మెదక్, ఏప్రిల్ 27 (ప్రజాతంత్ర ప్రదినిధి) : ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ నేపథ్యంలో తమ తమ స్వస్థలాలకు వెళ్లేందుకు గాను జాతీయ రహదారి వెంబడి వెళ్తున్న వలస కూలీలకు ఎవరైనా దాతల సహకారంతో చెప్పులను అందజేసేందుకు కృషి చేయాలని అధికారులకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు టెలీ కాన్ఫరెన్స్ లో సూచించారు. సోమవారం మెదక్ జిల్లా కేంద్రంలోని అతిథిగృహంలో జిల్లాలోని ఎంపీటీసీలు, జడ్పీటీసీ లు, తహసిల్దార్లు, ఎంపీడీవోలు, ఏపీఓ లు, ఎంపిఓలు, పంచా యతీరాజ్ శాఖ ఇంజనీర్లు, సొసైటీ చైర్మన్, రైస్ మిల్లర్లు లు ఇతరులతో జిల్లాలోని డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలు, ధాన్యం కొనుగోలు, ఉపాధి హామీ పనులపై టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ.. జిల్లాలో పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్ రూమ్ నిర్మాణాల పనులను వేగవంతం చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో చిన్న చిన్న పనుల వల్ల ప్రారంభో త్సవాలు ఆగని వాటిని సత్వరం పూర్తి చేసి ప్రారంభించేందు కు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. ఆయా ప్రాంతాల్లో ఇసుక, సిమెంట్ కొరత లేకుండా ఉండేందుకు గాను తగిన ఏర్పాట్లు చేసుకుని నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. అలాగే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన సిసి రోడ్లకు ఇప్పటికే బిల్లులకు అప్లోడ్ చేసిన పనులను సత్వరం పూర్తి చేయాలన్నారు. రానున్న 15 రోజుల్లో ఈ సిసి రోడ్లను పూర్తి చేయాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. పనులకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే స్థానిక ఎమ్మెల్యే ల ద్వారా పరిష్కరించుకో వాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. ఉపాధి హామీ పనుల్లో జిల్లా రాష్ట్ర స్థాయిలో మెరుగైన ర్యాంకు లో ఉందన్నారు. ఈ విషయంలో జిల్లాలోని అధికారులను మంత్రి అభినందించారు. ఉపాధి హామీ పనుల్లో ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంచేందుకు అన్ని విభాగాల అధికారులు చిత్తశుద్ధితో విధులు నిర్వహించా లని సూచించారు.
ఇప్పటికే కొన్ని మండలాల్లో ఉపాధి హా మీ పనులకు కూలీలు సరిగ్గా రావడం లేదని ఆయా మండ లాల ఎంపీడీవోలు ప్రత్యేక చొరవ తీసుకొని క్షేత్ర స్థాయి సమీక్ష నిర్వహించి కూలీలను పెంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. అలాగే లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన ఆటో కార్మికులు మరియు ఇతర రంగాల కార్మి కులను గుర్తించి వారికి వెంటనే జాబ్ కార్డులను అందజేసి ఉపాధి పని కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకో వాలన్నారు. ఉపాధి హాఉపాధి హామీ పని కోసం జాబ్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న 24గంటల్లో జాబ్ కార్డు అందజేయాలని ఆదేశించారు. గతంలో పనిచేసిన ఉపాధి కూలీలకు పెండింగ్లో ఉన్న బకాయిలను పోస్టాఫీసు ద్వారా నేరుగా వారి ఖాతాల్లో జమ చేసేందుకు గాను ఎంపీడీవోలు, ఏపీఓ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. వారం రోజుల్లోగా పెండింగ్లో ఉన్న బకాయిలు అన్నిటిని చెల్లించేందుకు గాను అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించడం ఇందుకు గాను ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందనీ, గ్రామాలలోని నర్సరీలను ఆకస్మికంగా తనిఖీ చేయడం జరుగుతుందని తనిఖీలో నర్సరీలో మొక్కలు లేని గ్రామాలకి చెందిన సర్పంచ్, మరియు పంచాయతీ సెక్రెటరీలను సస్పెండ్ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా మంత్రి హెచ్చరించారు. ప్రభుత్వ ప్రాధాన్య కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేయాలని ఈ కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలకు వెనుకాడం ఏది లేదని మంత్రి స్పష్టం చేశారు. గతంలో నాటిన మొక్క లో ఎక్కడైనా మొక్క చనిపోతే ఆ స్థానంలో తిరిగి వేరొక మొక్కలు నాటి సంరక్షించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు.
రాష్ట్రంలో రైతులు పండించిన పంటలను కొనుగోలు లేక ఏ రైతు నష్టపోకూడ దనే ఉద్దేశంతో ప్రభుత్వం కనీస మద్దతు ధరకు రైతుల నుండి కొనుగోలు చేస్తుందని ఈ విషయంలో రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి తమ సంపూర్ణ సహకారాన్ని అందించాలని కోరారు. జిల్లాలో ఎలాంటి సమస్యలు లేకుండా కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగుతుందని, తాలు మరియు మిల్లులో దించుకోవడం సమస్యతో ఆయా కేంద్రాల్లో కొనుగోలు మందకొడిగా సాగుతున్నాయన్నారు. కొనుగోలు కేంద్రాల్లో నుండి వచ్చే ధాన్యాన్ని దిగుమతి చేసుకునేందుకు గాను రైస్ మిల్లర్ లేబర్ ను పెంచుకోవాలని మంత్రి సూచించారు. రానున్న పదిరోజుల్లో కొనుగోలు ప్రక్రియ వేగవంతం కానుంది నందున అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. వర్షం పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ సూచించడం జరిగిందని రైతుల ధాన్యాన్ని తడవకుండా ఉంచేందుకు అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని పిఎసిఎస్ చైర్మన్ లకు మంత్రి సూచించారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో టార్పాలిన్ లను అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయాలని అదేవిధంగా కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఈ విషయంలో మండల తాసిల్దార్ లు తమ మండల పరిధిలోని ఉన్న కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేస్తూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కొనుగోలు ప్రక్రియ లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈ టెలీ కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి, ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి, అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, కోనాపూర్ సొసైటీ చైర్మన్ దేవేందర్ రెడ్డి, డిఆర్డిఓ శ్రీనివాస్, డిసిఎస్ఓ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు