Take a fresh look at your lifestyle.

కేంద్ర, రాష్ట్రాల మధ్య నలుగుతున్న వరి రైతులు

కేంద్ర, రాష్ట్రాల మధ్యలో వరి రైతులు నలుగిపోతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించే పంటను  కొనే విషయంలో ఇరు ప్రభుత్వాల ఆడుతున్న నాటకం వరి పండిస్తున్న రైతుల పాలిట ఉరిగా మారుతుంది. ఒకసారి పంటను కొంటామంటారు, మరోసారి అసలు కొనేదేలేదని ప్రకటిస్తారు. ఈ ఆయోమయ ప్రకటనలకు అసలు బాధ్యులెవరో అర్థంకాకుండా పోతుంది. ఎవరికివారు తమదేమీ తప్పులేదని అధికార పత్రాలను చూపిస్తున్నారు. ఈ గందరగోళ పరిస్థితులను దాటి వాస్తవం ఏమిటో తెలుసుకునేవరకు ఆగేందుకు అదేమైనా నెలల తరబడి పెండింగ్‌లో పెట్టే వస్తువా? నవ మాసాలు మోసిన తల్లి ఏ క్షణంలోనైనా ఎలా ప్రసవిస్తుందో, పొట్ట కొచ్చిన పంటను ఏ రోజున కోయాలన్నది రైతు తప్ప ప్రభుత్వానికి ఎలా తెలుస్తుంది. ప్రభుత్వం ఇచ్చే టోకన్ల ప్రకారమే పంటను కోయాలంటే ఎలా కుదురుతుంది. అసలే ప్రకృతి వైపరీత్యాలతో రైతాంగం అతలాకుతలం అవుతుంది. చేతికొచ్చిన పంటను కోసేలోగానే అకాల వర్షాలు వారి ఆశలను ముంచేస్తున్నాయి.

అటు ఆకాశం వైపుచూస్తూనే పంటను కోసుకునే ఏర్పాట్లు చేసుకునే రైతుకు అధికారులిచ్చే టోకన్లు ఎలాంటి భరోసాను కలిపించలేవు. గడచిన రెండు మూడేళ్ళ పరిస్థితిని నెమరు వేసుకుంటే నెలల తరబడి వరి కుప్పలదగ్గర కాపలా కాయలేక రైతులు వేసారి పోయారు. ఎండ, వాన అనకుండా ఆరుకాలం పంట ఉత్పత్తికోసం ఎలా కష్టపడ్డారో, పంట అమ్ముకునే విషయంలో కూడా అంతే అవస్తలకు గురవుతున్నది చూస్తున్నాం. అంతెందుకు ప్రస్తుత వర్షాకాలం పంట విక్రయం విషయంలో కూడా అలాంటి అవస్తలే ఎదరువుతున్నాయి. తన వంతు కోసం ఎదురు చూస్తూ కుప్పకావలి కాస్తున్న రైతు అదే కుప్ప మీద ప్రాణాలు వదిలిన విషయం ఇటీవల అందరినీ కలిచివేసింది. కామారెడ్డి లాంటి ప్రాంతంలో బడి పిల్లలు వరి కుప్పల వద్దకే పుస్తకాలు తెచ్చుకుని చదువుకుంటున్న పరిస్థితులు. నిన్నగాక మొన్న సూర్యాపేటలో పంట విక్రయానికి అధికారులిచ్చే టోకన్ల కోసం పడిగాపులు. చివరకు రస్తారోకోలు, ధర్నాలకు దారి తీసిన పరిస్థితులేర్పడ్డాయి. నల్లగొండ జిల్లాలో నలభై రోజులైనా కొనక పోవడంతో అకాల వర్షాలకు వరి మొలకలొచ్చిన పరిస్థితి. ఇంత జరుగుతున్నా ఇంకా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసే కార్యక్రమంలోనే ఉంది.

వానాకాలంలో వరి పంటలు వేయవద్దని ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ రైతులు మాత్రం వరి పంటను ఆపలేదు. వేసిన పంటను కొనుగోలు చేయాల్సిందేనంటూ ప్రతిపక్షాలు, రైతాంగం చేస్తున్న ఆందోళనతో రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి ఈసారికైతే కొనుగోలు చేస్తామని అయిష్టంగానే ప్రకటించింది. కాని, కొనుగోలు కేంద్రాలను మాత్రం ఇష్టంగా ఏర్పాటు చేస్తున్నట్లు కనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పటికీ అనేక గ్రామాల్లో కోసిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్ద నిలువ చేసినా, అసలు కేంద్రాలను ఇంకా ప్రారంభించకపోవడంతో ఎప్పుడు  కొంటారో తెలియని పరిస్థితి. ఇదిలా ఉంటే సన్నాలు మాత్రమే కొంటారంటూ ఒక ప్రకటన వెలువడుతుంది. దాంతో రైతులు, ప్రతిపక్షాల నుండి గగ్గోలు మొదలవుతుంది. అప్పుడు అలాకాదు సన్నాలు, దొడ్డు వడ్లు కూడా కొంటామంటూ మరో ప్రకటన వొస్తుంది. కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యాన్ని ఆయా ప్రాంతాలకు కేటాయించిన రైస్‌ ‌మిల్లులకు చేర్చే క్రమంలో రైస్‌ ‌మిల్లర్లు ముందుకు రాకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కొందరు రైస్‌ ‌మిల్లు యజమానులు బస్తాకు మూడు నుండి అయిదు కిలోల వరకు కోతకు ఒప్పుకుంటేనే తీసుకుంటామని షరతు పెడుతున్నట్లు వార్తలు వొస్తున్నాయి. కొనుగోలు కేంద్రాల్లో కూడా తరుగు పేరుతో ఎక్కువ తూకం వేస్తున్న పరిస్థితులు. ఒక విధంగా చెప్పాలంటే అటు ప్రభుత్వాలు, ఇటు కోనుగోలు కేంద్ర నిర్వాహకులు, రైస్‌ ‌మిల్లర్లు  రైతులను చెండాట ఆడుకుంటున్నారు.

దీనికి తోడు ఇప్పుడు కేంద్రం ధాన్యాన్ని తీసుకోవడంలేదు కనుక వొచ్చే వేసవిలో ఎట్టి పరిస్థితిలో వరి పంటను వేయనే వద్దని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తాజాగా తమ మాట కాదని వరి పంట వేస్తే ప్రభుత్వం బాధ్యత వహించదని, కొనుగోలు చేసే ప్రసక్తే ఉండదని కరాఖండీగా ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం సేకరించే బియ్యాన్ని ఉప్పుడు బియ్యంగా మార్చి ఎఫ్‌సిఐకి సరఫరా చేయాల్సి ఉంటుందని, కాని, ఎఫ్‌సిఐ  కొనుగోలు చేయదని కేంద్రం స్పష్టం చేసిన దరిమిలా తామీ నిర్ణయం తీసుకోక తప్పలేదని మంత్రి పేర్కొంటున్నారు. అదే విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆదివారం పత్రికలకు వివరించారు. అందుకు ప్రత్యమ్నాయ పంటలు వేసుకోవాలని సూచిస్తున్నారు. అందుకు కావాల్సిన విత్తనాలను, ఎరువులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటిస్తున్నది. కాని, చిన్న కారు రైతులు అంటే అర ఎకరం నుండి ఎకరం, రెండు ఎకరాలకు వరకున్న రైతులు ఎలాంటి వాణిజ్య పంటలను పండిస్తారు, బారీ పంటను ఎవరు కొనుగోలు చేస్తారు, మార్కెట్‌లో వారికి న్యాయం జరుగుతుందా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అంతే కాకుండా దాదాపు అన్ని గ్రామాల్లోనూ కోతుల బెడద విపరీతంగా ఉంది. తమకున్నదాంట్లో ఇంటి వరకైనా కూరగాయలు పండించుకోలేని పరిస్థితిలో రైతులు కోతులతో బాధపడుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఏ పంటను కోతులు దక్కనివ్వవు. అలాంటప్పుడు ఎవరు ఏ పంట వేస్తారు, ఎవరు మార్కెటింగ్‌ ‌చేస్తారు, పంట మార్పిడికి  ఏమేరకు భూమి ఏమేరకు అనుకూలంగా ఉంటుందన్నది రైతాంగం తేల్చుకోలేకపోతున్న పరిస్థితి.

Leave a Reply