- ప్రపంచవ్యాప్తంగా ఆర్థికస్థితి అంతంతమాత్రమే
- ఎపి పరిస్థితి వేరుగా ఉంటుందనడానికి లేదు
- కోవిడ్ వల్ల రాబడి విపరీతంగా తగ్గిపోయింది
- మీడియా సమావేశంలో రాష్ట్ర ఆర్థికస్థితిపై మంత్రి బుగ్గన
ఈ సంవత్సరం కోవిడ్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ ఒక్క దేశం పరిస్థితి అధ్వాన్నంగానే ఉందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ తెలిపారు. డబ్బున్న రాష్ట్రాల పరిస్థితి వేరు ఏపీ పరిస్థితి వేరని స్పష్టం చేశారు. ఎపిలో ఆర్థిక పరిస్థితిపై కాగ్ నివేదికపై ఆర్థిక మంత్రి బుగ్గన స్పందించారు. కోవిడ్ కారణంగా చాలాదేశాల్లో ఆర్థిక వ్యవస్థ తలకిందులైందని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. బడ్జెట్ అంచనాల కంటే ఎక్కువ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. విజయవాడలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేసిందని మండిపడ్డారు.
గత ప్రభుత్వం ప్రాధాన్యత లేని ఖర్చులు చేసిందని, 2014 నాటికే ఏపీ రెవెన్యూ లోటుతో ఉందని వ్యాఖ్యానించారు. కోవిడ్ వల్ల రాబడి విపరీతంగా తగ్గిపోయిందని, అదేవిధంగా ఖర్చు కూడా పెరిగిందన్నారు. కోవిడ్ కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చిందన్నారు. ప్రభుత్వానికి ఆదాయం తగ్గినా సంక్షేమ పథకాలు ఆపలేదని పేర్కొన్నారు. రాష్ట్రానికి ఆదాయం లేకపోయినా ప్రజలకు సహాయంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భావించారని తెలిపారు. 2019-20 జూన్‌లో రెవెన్యూ రాబడి రూ. 3,540 కోట్లు ఉంటే 2020-21 జూన్‌లో రెవెన్యూ రాబడి రూ. 5,781 కోట్లు పెరిగిందన్నారు. అయితే ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడానికి తాము అప్పులు చేశామని మంత్రి పేర్కొన్నారు.
తమ సంక్షేమ పథకాలు దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా ప్రజల ఖాతాల్లోకి వెళ్తున్నాయని తెలిపారు. 2020-21 తొలి క్వార్టర్లో ద్రవ్యలోటు మైనస్ 12.9 శాతం ఉండగా.. మూడో క్వార్టర్ నాటికి మైనస్ 5.5, చివరి క్వార్టర్లో మైనస్ 3 శాతానికి తగ్గిందన్నారు. జూన్ నుంచి డిసెంబర్ నాటికి జీఎస్టీ పన్నుల రాబడిలో దేశంలోనే రెండో స్థానంలో ఉన్నామని పేర్కొన్నారు. రాబడి లేకపోవటడం వల్ల అప్పులు పెరగటం సహజమని, రాష్ట్రం అప్పులపాలైందనని టీడీపీ చేస్తున్న విమర్శలు అర్థరహితమని కొట్టిపారేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయని… డబ్బున్న రాష్ట్రాల పరిస్థితి వేరు ఏపీ పరిస్థితి వేరని స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో చేసిన ఖర్చు కనిపించేలా లేదని… అన్ని అసంపూర్తిగానే జరిగాయన్నారు.
వ్యాపార సంస్థలు అన్ని ఆగిపోయాయని తెలిపారు. కోవిడ్ వల్ల పరిస్థితిలో ఇబ్బంది ఉంది కనుకే ఎఫ్ఆర్బీఎం లిమిట్‌ను కేంద్రం కూడా 5 శాతానికి పెంచిందని చెప్పుకొచ్చారు. ఆదాయం లేకున్నా ప్రజల కొరకు ఖర్చు చేసి ఆదుకోవాలని సీఎం ఆదేశించారని తెలిపారు. ఇబ్బందులు ఉన్నప్పుడు డబ్బును పంపింగ్ చేస్తే అదే డబ్బులు ఎకానవి•లోకి వస్తుందని..అందుకే అప్పు చేశామని తాము గర్వంగా చెపుతున్నామన్నారు. 2020లో రాబడి భారీగా పెరిగిందని.. దీనికి కారణం ప్రభుత్వం డబ్బు పంపింగ్ చేయడమే అని స్పష్టం చేశారు.