Take a fresh look at your lifestyle.

‌పోరాటమే ఆయనకు నివాళి

  • హక్కుల నేత బాలగోపాల్‌ 13 ‌వ వర్ధంతి సభ
  • ఆదివారం, అక్టోబర్‌ 9, 2022.. ఉ।। 10 ‌గం .లు. సా।। 5.00 మధ్య
  • సుందరయ్య విగ్యాన కేంద్రం, బాగ్‌ ‌లింగంపల్లి, హైదరాబాద్‌.
  • ‌వక్తలు: అరుంధతి రాయ్‌, ‌‌రచయిత మిహిర్‌ ‌దేసాయ్‌, ‌పీయుసిఎల్‌‌ క్లిఫ్టన్‌ ‌డి రోజారియో, ఏఐసిసిటీయు జహ ఆరా, హెచ్‌ ఆర్‌ ఎఫ్‌

మతములన్నీ మాసిపోయి జ్ఞానమొక్కటి నిలిచి వెలిగే రోజు వస్తుందన్నాడు మహాకవి గురజాడ. కాని ఆ రోజు కోసం మనం ఇన్నాళ్ళూ కన్న కలకు పెద్ద విఘాతమే కలిగింది. మెజారిటీ ప్రజల మతానికి చారిత్రకంగా అన్యాయం జరిగిందన్న అపోహలను, అసత్యాలను ప్రచారంలో పెట్టి సమాజంలో, రాజకీయాలలో, పాలనలో, సకల ప్రజాస్వామిక వ్యవస్థలలో మతాధిపత్యాన్ని పాదుకొల్పే హిందూత్వ శక్తులు విజృంభిస్తున్న కాలమిది.

వాట్సప్‌ ‌యూనివర్సిటీలలో సంఘీయులు పుంఖానుపుంఖాలుగా రచిస్తున్న చరిత్రను ఆమోదించే వారి సంఖ్య సమాజంలో గణనీయంగా పెరిగింది, ఇంకా ఇంకా పెరుగుతోంది. ఉత్తర భారతం, ఈశాన్య రాష్ట్రాలు, కర్ణాటక, ఒడిశాలతో పాటు అనేక చోట్ల ముస్లింల మీద, క్రైస్తవుల మీద జరిగిన దాడులను, దాడుల సరళులను చూస్తే సమాజంలో ‘హిందూ మతతత్వ’ భావన, అన్య మతాలపై ద్వేషం ఈ కాలంలో ఎంతగా పెరిగిందీ స్పష్టమవుతుంది. మైనారిటీ ప్రజల హక్కుల గురించి గొంతెత్తుతున్న వారిని హిందూ మత వ్యతిరేకులుగా ముద్ర వేసి వారిని నోరెత్తకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. మన లాగా లేని వారిని, మన లాగా ఆలోచించని వారిని, భిన్న సంస్కృతులు గల వారిని ‘శత్రువులుగా’ భావించి వారిని నిత్య అభద్రతలో ఉంచడం, వారి బ్రతుకుల్ని దుర్భరం చేయడం, తరిమి తరిమి చంపడం ఫాసిజం లక్షణం.

దేశ జనాభాలో 14.2 శాతం ఉన్న ముస్లిం ప్రజల జీవితాలను ఇప్పుడు ప్రమాదంలోకి నెట్టారు. వారి పౌరసత్వ హక్కుపై కత్తి వేలాడదీయడమే కాదు, వారికి జీవనోపాధి కూడా లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నారు. వారి ఆస్తులను బుల్డోజర్లతో కూలగొడుతున్నారు. బీజేపీ పాలిత గుజరాత్‌, ‌కర్ణాటక రాష్ట్రాల్లో వారి వ్యాపారాలను, వృత్తులను దెబ్బతీసే చర్యలు పెద్దెత్తున జరుగుతున్నాయి. ముస్లిం జాలర్లు చేపలు పట్టుకోడానికి వీల్లేదని గుజరాత్‌ ‌ప్రభుత్వం ఆంక్షలు విధిస్తే, ఆత్మహత్యలు చేసుకోవడానికి తమకు అనుమతి ఇవ్వమని వారు గుజరాత్‌ ‌హైకోర్టులో రిట్‌ ‌పిటిషన్‌ ‌దాఖలు చేసే పరిస్థితి రావడం ఎంతటి విషాదం?

ఒకవైపు ప్రజలను మత విద్వేషాల, కలహాల ఊబిలోకి నెడుతూ మరోవైపు కార్పొరేట్‌ ‌శక్తులకు ఎర్ర తివాచీలు పరుస్తోంది బీజేపీ ప్రభుత్వం. మానవ మనుగడకు అవసరమయ్యే గాలి, నీరు, భూమి, సహజ వనరులు, సమస్త ప్రకృతిని ప్రభుత్వం చాపలాగా చుట్టి వారికి కానుకగా కట్టపెడుతోంది. అందుకు అవసరమయ్యే ‘మానవ వనరులను’ కూడా కారుచౌకగా అందించాలంటే ఇప్పుడున్న కార్మిక చట్టాలను మార్చాలి కాబట్టి ‘ఈజ్‌ ఆఫ్‌ ‌డూయింగ్‌ ‌బిజినెస్‌’ ‌పేరిట కార్మిక లోకంపై లేబర్‌ ‌కోడ్‌ ‌పంజా విసిరారు. కార్మిక చట్టాలు కార్మికులకు అండగా నిలవాల్సింది పోయి అంబానీ, అదానీలకు కొమ్ముకాసే విధంగా తయారయ్యాయి.

ఈ ప్రమాద ఘడియలలో రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన అత్యున్నత న్యాయవ్యవస్థ తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించకపోవడం విచారకరం. దేశ రాజ్యాంగ మౌలిక సూత్రాలను, దేశ రాజకీయ చిత్రపటాన్ని తలకిందులు చేసే ఎలక్టోరల్‌ ‌బాండ్స్, ‌పౌరసత్వ సవరణ చట్టం- 2019, ఆర్టికల్‌ 370 ‌రద్దు మొదలైన వాటిని సవాలు చేసిన రిట్‌ ‌పిటిషన్లపై ఇంతవరకూ విచారణ మొదలుపెట్టలేదు. పెగాసస్‌ ‌విచారణకు కేంద్ర ప్రభుత్వం సహకరించలేదని చెబుతూ కూడా కోర్టు నియమించిన కమిటీ ఇచ్చిన నివేదికను గోప్యంగా ఉంచుతామని సుప్రీంకోర్టు అనడం ఎంత వరకు సబబు? తీస్తా సేతల్వాద్‌, ‌హిమాన్షు కుమార్‌ ‌ల మీద క్రిమినల్‌ ‌కేసులు పెట్టమనడాన్ని న్యాయస్థానం ఏ విధంగా సమర్ధించుకుంటుంది? ప్రభుత్వం, శాసనవ్యవస్థ, న్యాయవ్యవస్థ మూడూ రాజ్యానికి చెందిన వేర్వేరు అంగాలు. ఒకరి అధికార దుర్వినియోగాన్ని మరొకరు అదుపు చేసే వ్యవస్థలుగా అవి పని చేయాలనే స్పృహ కోల్పోయి ప్రవర్తిస్తుంటే ఇక ప్రజలు ఎవర్ని నమ్ముకోవాలి?

ఒక పక్క బలమైన ప్రతిపక్షం గురించి మాట్లాడుతూనే, ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాలు ఏర్పాటు చేయకుండా ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టో, తమ చేతిలో అధికారం ఉందని భయపెట్టో లొంగదీసుకుని తమ పార్టీ ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో, ఇతరుల ప్రభుత్వాలను కూల్చడంలో బీజేపీ గత అన్ని ప్రభుత్వాలనూ మించిపోయింది. గిట్టనివారిని ఏళ్ల తరబడి ఉపా, పి.ఎం.ఎల్‌.ఏ. ‌చట్టాల కింద జైళ్లలో కుక్కడం, వారికి బెయిలు దక్కకుండా అడుగడుగునా అడ్డుపడటం, ప్రతిపక్ష పార్టీలనూ, ప్రత్యర్ధులను దేశ ద్రోహులుగా ట్రోలింగ్‌ ‌చేయడం, సోషల్‌ ‌మీడియాలోనే కాదు భౌతికంగా కూడా వారిని వేధించడం, స్టాన్‌ ‌స్వామి, పండు నరోట్‌ ‌వంటి వారి మరణాలకు కారణం కావడం, స్వతంత్ర మీడియా సంస్థల మీద ఆర్ధికంగా, భౌతికంగా దాడి చేయడం, వాటి యాజమాన్యాలను అనుకూల కార్పొరేట్‌ ‌సంస్థలకు కట్టబెట్టడం… ఒకటా రెండా… ఈ పాలనను ప్రజాస్వామ్య పాలన అందామా? ఫాసిజం అందామా? ఈ పరిస్థితి పోవాలంటే మనందరం ఏం చేయాలి?

హక్కుల నేత బాలగోపాల్‌ ‌గారి 13వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వక్తలు ఈ విషయాలన్నిటి మీద మాట్లాడతారు. సమావేశానికి అందరినీ ఆహ్వానిస్తున్నాం.

మానవ హక్కుల వేదిక (HRF)

Leave a Reply