Take a fresh look at your lifestyle.

వివాహ స్వేచ్ఛపై జోక్యం.. అనర్థాలకు దారితీసే ప్రమాదం

దేశంలో రైతుల ఉద్యమం తీవ్ర స్థాయికి చేరుకోవడంతో అది ఎటువైపు మలుపు తిరుగుతుందోనని ప్రజలంతా ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ బీజేపీ పాలిత రాష్ట్రాలు ఇదే తగిన సమయం అనుకున్నట్టుగా లవ్‌ ‌జిహాద్‌ ‌బిల్లును ఆమోదిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌ ‌ప్రభుత్వం ఈ బిల్లును ఆమోదించగా, శనివారం నాడు మధ్య ప్రదేశ్‌ ‌మంత్రివర్గం ఇందుకు సంబంధించిన బిల్లును ఆమోదించింది. కుల, మతాలకు అతీతంగా దేశంలో వివాహాలు చేసుకుంటున్నవారు ఎంతో మంది ఉన్నారు. ఇలాంటి వివాహాలన్నీ మైనారిటీ తీరిన వారే చేసుకుంటున్నారు. అంటే వివాహా స్వేచ్ఛ కలిగిన వారే. అలాంటి వారిని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఏకంగా చట్టాలను తీసుకుని రావడం అనేది గతంలో ఎన్నడూ లేదు. మతపరమైన ఘర్షణలకు తావిచ్చే ఇలాంటి చట్టాల వల్ల సమాజంలో ఆందోళనలూ, అస్థిర పరిస్థితులు నెలకొంటాయి.

ప్రభుత్వ ప్రమేయం లేకుండా ఉంటేనే మంచిదని దశాబ్దాల క్రితం అవిభక్త ఆంధప్రదేశ్‌లో సమాజ సంస్కర్త గోపరాజు రామచంద్రరావు(గోరా) వంటి వారు విస్తృతంగా ప్రచారం చేశారు. తన సంతానానికి వివాహ స్వేచ్ఛ ఇచ్చారు. ఆయన పెద్ద కుమారుడు గాంధేయవాది లవణం జాషువా గారి కుమార్తె హేమలతను వివాహం చేసుకున్నారు. మిగిలిన వారు కూడా కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్నారు. వారి కుటుంబం అంతా సఖ్యతతోనూ, సామరస్యంతోనూ మెలుగుతోంది. అందువల్ల కులాంతర, మతాంతర వివాహాలు చేసుకోవడం వల్ల కుటుంబాలు విచ్ఛిన్నమవుతాయన్నది దురభిప్రాయమేనని గోరా కుటుంబం రుజువు చేసింది. అలాగే, దేశవ్యాప్తంగా ఎంతో మంది సంస్కరణ వాదులు కుల, మతాలకు అతీతంగా పెళ్ళిళ్ళను ప్రోత్సహించారు. తమ సంతానానికి పెళ్ళిళ్ళు చేశారు. బీజేపీ ప్రభుత్వం మత ప్రాతిపదికపై సమాజాన్ని చీలుస్తోందన్న ఆరోపణల్లో అసత్యం లేదనడానికి ఆ పార్టీ ప్రభుత్వాలు అనుసరిస్తున్న ధోరణులే నిదర్శనం.

బలహీన వర్గాలకు చెందిన యువతులను బలవంతంగా మతం మార్పిడి చేయించి పెళ్ళిళ్ళను ప్రోత్సహించేవారికి ఐదేళ్ళ జైలు శిక్ష, లక్ష రూపాయిలు జరిమానా విధించేందుకు ఉద్దేశించిన బిల్లులను మధ్యప్రదేశ్‌ ‌మంత్రివర్గం ఆమోదించింది. ఉత్తరప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్‌ ‌మత మార్పిడులను నిషేధించేందుకే లవ్‌ ‌జిహాద్‌ ‌చట్టాన్ని తెచ్చినట్టు చెప్పారు. పెళ్లిళ్ళు యువతీయువకులు ఇష్టపడి చేసుకుంటున్న ఘటనలు ఎన్నో చూస్తున్నాం, ఎవరినీ బలవంతం పెట్టడం కానీ, బెదిరించడం కానీ, కన్యాశుల్కం నాటి పరిస్థితులు ఇప్పుడు లేవు. సంఘ సంస్కరణల కారణంగానూ, యువతులు, మహిళల్లో విద్యావ్యాప్తి వల్ల వెల్లివిరుస్తున్న చైతన్యం కారణంగా వారు తమ భవిష్యత్‌ ‌గురించి ముందే ప్లాన్‌ ‌చేసుకుంటున్నారు. గతంలో కన్నా ఆర్థిక భద్రత పెరగడం వల్ల వారిలో స్వతంత్ర భావాలు పెరుగుతున్నాయి. ఈ మధ్య ఒక వధువు పెళ్ళి పీటల మీద నుంచి లేచి పోలీసులకు ఫోన్‌ ‌చేసి తనకు తల్లితండ్రులు ఇష్టం లేని పెళ్ళి చేస్తున్నారనీ, తాను ఫలానా వ్యక్తిని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పడంతో పోలీసులు వెంటనే వొచ్చి ఆ యువతి కోరిన విధంగా పెళ్లి జరిపించారు. పెళ్ళి కుమారుని తల్లితండ్రులు తమ బంధువుల్లో వేరొక అమ్మాయితో పెళ్ళి జరిపించిన సంఘటన ఈ మధ్యనే చోటు చేసుకుంది.

- Advertisement -

అందువల్ల పెళ్ళిళ్ళలో యువతుల స్వేచ్ఛ, చొరవ ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది. ప్రభుత్వం జోక్యం చేసుకోకుండా ఉంటే సమాజంలో మార్పులు వొస్తాయి. బలవంతపు మతం మార్పిడులు ఇప్పుడు ఎక్కడా జరగడం లేదు. ప్రభుత్వ జోక్యం వల్ల యువతీ యువకుల్లో పట్టుదల పెరుగుతుంది..ఆవేశకావేశాలు పెరుగుతాయి. అది వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన విషయం. మైనారిటీ తీరిన వారి పెళ్లి విషయంలో జోక్యం చేసుకోరాదని సుప్రీమ్‌ ‌కోర్టు తీర్పులే స్పష్టం చేస్తున్నాయి. బీజేపీ ప్రభుత్వాలు ఇతరమైన సమస్యలను వొదిలి పెట్టి మతపరమైన వివాదాలకు తావిచ్చే అంశాలపైనే దృష్టి సారిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో కొద్ది నెలల క్రితం హత్రాస్‌లో జరిగిన హత్యాచారం ఘటనలో యువతిపై అత్యాచారం జరగలేదని రాష్ట్ర పోలీసులు తేల్చగా, సీబీఐ దర్యాప్తు అది అత్యాచారం అనంతర హత్యేనని తేల్చింది. మహిళలు, యువతులకు భద్రత కల్పించే అంశాలపై దృష్టిని కేంద్రీకరించాల్సిన ప్రభుత్వాలు మతపరమైన అంశాలకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల అనవసరమైన వివాదాలను కోరి తెచ్చుకున్నట్టు అవుతుంది.

ఆంధప్రదేశ్‌ ‌ప్రభుత్వం తెచ్చిన దిశ బిల్లును కేంద్రం ఇంతవరకూ ఆమోదించలేదు. దీనిపై ప్రతిపక్షాలు అదేదో రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పుగా ఫేక్‌ ‌చట్టం, ఫేక్‌ ‌ప్రభుత్వం అంటూ గేలి చేస్తున్నాయి. ఇలాంటి విషయాల్లో శ్రద్ధ చూపాల్సిన రాజకీయ పార్టీలు తమ బాధ్యతను విస్మరించి సందట్లో సడేమియాలా రాజకీయ ప్రయోజనాన్ని కోరుకోవడానికి ప్రకటనలు చేయడం దురదృష్టకరం. వివాహ వ్యవస్థలు మతానికొక్క తీరులో ఉన్నాయి. ఇవన్నీ అందరికీ తెలిసినవే. వివాహానికి సంబంధించి కీలకనిర్ణయాలు తీసుకునే యువతీ యువకులు అన్ని చట్టాలనూ, పరిస్థితులనూ కూలంకషంగా పరిశీలన జరిపి వివాదాలు తలెత్తకుండా నిర్ణయాలు తీసుకోవాలి. ఉత్తరప్రదేశ్‌లోనే శనివారం నాడు ముగ్గురు ముస్లిం యువతులు మతం మార్చుకుని హిందూ యువకులను పెళ్లి చేసుకునేందుకు నిర్ణయించడం గమనార్హం. అందువల్ల రెచ్చగొడితే రెచ్చి పోతారు. చూసీ చూడనట్టు వొదిలేస్తే ఎవరి నిర్ణయాలకు వారు బాధ్యులవుతారు. అనాదిగా జరుగుతున్నది అదే. బీజేపీ ప్రభుత్వాలు జోక్యం చేసుకోవడం వల్ల మంచి కన్నా చెడు ఎక్కువ జరిగే ప్రమాదం ఉంది.

Leave a Reply