- తమిళనాడు అభివృద్దికి కేంద్రం అధిక ప్రాధాన్యం
- చెన్నై పర్యటనలో మంత్రి నిర్మలా సీతారామన్
పెట్రో మంట ఇప్పట్లో ఆరేలా కనిపించడం లేదు. వరుసగా 12వ రోజు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల్లో ఎలాంటి మార్పులు లేనప్పటికీ.. దేశీయ కంపెనీలు వినియోగదారులపై మరోమారు భారం మోపాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇంధన ధరల పెరుగుదలపై శనివారం స్పందించారు. ఇంధన ధరలన్న అంశం ప్రతి ఒక్కర్నీ ఆందోళనకు గురి చేస్తున్నదని, కానీ ధరలు తగ్గితే కానీ ఆ అంశంపై ఎవరినీ సంతోషపెట్టలేమన్నారు. వినియోగదారులకు రిటేల్ ఇంధన ధరలను కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని మంత్రి సీతారామన్ అభిప్రాయపడ్డారు. మరోమారు ధరల పెరుగుదలతో దేశరాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్‌పై 39 పైసలు, డీజిల్‌పై 37 పైసలు పెంచాయి.
తాజా పెంపుతో హస్తినలో పెట్రోల్, డీజిల్ ధరలు అత్యధికానికి చేరుకున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.90.58, డీజిల్ ధర రూ.80.97కు చేరాయి. అదేవిధంగా ఆర్థిక రాజధాని ముంబైలో 38 పైసలు పెరగడంతో పెట్రోల్ ధర రూ.97కు, డీజిల్‌పై 39 పైసలు అధికమవడంతో రూ.87.06కు చేరాయి. కాగా, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లోని కొన్ని నగరాల్లో పెట్రోల్ ధరలు ఇప్పటికే రూ.100 దాటాయి. ఇక బెంగళూరులో లీటర్ పెట్రోల్ రూ.93.67, డీజిల్ రూ.85.84కు చేరాయి. హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్‌పై 40 పైసల చొప్పున పెరిగాయి. దీంతో లీటర్ పెట్రోల్ రూ.94.18, డీజిల్ రూ.88.31గా ఉన్నాయి.
ఇదిలావుంటే తమిళనాడు అభివృద్దికి కేంద్రం నిరంతరంగా కష్టపడుతోందని,ఆ మేరకు నిధులను కూడా అందచేస్తోందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మాలా సీతారామన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీకి ఒక్క ఎంపీ లేకపోయినా ఏమాత్రం నిర్లక్ష్యం చూపకుండా అభివృద్ధికి ప్రధాని నరేంద్రమోదీ ఎంతో కృషి చేస్తున్నారని సీతారామన్ అన్నారు. 2014 నుంచి తమిళనాడుకు కేంద్రం భారీగా నిధులను అంది స్తోందని వివరించారు. ఆమె నగరంలోని రాజాఅన్నామలైపురంలోని లీలా ప్యాలెస్‌లో పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. అనంతరం ఓ హోటల్లో బీజేపీ వాణిజ్య విభాగం ప్రతినిధులతో సమావేశమై కేంద్ర బడ్జెట్ గురించి వివరించారు.
ఈ సమావేశంలో కేంద్రమంత్రి మాట్లాడుతూ.. కొత్త సాగుచట్టాలతో రైతులు తమ హక్కులు కోల్పోతారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారానికి ఏం సమాధానం చెబుతామన్నారు. కొత్త సాగు చట్టాలతో వచ్చే ఆదాయం తమకు వద్దని, దళారులు దోచుకుంటేనే బాగుంటుందనే వారు మాత్రమే ఈ చట్టాలను వ్యతిరేకిస్తున్నారన్నారు. అబద్ధపు ప్రచారాలతో రాజకీయాలు చేసే పరిస్థితులు ప్రస్తుతం దేశంలో నెలకొన్నాయన్నారు. అన్నాడీఎంకే- బీజేపీ కూటమిని చూసి ప్రతిపక్షాల్లో భయం పట్టుకుందన్నారు.