- 77.77శాతంగా అంచనా..కొత్తగా 97,570 పాజిటివ్ కేసులు
- కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడి
దేశవ్యాప్తంగా నమోదైన కొరోనా పాజిటివ్ కేసుల్లో నాలుగింట మూడోశాతం రికవరీ కేసులే ఉన్నాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. రికవరీ కేసులు, యాక్టివ్ కేసుల మధ్య దూరం క్రమంగా పెరుగుతుందని పేర్కొంది. ఈ మేరకు శనివారం ట్విట్టర్లో వివరాలు వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 36 లక్షలకుపైగా డిశ్చార్జి చేసిన కేసులు ఉన్నాయని, యాక్టివ్ కేసులు 10లక్షల కంటే తక్కువగా ఉన్నాయని ట్వీట్ చేసింది. విస్తృతంగా, వేగంగా టెస్టులు చేయడం, దవాఖానల్లో నాణ్యమైన, సమర్థవంతమైన చికిత్స అందించడం ద్వారా బాధితులు కోలుకుంటున్నట్లు చెప్పింది. వ్యాధుల నిర్దారణకు లోతైన పరిశోధన, పరీక్ష ఖచ్చితంగా అవసరమని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో సమర్థవంతమైన పర్యవేక్షణ, వేగవంతమైన టెస్టింగ్ పాలసీ..సమర్థవంతమైన చికిత్స మంత్రాన్ని అనుసరించి కొరోనాపై విజయం సాధిస్తామన్నారు.
ప్రస్తుతం దేశంలో 36,24,196 రికవరీ కేసులున్నాయని, 9,58,316 యాక్టివ్ కేసులు ఉండగా, కోవిడ్ రికవరీ రేటు 77.77శాతం ఉందని మరో ట్వీట్ చేశారు. అయినా దేశంలో మహమ్మారి ఉధృతి రోజు రోజుకు పెరుగుతున్నది. ఇప్పటికే 46లక్షలకుపైగా రికార్డయ్యాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో మరో 97,570 కొవిడ్ పాజిటివ్ కేసులు నిర్దారణ అయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. వైరస్ ప్రభావంతో మరో 1201 మంది ప్రాణాలను కోల్పోయినట్లు పేర్కొంది. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 46,59,985కు చేరింది. ప్రస్తుతం 9,58,316 యాక్టివ్ కేసులు ఉన్నాయని, 36,24,197 మంది డిశ్చార్జి అయ్యారని పేర్కొంది. మహమ్మారి ప్రభావంతో ఇప్పటికీ 77,472 మంది మరణించారని ఆరోగ్యశాఖ వివరించింది. కాగా, శుక్రవారం ఒకే రోజు 10,91,251 కొరోనా టెస్టు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) పేర్కొంది. ఇప్పటి వరకు 5,51,89,226 శాంపిల్స్ పరీక్షించినట్లు పేర్కొంది. మిలియన్ జనాభాకు 39,915 టెస్టులు చేసినట్టు వివరించింది.