీటి ప్రాజెక్టుల విషయంలో ఎంతగానో శ్రమించి లక్షలాది ఎకరాల భూమిని సశ్యశ్యామలం చేశారు. అయితే అప్పటి మేథావుల కృషి,పట్టుదల వర్తమానంలో కానరావడం లేదు. అప్పటి కంటే ఇప్పుడు సాంకేతికంగా ప్రపంచం ఎంతో ముందంజలో ఉంది.అయినా ప్రతీ చోట జలవివాదాలు తలెత్తుతున్నాయి.అపారమైన జలసంపద కడలి పాలౌతున్నది. పంటలకు,తాగునీటి అవసరాలకు వినియోగించవలసిన జలరాశులను సముద్రాల పాలు చేయడం బాధాకరం.మానవ విజ్ఞానం స్వార్ధంతో పెనవేసుకుని నదులను,జలరాశులను పూర్తి వినియోగం లోకి తీసుకు రావడంలో అడ్డుపడుతున్నది. ఒక వైపు త్రాగడానికి గుక్కెడు నీరైనా లేని ప్రాంతాలెన్నో ఉన్నాయి. బంగరు భూములన్నీ నీరు లేక నెరలు తీస్తున్నాయి. కరువు ప్రాంతాలుగా కటిక దరిద్రంలో కొట్టుమిట్టాడుతున్న ప్రాంతాల ప్రజల జీవన దైన్య స్థితి ఒకవైపు, మరో వైపు అతి వృష్టితో అపారమైన జలవనరులు వృథాగా పోతున్నాయి.ఇజ్రాయెల్‌, ‌సైప్రస్‌,‌స్పెయిన్‌ ఇటలీ,ఒమన్‌,‌సౌదీ అరేబియా వంటి 100 దేశాలకు పైగా ‘‘డిశాలినేషన్‌’’ ‌ప్రక్రియను విజయవంతంగా అమలు చేస్తున్నాయి.సముద్ర జలాలనుండి ఉప్పు నీటిని వేరు చేసి, మంచి నీటిగా మార్చే డీశాలినేషన్‌ ‌ప్లాంట్ల ఏర్పాటును భవిష్యత్తులో విసృతం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. వీటి నిర్వహణా వ్యయం కూడా అధికం.

అందుచేత ప్రస్తుతానికి భూమిపై నీటి నిల్వలను ముఖ్యంగా నదుల్లోని నీటిని సంరక్షించి,సాగు,త్రాగు నీటికి వినియోగించాలి.ఈ సకల చరాచర జగత్తులో జీవకోటి మనుగడకు అతిముఖ్యమైన ప్రాణాధారం ‘నీరు’. నీరు లేనిదే జీవరాశి మనుగడ దుర్లభం. అలాంటి నీటివనరులను తరిగి పోకుండా చూడడమే కాకుండా నేటి కలుషిత వాతావరణంలో మనకందరికీ పరిశుభ్రమైన నీరు విధిగా అందించవలసిన బాధ్యత ప్రపంచ సమాజంపై ఎంతైనా ఉంది. కలుషిత నీటి స్థానంలో స్వచ్ఛమైన త్రాగు నీరు అందించాలి. కలుషిత నీటివల్ల రోగాల బారిన పడుతున్న ప్రజలను రక్షించవలసిన గురుతరమైన బాధ్యత ప్రపంచ ఆరోగ్య సంస్థ పైన, ప్రభుత్వాల పైన ఎంతైనా ఉంది. ఈనాటికీ ప్రపంచ జనాభాలో అత్యధిక శాతం మందికి స్వచ్ఛమైన త్రాగునీరు అందడం లేదు. ఇక ఇతర అవసరాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.

ప్రతీ మనిషికీ త్రాగడానికి, ఇతర అవసరాలకు సరిపడా కనీస నీటిని కూడా మనం అందించలేకపోతున్నాం. దాని ఫలితమే ఈ నీటికారక వ్యాధుల విజృంభణ. మరో దశాబ్దం నాటికి నీటి అవసరాలు మరింత పెరుగుతాయి.మనకు నదులు, సరస్సుల రూపంలో నీటి వనరుల లభ్యత ఉంది. కాని అనేక రకాల కారణాల వల్ల మనం నీటివనరులను సరిగ్గా వినియోగించుకోలేక పోతున్నాం. నీరంతా వృథాగా సముద్రం పాలౌతుండడం బాధాకరం. సరైన అవగాహన, చైతన్యం లేకపోవడమే దీనికంతటికీ ముఖ్య కారణం. నీటి వనరులను పొదుపుగా వినియోగించుకోవడమే కాకుండా సమీప భవిష్యత్తులో అందరికీ పరిశుభ్రమైన మంచినీటిని అందించి ప్రజలను రోగాల బారిన పడకుండా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించే దిశగా మన అడుగులు ముందుకు పడాలి.

ప్రజల త్రాగునీటి అవసరాలను సాకుగా తీసుకుని కొంతమంది రక్షిత మంచినీటి సరఫరాను పెద్ద వ్యాపారంగా మార్చేస్తున్నారు. ఎలాంటి ప్రమాణాలు పాటించకుండా పుంఖానుపుంఖాలుగా, పుట్టగొడుగుల్లా వ్యాపిస్తున్న రక్షితనీటి సరఫరా విభాగాలపై ప్రభుత్వాలు కొరడా ఝుళిపించాలి.శుద్ధ జలాల సరఫరా ప్రమాణాల ప్రకారం సక్రమంగా జరుగుతుందా లేదా పర్యవేక్షించేందుకు తగిన యంత్రాంగం నెలకొల్పాలి.జీవకోటి మనుగడ నీటిపైనే ఆధారపడి వుంది కనుక ఇలాంటి ప్రాణాధారమైన నీటిని కలుషితం కాకుండా కాపాడుకోవాలి. విషరసాయనాలు, ఇతర కలుషిత పదార్ధాలు నీటిలో కలవకుండా తగు జాగ్రత్తలు తీసుకుని మానవాళి మనుగడను పదికాలాల పాటు భద్రంగా కాపాడుకోవలసిన తరుణం ఆసన్నమైంది. ప్రజల్లో పరిశుభ్రమైన నీటి వినియోగంపై అవగావన కలిగించడానికి శిక్షణా శిబిరాలు నిర్వహించాలి.ప్రజల్లో చైతన్యం కలిగించాలి.నీటి ప్రాజెక్టుల విషయంలో నిర్లక్ష్యం తగదు. నదుల్లో ఏర్పడుతున్న కాలుష్యాన్ని అరికట్టాలి. ప్రపంచ నదుల పరిరక్షణకు పటిష్ఠమైన అంతర్జాతీయ కార్యాచరణ ప్రణాళిక అవసరం

image.png

సుంకవల్లి సత్తిరాజు

సంగాయగూడెం,దేవరపల్లి మండలం,తూ.గో జిల్లా.(ఆం.ప్ర)

9704903463

 

Leave a Reply