Take a fresh look at your lifestyle.

పెరిగిన పెట్రో, గ్యాస్‌ ‌ధరలు

  • హైదరాబాద్‌లో రూ. 110కి చేరువలో లీటరు పెట్రోల్‌ ‌ధర..
  • వేయి దాటిన గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌ధర
  • పెట్రో ధరలపై రాజ్యసభలో విపక్షాల ఆందోళన..నిరసనలతో సభ రెండుసార్లు వాయిదా

న్యూ దిల్లీ, మార్చి 22 : అంతా అనుకున్నట్లు మరోమారు పెట్రో పిడుగు పడింది. వంటింట్లో సిలిండర్‌ ‌ధర పేలింది. ఉక్రెయిన్‌ ‌యుద్ధం పుణ్యమా అని ధరలు దాడి చేశాయి. ఎన్నికల తరవాత పెంపు అనివార్యం అనుకుంటున్న క్రమంలో ఉక్రెయిన్‌ ‌యుద్దం కూడా తోడయ్యింది. ఈ క్రమంలో సామాన్యులపై పెట్రో, డీజిల్‌, ‌గగ్యాస్‌ ‌ధరల భారం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. అటు పెట్రోల్‌, ‌డీజిల్‌..ఇటు గ్యాస్‌ ‌సిలిండర్‌..అనుకున్నదంతా జరిగింది. దాదాపు ఐదు నెలల తర్వాత పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌రేట్లు పెరిగితే.. తాజాగా గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌ధరలు భారీగా పెరిగాయి. సామాన్యులకు షాకిస్తూ చమురు సంస్థలు గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌ధరలను భారీగా పెంచేశాయి. ఈ పెరిగిన ధరలు మంగళవారం నుంచి అమలులోకి వొచ్చాయి.

ఇప్పటికే పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధరలను పెంచిన మోడీ సర్కార్‌ ఎల్‌పిజి సిలిండర్‌ ‌ధరను కూడా పెంచడంతో ప్రజలపై అదనపు భారం పడనుంది. వంటగ్యాస్‌ ‌సిలిండర్‌పై రూ. 50 పెంచింది. ఈ ధరలు కూడా మంగళవారం నుండి అమల్లోకి వొచ్చాయి. ఢిల్లీ, ముంబైలలో ఎల్‌పిజి సిలిండర్‌ ‌ధర రూ.949.50కు పెరిగింది. కోల్‌కతాలో రూ.976, చెన్నైలో రూ.965.50లు, లక్నోలో రూ.987.50కి పెరిగింది. తెలంగాణలో రూ.1,002, ఎపిలో రూ.1,008గా ఉంది. ఈ క్రమంలోనే దేశ వ్యాప్తంగా పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధరలు పెరిగాయి. దాదాపు 5 నెలల తర్వాత పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధరలను చమురు సంస్థలు పెంచాయి. తెలంగాణలో లీటర్‌ ‌పెట్రోల్‌పై 90 పైసలు, డీజిల్‌పై 87 పైసలు పెరిగింది. హైదరాబాద్‌లో లీటర్‌ ‌పెట్రోల్‌ ‌ధర రూ. 109.10 కాగా, డీజిల్‌ ‌ధర రూ. 95.49గా ఉంది.

పెట్రో ధరలపై రాజ్యసభలో విపక్షాల ఆందోళన.. నిరసనలతో సభ రెండుసార్లు వాయిదా
పెట్రోల్‌, ఎల్పీజీ ధరల పెంపుదలను నిరసిస్తూ విపక్షాలు రాజ్యసభలో ఆందోళన చేపట్టాయి. ప్లకార్డులు ప్రదర్శించిన విపక్ష ఎంపీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో చైర్మన్‌ ‌వెంకయ్యనాయుడు సభను తొలుత 12 గంటలకు వాయిదా వేశారు. ఆ తర్వాత రెండవసారి కూడా వెల్‌లోకి దూసుకువచ్చిన విపక్ష సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. దీంతో డిప్యూటీ చైర్మన్‌ ‌సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు. పెట్రోల్‌పై ఇవాళ 90 పైసలు, గ్యాస్‌ ‌సిలిండర్‌పై రూ.50 పెంచిన విషయం తెలిసిందే. దాదాపు 137 రోజుల తర్వాత పెట్రోల్‌, ‌డీజిల్‌పై ధరలను పెంచారు. చివరిసారి 2021, నవంబర్‌ 2‌వ తేదీన పెట్రోల్‌ ‌ధరలు పెంచారు.

Leave a Reply