Take a fresh look at your lifestyle.

కృష్ణా, గోదావరి నదుల్లో పెరుగుతున్న వరద

  • ఎగువన వర్షాలతో ప్రాజెక్టులకు జలకళ
  • అప్రమత్తం అయిన అధికారులు
  • నాగార్జునసాగర్‌ ‌నాలుగు గేట్లు ఎత్తి నీటిని వదిలిన అధికారులు
  • శ్రీరాంసాగర్‌ ‌ప్రాజెక్ట్ ‌వద్ద కొనసాగుతున్న వరద

ఎగువన వర్షాలతో కృష్ణా, గోదావరి నదులకు వరద కొనసాగుతుంది. ఆయా ప్రాజెక్టులు నిండుకుండలా తలపిస్తున్నాయి. కాళేశ్వరం వద్ద గోదావరి ఉధృతి కొనసాగుతుంది. ఆయా జిల్లాల్లో ప్రాజెక్టులు, వరదలపై కలెక్టర్లు అధికారులను అప్రమత్తం చేశారు. సాగర్‌, శ్రీ‌శైలంతో పాటు, భద్రాచలం వద్ద గోదావరి ఉప్పొంగుతుంది. నాగార్జున సాగర్‌ ‌ప్రాజెక్టుకు వరదప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ నుంచి భారీగా వరద వొస్తుండటంతో అధికారులు నాలుగు క్రస్ట్ ‌గేట్లు ఎత్తి వేశారు. ప్రాజెక్టులోకి 74,699 క్యూసెక్కుల నీరు వొస్తుండగా, అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 589.90 అడుగుల నీరు నిల్వ ఉన్నది. ఇకపోతే మూసీ ప్రాజెక్ట్‌కు భారీగా వరద వొస్తున్నది. దీంతో అధికారులు నాలుగు గేట్లను ఐదు ఫీట్ల మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 15193.07 క్యూసెక్కుల వరద వొస్తుండగా, 15424.57 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. మూసీ పూర్తిస్థాయి నీటి మట్టం 645 అడుగులకుగాను 638.40 అడుగుల నీటిమట్టం ఉన్నది. ప్రాజెక్టు గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు. ప్రస్తుతం 2.86 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో సంగారెడ్డి జిల్లాలోని సింగూర్‌ ‌ప్రాజెక్టుకు వరద పోటెత్తుతున్నది. దీంతో ప్రాజెక్టుకు 1,35,0000 వేల క్యూసెక్కులు వరద నీరు వొస్తున్నది.

గేట్ల ద్వారా 75,000 వేల క్యూసెక్కులు వరద నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్‌కు వరద ఉధృతి ఏ సమయంలోనైనా ఇంకా పెరిగే అవకాశం ఉందని, మంజీరా నది పరీవాహక ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం నిజామబాద్‌ ‌జిల్లా కందకుర్తి వద్ద గోదావరి నది నాలుగో రోజు ఉధృతంగా ప్రవహిస్తుంది. అంతర్రాష్ట్ర వంతెనపై నుంచి వరద నీరు పోటెత్తుతోంది. ఎస్సారెస్పీ ప్రాజెక్టు నుంచి దిగువకు ఇరిగేషన్‌ అధికారులు దాదాపు 4 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఎగువ మహారాష్ట్ర నుంచి, మంజీరా నది ద్వారా భారీగా వరద నీరు వచ్చి చేరడంతో గోదావరిలో ప్రవాహం ప్రమాదకర స్థాయిలో కనిపిస్తుంది. గురువారం ఉదయానికి గోదావరి ఉధృతి భారీగానే ఉంది. ఎగువన భారీ వర్షాల నేపథ్యంలో శ్రీరాంసాగర్‌ ‌ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ప్రాజెక్టులోకి 3.30 లక్షల క్యూసెక్కుల నీరు వస్తున్నది. దీంతో అధికారులు 33 గేట్లు ఎత్తి 4.49 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులుకాగా.. ప్రస్తుతం 1087.4 అడుగుల వద్ద నీటి మట్టం ఉన్నది. సాగర్‌ ‌పూర్తిస్థాయి నీటినిల్వ 90 టీఎంసీలు. ప్రస్తుతం 74.506 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.

Leave a Reply