ఆందోళనలో ప్రజలు… మరోసారి లాక్డౌన్ ప్రకటిస్తే మంచిదంటున్న ప్రజలు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొరోన బారిన పడిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. గత మార్చి నెలలో మర్కజ్ వెళ్లిన వేములవాడకు చెందిన 5గురు యువకుల్లో ముగ్గురికి పాజిటివ్ రావడంతో వారు నివసించే ఇంటి ఏరియాను రెడ్ జోన్‌గా ప్రకటించి, పదిహేను రోజుల పాటు పూర్తి స్థాయిలో భద్రతా చర్యలు తీసుకున్నారు. ఈ ఏరియాలో అన్ని ఇళ్లలోకి వైద్య బృందం వెళ్లి తగిన చర్యలు తీసుకోగా ఈ ముగ్గురు యువకులను సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్‌కి తరలించారు. ఈ సంఘటనతో జిల్లా వ్యాప్తంగా కలకలం రేగింది. ఇదే సమయంలో దేశవ్యాప్త లాక్డౌన్ కొనసాగడంతో జిల్లాలో వైరస్ ప్రభావం ఆగింది. లాక్‌డౌన్‌ను ఎత్తివేసిన వెంటనే గల్ప్ దేశాలనుండి, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తమిళనాడుల నుండి జిల్లా వాసులు తమ స్వస్థలాలకు వచ్చారు. ఆనాటి నుండి క్రమంగా వైరస్ వ్యాప్తి చెందడం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో అతి పెద్ద పుణ్యక్షేత్రమైన శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానాన్ని పూర్తిగా మూసి వేసి కేవలం నిత్యపూజలను ఆలయ సిబ్బంది మాత్రమే నిర్వహిస్తూ, భక్తులను అనుమతించలేదు.
లాక్డౌన్ అనంతరం జిల్లాలో వైరస్ వ్యాప్తి ప్రారంభం కావడంతో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది, ఇతర ప్రభుత్వ సిబ్బంది,పోలీస్ సిబ్బంది తగిన చర్యలకు ఉపక్రమించారు. ఈ క్రమంలో కొందరు పోలీసులకు సైతం వైరస్ సోకగా వారిని హోం క్వారంటైన్ చేశారు. గత మూడు రోజుల క్రితం సిరిసిల్ల పోలీస్ స్టేషన్‌లోని ఒక అధికారికి వైరస్ సోకినట్లు గమనించిన వెంటనే మొత్తం సిబ్బందిని హోంక్వారంటైన్‌కు పంపించారు. ఇదే సమయంలో వేములవాడలో ఒక ప్రముఖ వైద్యుడి తండ్రి కొరోనా బారిన పడి మృతి చెందగా ఆయన అంత్య క్రియలు నిబంధనల మేరకు వేములవాడలో నిర్వహించినప్పటికీ ఆ వైద్యుడితో పాటు అతని వద్ద పనిచేసే కంపౌండర్‌కు వైరస్ సోకింది. వీరిద్దరిని హోంక్వారంటైన్ చేయగా అంత్య క్రియల్లో పాల్గొన్న ఒక డాక్టర్‌కు, మరో డాక్టర్‌కు నెగిటివ్ రిపోర్టు వచ్చినప్పటికిని వారు హోంక్వారంటైన్‌కు వెళ్లారు.
జిల్లా వ్యాప్తంగా 2377 మందికి పరీక్షలు చేస్తే 391 మందికి పాజిటీవ్ ంఒచ్చినా జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలకు వైరస్ వ్యాప్తి చోందడం మొదలైంది. పాజిటివ్ వారిలో అత్యధికులను హోంక్వారంటైన్ చేయగా పది సంఖ్యలోపు వారిని మాత్రమే గాంధీ హాస్పిటల్‌కు తరలించగా వారికి చికిత్స కొనసాగుతుంది. పాజిటివ్ రిపోర్టు వచ్చిన వారిలో ఇప్పటి వరకు 57 మంది కోలుకోగా 328 మందికి చికిత్స కొనసాగుతుందని డిఎం• హెచ్ఓ డాక్టర్ సుమన్ మోహన్‌రావు వెల్లడించారు. అయితే వైర్స్ బారిన పడిన వారిలో జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు ఏడుగురు మాత్రమే మృతి చెందినట్లు ఆయన వెల్లడించారు. వైరస్‌ను నియంత్రించడానికి జిల్లాలోని కొన్ని గ్రామాల్లో సెల్ఫ్ లాక్‌డౌన్‌ను ప్రకటించి, ఎవరు కూడా బయట తిరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. అయితే దైవ దర్శనార్ధం వేములవాడకు ప్రతినిత్యం వేలాది మంది భక్తులు వస్తుండటంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు చోటు చేసుకుంటున్నాయి.
ఇప్పటి వరకు వేములవాడలో 20 మందికి పైగా వైరస్ బారిన పడగా ఆ సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజల్లో, అధికారుల్లో కలవరం రేపుతుంది. దీనికి తోడుగా దేవస్థానంలో పనిచేసి ఒక మహిళా ఉద్యోగికి కొరోనా సోకడంతో ఆమె ఇప్పడు హోంక్వారంటైన్లో ఉన్నారు. వేములవాడకు చెందిన ఒక వ్యక్తి సోమవారం రాత్రి మృతి చెందడంతో అన్ని వర్గాలు భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సిరిసిల్ల పట్టణంలోని దాదాపు అన్ని వీధుల్లో వైరస్ వ్యాపించడంతో అక్కడ కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసి పరిస్థితులను ఎప్పటి కప్పుడు సమీక్షిస్తున్నారు. తాజాగా సిరిసిల్ల పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న ఇద్దరు ఎస్ఐలు, ఒక హెడ్ కానిస్టేబుల్‌కు, చందుర్తి మండలకేంద్రంలోని పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌కు కొరోనా పాజిటివ్ రావడంతో పోలీస్ వర్గాలు, వారి కుటుంబాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 415కు పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. సిరిసిల్ల, వేములవాడ పట్ణణాల్లో ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. దీనిని నివారించడానికి ప్రజలనుండి తగిన స్పందన లేదని అధికార వర్గాలు భావిస్తుండగా, అధికారులు తగిన రీతిలో చర్యలు తీసుకోవడం లేదని ఈ రెండు పట్టణాల ప్రముఖులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వైరస్‌ను నియంత్రించడానికి జిల్లా వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను ప్రకటించి, కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతుంది.