Take a fresh look at your lifestyle.

వరి రైతుకు ‘‘ఉరి’’ …!

నిండు గర్భిణీకి ప్రసవం ఎపుడు
చేయాలో మంత్రాసానికి తెలుసు

పొట్టకొచ్చిన పంటను ఎపుడు
కోయాలో సేద్యకారునికి తెలుసు

కానీ ఇపుడు…
నారు మోయని , నీరు పోయని
సేద్యపు నాడీ ఎరుగని ఏలికలే
రైతన్న మీద ఆంక్షల విధిస్తున్నరు
పంట కోత గడువు నిర్థారిస్తున్నరు

స్వరాష్ట్రంలో పంట ఉత్పతికి
అన్నదాత ఎంత కష్ట పడ్తున్నడో
అమ్మకానికంతే అవస్థ పడ్తున్నడు

టోకెన్లకై పడిగాపు కాస్తున్నడు
ధర్నా రస్తా రొఖోలు చేస్తున్నడు
గుండెలు బాదుకు రోధిస్తున్నడు

నెలల తరబడి తన వంతురాక
వరి కుప్పపై అసువు బాస్తున్నడు
ఆత్మహత్యకు ఒడిగడుతున్నడు

ఇంత జరుగుతున్నా…
ధాన్యం కొనుగోలు కేంద్రాలు
సరిపడా ఏర్పాటు చేయకనే
సన్నలు కొంటామని ఒకసారి
దొడ్డు వడ్లు అంటూ మరోసారి
అడ్డగోలు ప్రకటనలు గుప్పించి
వరికి ఉరి తాడు పెనుతున్నరు
రైతు నోట్లో మట్టి గొడుతున్నరు

ఎద్దు ఏడ్చిన ఎవుసం ఎదగదు
రైతు కన్నీరొలికిన దేశం వర్ధిల్లదట

అందుకే పాలకులారా !
ఇకనైనా నిరంకుశ పోకడ వీడి
వరి రైతుకు న్యాయం చేయండి
కాదంటే రైతాంగ ఆగ్రహజ్వాలల్లో
భస్మీపటలం కాక తప్పదు సుమీ !

                     – కోడిగూటి తిరుపతి, 9573929493

Leave a Reply