Take a fresh look at your lifestyle.

భారత ప్రజాస్వామ్యం ప్రపంచానికే ఆదర్శం

బీహార్‌లో మళ్లీ ఎన్డీయేదే విజయం
బీహార్‌ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ

బీహార్‌లో మళ్లీ ఎన్డీయే విజయం సాధిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. అరరియా జిల్లాలోని ఫోర్బస్‌గంజ్‌లో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ బీహారీ ప్రజలు మళ్లీ ఎన్డీయేకే పట్టం కట్టనున్నట్లు ఆయన తెలిపారు. మంగళవారం బీహార్‌లో 94 నియోజకవర్గాల్లో రెండవ దశ పోలింగ్‌ ‌జరుగుతున్న విషయం తెలిసిందే. మంగళవారం జరుగుతున్న పోలింగ్‌లో గత ఎన్నికలతో పోలిస్తే ఉదయం 10 గంటల వరకే అత్యధిక పోలింగ్‌ ‌జరిగిందన్నారు. ఇది కేవలం దేశానికి మాత్రమే కాదు,  ఇది ప్రపంచానికి సందేశం అన్నారు.  కోవిడ్‌ ‌వేళ ప్రజలు భారీ సంఖ్యలో వోటింగ్‌లో పాల్గొన్నట్లు ఆయన చెప్పారు. ఇది ప్రజాస్వామ్యంలో ఉన్న శక్తి అని, ప్రతి బీహారీ ప్రజాస్వామ్యం పట్ల అంకితభావంతో ఉన్నట్లు మోదీ తెలిపారు. ప్రజాస్వామ్య పండగలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని అన్నారు. భారతీయుల మెదళ్లలో ప్రజాస్వామ్యం ఎలా నాటుకుపోయిందో ప్రపంచవ్యాప్తంగా మేధావులు విశ్లేషించుకునే సందర్భం ఇదని ప్రధాని అన్నారు.

కఠినమైన సమయంలో ఎన్నికల సంఘం అదనపు ఏర్పాటు చేసి ఎన్నికలను నిర్వహించడం గొప్ప విషయమని, ఈసీకి కంగ్రాట్స్ ‌చెబుతున్నట్లు మోదీ తెలిపారు. గత దశాబ్ద కాలంలో బీహార్‌లో ప్రతి ఇంటికి విద్యుత్తు, గ్యాస్‌ ‌కనెక్షన్లు అందాయని, 2021 నుంచి 2030 వరకు మరిన్ని అవసరాలను తీర్చనున్నట్లు ప్రధాని చెప్పారు. ఈ సందర్బంగా కాంగ్రెస్‌ ‌పార్టీపై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేశారు. ఆ పార్టీ పట్ల ప్రజలు తీవ్ర నిరాశతో ఉన్నట్లు ఆయన అన్నారు. అవకాశం వచ్చినప్పుడల్లా ఆ పార్టీని దేశ ప్రజలు శిక్షిస్తూనే ఉన్నారన్నారు. పార్లమెంట్‌లో కనీసం ఆ పార్టీ ఖాతాలో వంద మంది ఎంపీలు కూడా లేరన్నారు. బీహార్‌ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న మోదీ మాట్లాడుతూ..  లోక్‌సభ, రాజ్యసభలు కలిపినా.. కాంగ్రెస్‌ ఎం‌పీల సంఖ్య వంద దాటదన్నారు.  దేశవ్యాప్తంగా ప్రజలు కాంగ్రెస్‌ ‌పార్టీకి బుద్ది చెబుతున్నట్లు ఆయన అన్నారు.  ప్రజల్ని ఇంకా మభ్యపెట్టలేరని, ఇప్పుడు కాంగ్రెస్‌ ‌పార్టీ పరిస్థితి ఏ స్థితిలో ఉందో అందరికీ తెలుసు అని, ప్రజలే ఆ పార్టీని శిక్షించారన్నారు.  కాంగ్రెస్‌ ‌పార్టీని ప్రజలు ఇంకా శిక్షిస్తూనే ఉన్నారని, అందుకే అనేక రాష్ట్రాల్లో ఆ పార్టీ నుంచి ఒక్క ఎంపీ కూడా గెలవలేదని ప్రధాని విమర్శించారు. కాంగ్రెస్‌ ‌పార్టీలో స్వార్థం పెరిగిందని, ప్రజల సొమ్మును వాళ్లు దోచుకున్నట్లు ఆరోపించారు. బీహార్‌, ‌దేశ ప్రజలు ఇప్పుడు ఆ వాస్తవాలను గమనించారని, అందుకే పదేపదే అబద్దాలు చెబుతున్న కాంగ్రెస్‌ ‌పార్టీని ప్రజలు ఓడించారన్నారు. మాటలు చెప్పి, ప్రజలు అలసిపోయేలా చేశారన్నారు.

Leave a Reply