Take a fresh look at your lifestyle.

 ‘‘‌వరి పంట కారాదు రైతులకు  ఉరితాడు’’

మానవ మనుగడకు  ఆహారం అవసరం. ఆదిమ కాలంలో మానవుడు ప్రకృతిలో విహరిస్తూ, ప్రకృతిలో లభించే కందమూలాల తో,  జంతువులను వేటాడి తమకు కావాల్సిన ఆహారాన్ని   సేకరించుకుని జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేవాడు. కాలక్రమేణా   స్థిర  నివాసం ఏర్పరచుకొని, జంతువులను మచ్చిక చేసుకొని వ్యవసాయం చేయడం   నేర్చుకున్నాడు. మొదట  ఆహారం  కోసం మాత్రమే, తాము బ్రతకడానికి,  పని చేయడానికి శక్తి కోసం  పంటలు పండించే వాడు.   నాగరికత   అభివృద్ధి పరిణామక్రమంలో  వ్యవసాయంలో కూడా  విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. మనదేశంలో  హరిత విప్లవంతో వ్యవసాయ రంగంలో   అనేక మార్పులు సంభవించాయి. సరళీకృత విధానాల తర్వాత వ్యవసాయ రంగం పూర్తిగా వాణిజ్య పరమైంది. దీంతో రైతుల కష్టాల కడలి ప్రారంభమైంది. తినడానికి తిండి గింజల కోసం మాత్రమే  తాపత్రయ పడిన రైతులు, ప్రజలందరి ఆకలి తీర్చడానికి కోసమే ఆహార పంటలు పండించిన రైతులు పాలకుల విధానాలతో  వాణిజ్య పంటల వైపు పరిగెత్తడంతో  వ్యవసాయరంగం రూపురేఖలు  మారి రైతుల ఉనికినే ప్రశ్నార్థకం  చేశాయి..

లాభనష్టాల పరంపరలో, ప్రకృతికి విభిన్నంగా  తక్కువ భూమిలో  ఎక్కువ దిగుబడి సాధించాలని,  సాంప్రదాయ వ్యవసాయ విధానంలో  రసాయనిక ఎరువుల వాడకం ఎక్కువయింది. దీంతో పెట్టిన పెట్టుబడి రాకపోవడంతో  రైతులు అప్పులపాలై,  ఆ అప్పులను భరించలేని స్థాయికి చేరుకున్న  తరువాత ఉరికొయ్యకు వేలాడుతూ, పురుగుల మందే పెరుగన్నం గా స్వీకరిస్తూ తనువులు చాలిస్తున్న  హృదయ విదారక సంఘటనలు నిత్యకృత్యమయ్యాయి. రైతుల నష్టపోవడానికి ప్రకృతి వైపరీత్యాలు ఒకవైపు, మరోవైపు పాలనా విధానాలు, వాణిజ్య అవసరాలు, స్వార్థపూరితమైన లాభాపేక్షతో తయారుచేసిన కల్తీ విత్తన వంగడాలు, రసాయనిక ఎరువులు కారణం అవుతున్నాయి. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడం తప్ప వాటినుండి తప్పించుకోవడం సాధ్యం కాకపోవచ్చు. కానీ పాలనా విధానాల వల్ల రైతులు నష్టపోవడాన్ని పూర్తిగా నిర్మూలించవచ్చు, వాటినుండి కాపాడవచ్చు. అలాంటి పరిష్కార మార్గాలు ఉన్నను…. పాలకులు తమ పాలనా విధానాల చేత రైతులను నట్టేట ముంచకుండ కాపాడుకోవాల్సిన తరుణంలో, వారు ఆత్మహత్యలకు పాల్పడే విధంగా చర్యలు ఉండటం అమానుషం. రైతే రాజు అని, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని, రైతే దేశానికి వెన్నెముక అని, రైతు సంక్షేమమే తమ ధ్యేయమని వొట్టి  మాటలు ,కథలు చెబుతూ  కొంతమంది స్వార్థపూరిత ప్రయోజనాల కోసం, కొన్ని వర్గాలకే లాభం చేకూర్చేలా నూతన చట్టాల పేరిట, పాలనా విధానాల పేరిట రైతు సంక్షేమానికి వ్యతిరేకంగా,  చివరికి వారు తనువులు  చాలించే విధంగా విధానాలు ఉండటం భవిష్యత్తు సమాజానికి అభివృద్ధికి  విఘాతం..

ఈ మధ్యకాలంలో గత సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మానవాళి మనుగడను ప్రశ్నార్ధకం  చేస్తూ తన వికృత రూపాలతో విలయ తాండవం చేస్తూ  విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాలు ప్రజారోగ్యం కోసం ,సంక్షేమం కోసం ఈ  విపత్తు నుండి  కాపాడవలసిన ప్రత్యేక పరిస్థితులలో కార్పొరేట్‌ ‌పెత్తందార్లకు అనుకూలంగా,  వారి లాభార్జన కోసం, వారిని ప్రపంచ కుబేరుల జాబితాలో మొదటి వరుసలో నిలబెట్టడానికి నూతన చట్టాలను ప్రజాస్వామ్యబద్ధంగా పార్లమెంట్లో చర్చకు పెట్టకుండా ప్రతిపక్ష పార్టీలు, వ్యవసాయరంగ మేధావులు ,ఆర్థికవేత్తలు, నిపుణులు వ్యతిరేకిస్తున్న ఆలోచించకుండా నూతన వ్యవసాయ సాగు చట్టాలను  తీసుక రావడం, వాటికి అనుకూలంగా, అమలు పరిచే విధంగా చర్యలు ఉండటంతో .. తీవ్రంగానష్టపోతామని భావించిన రైతాంగం దేశవ్యాప్తంగా సంవత్సర కాలంగా  ప్రజాస్వామికంగా నిరసనలు తెలియజేస్తున్న, వాటిని గురించి పట్టించుకోకుండా నామమాత్రపు చర్చలతో కాలయాపన చేస్తూ ఉద్యమం చేస్తున్న రైతులను నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ, వారు  ముందుకు సాగకుండా  రోడ్లపై కందకాలు తవ్వడం,  మేకులు నాటడం, కేసులు పెట్టడం లాంటి అమానవీయ  ఘటనలతో వందల మంది రైతులు మరణించడం విచారకరం. ఇలాంటి తరుణంలో కూడా పాలక ప్రభుత్వాలు స్పందించకపోవడంతో రైతులు పట్టు విడవకుండా ఉద్యమం కొనసాగిస్తూ  ఎక్కడికి  అక్కడ నిరసనలు తెలియజేస్తున్న క్రమంలో,  సంయమనంతో, సమన్వయంతో వారిని శాంతపరచ కుండా, చర్చించి సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేయకుండా వారిపై  ప్రతి దాడులకు పాల్పడటం, కార్లతో తొక్కించడం ఏ ప్రజాస్వామిక  సూత్రమో? వారికే తెలియాలి..

ప్రస్తుతం పండించిన వరి పంటను కనీస మద్దతు ధర చెల్లించి  కొనుగోలు చేయవలసిన పరిస్థితుల్లో ఆరుగాలం శ్రమించి పంట చేతికి వచ్చిన తర్వాత కొనుగోలు చేయమని చెప్పడంతో  రైతులు  దిక్కుతోచని స్థితిలో,  తీవ్రమైన ఆందోళనలతో గుండె బరువెక్కి అప్పులు తీర్చలేము అన్న బాధతో ప్రాణాలు కోల్పోతున్న నిస్సహాయ స్థితి చూస్తూ ఉండటం  హృదయాన్ని కలచివేస్తుంది. వరి పంట కొనుగోలు విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దోబూచులాడుతూ, ఒకరిపై ఒకరు ప్రత్యారోపణలు చేసుకుంటూ ,మా బాధ్యత కాదు అంటే మా బాధ్యత కాదని, బాధ్యతారహితంగా ప్రకటనలు వెలువరించడం తో అమాయకపు  రైతాంగం దిక్కుతోచని స్థితిలో అయోమయానికి గురి అవుతుంది. యాసంగి సాగుకు వరి పంట వేయొద్దని ఒక పక్షం, వేయమని మరొక పక్షం ఎవరికి వారు రైతుల పట్ల కపట ప్రేమ తో ప్రకటనలు గుప్పిస్తూ ఉండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.  వాస్తవ విషయాలకు సత్యదూరంగా వ్యవహరిస్తుండటంతో ఏమి చేయలేని పరిస్థితుల్లో రైతాంగం కొట్టుమిట్టాడుతోంది. యాసంగి పంట పండించడం పక్కనబెడితే ప్రస్తుతం పండిన పంటను కొనుగోలు చేయడానికి తీవ్రజాప్యంతో నెలల తరబడి  ధాన్యపు రాశుల వద్ద పడిగాపులు కాస్తూ, కనీస మద్దతు ధర చెల్లించకుండా తరుగు పేరిట దోపిడికి గురి చేస్తున్న వాటిని నివారించకుండా  కంటి తుడుపు చర్యలు చేపట్టడంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్నం పెట్టే రైతుకు సున్నం పెట్టడమేమిటని ప్రశ్నిస్తున్నారు. కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు టోకెన్లు తీసుకోవాలని ప్రభుత్వ నిబంధన పెట్టడంతో  రాత్రింబవళ్ళు టోకెన్ల కోసం కార్యాలయాల ఎదుట నిరసిస్తూ ఉండటం, ఆ టోకెన్లను సకాలంలో జారీ చేయకపోవడంతో అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే   సన్నరకం వడ్లకు మార్కెట్లో ధర ఉంటుంది,  సన్నరకం ఎక్కువగా సాగు చేయండి అని ప్రోత్సహించిన రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు తీర ధాన్యం చేతికొచ్చాక కొనుగోళ్ల సంగతిని మరిచి, వాటి బాధ్యతను మిల్లర్లకు  వదిలేయడంతో పెట్టుబడి ఎక్కువై దిగుబడి తక్కువ వచ్చి నష్టపోయినా తట్టుకొని ఈసారైనా గిట్టుబాటు అవుతుందని సాగు చేస్తే కనీస మద్దతు ధరలు అందించకుండా గాలికి వదిలేయడంతో రైస్‌ ‌మిల్లర్లు ఎంత కొంటే అంతకు   అమ్మాల్సిన దుర్భర పరిస్థితి నెలకొనడం శోచనీయం.

కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర నిర్ణయించేటప్పుడు సన్న రకంనకు  ఒక ధర ,  దొడ్డు రకంనకు ఒక ధర  అని నిర్ణయించదు. ఏ గ్రేడ్‌, ‌సాధారణ రకం అను రెండు కేటగిరీలను పరిగణలోకి తీసుకుంటుంది. ఈ ఏడాది ఏ గ్రేడ్‌ ‌కు క్వింటాల్కు 1960 రూపాయలు,  సాధారణ రకమునకు 1940 రూపాయలుగా  కనీస మద్దతు ధర నిర్ణయించడం జరిగింది. ఒక 1% మట్టి, 1% తాలు, 5% కల్తీలు, 3%పాలు తక్కువ పట్టిన గింజలు ,17%వరకు తేమ ఉన్నప్పటికీ కనీస మద్దతు ధర చెల్లించాల్సిందే..  ప్రస్తుతం మార్కెట్లో   క్వింటా సన్న బియ్యాన్ని 4వేల 500 రూపాయల నుండి నాలుగు వేల ఆరు వందల రూపాయల వరకు అమ్ముతున్నారు. ఈ సందర్భంలో  సన్నరకం ధాన్యాన్ని క్వింటాల్‌ ఇరవై 2200 నుండి   2300 రూపాయల చొప్పున కొనవచ్చు .. కానిఈ సమయంలో  1760 నుంచి 1800 కు కొంటున్నారు . ఇది దొడ్డు రకం కన్నా మరియు కనీస మద్దతు ధర కంటే కూడా తక్కువగా చెల్లించడం, సన్నరకం ధరలు మిల్లర్లు   శాసిస్తూ ఉండటంతో అన్నదాతకు కనీస మద్దతు ధర అందని ద్రాక్షల తయారయింది. వరి ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు పెట్టడంతో   రాష్ట్ర ప్రభుత్వం కూడా సేకరణ భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తుంది . ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం చోటు కేసు కోవడంతో అమ్మకాల కోసం కోసం రైతులు తరబడి నిరీక్షిస్తూ అవస్థలు పడుతున్నారు. మరోవైపు ఇటీవల కురిసిన వర్షాలతో ధాన్యం మొలకెత్తుతుంది. ఫలితంగా రైతులు ఆరోగ్యానికి గురై, ఆందోళనకు గురై ధాన్యం కుప్పలు మీదనే ఊపిరి విడుస్తున్నారు .   అందువల్ల పాలక ప్రభుత్వాలు రైతులకు ఉరితాళ్లు  పేనడం మాని వర్షాకాలం  పండించిన ధాన్యాన్ని కనీస మద్దతు ధర చెల్లించి  తక్షణమే కొనుగోలు  చేసి రైతాంగాన్ని  ఆదుకోవాలి. యాసంగిలో  ప్రత్యామ్నాయ పంటల సాగుపై సమగ్ర విధానాన్ని,  ప్రణాళికను తయారుచేసి వ్యవసాయ రంగ నిపుణులు శాస్త్రవేత్తలతో రైతులకు అవగాహన కలిగించి   వరి సాగును నియంత్రించి, భూ సారం ప్రకారం వేరుశెనగ,    పొద్దుతిరుగుడు, నువ్వులు,  శనిగలు,  కూరగాయలు  వంటి వాటిని పండించే విధంగా చర్యలు చేపట్టాలి. యాసంగి పంటలకు కనీస మద్దతు ధర నిర్ణయించాలి. రైతుకు భరోసా ఇచ్చి  అప్పుల పాలు కాకుండా, బీమా సౌకర్యాన్ని కల్పించి రైతాంగ వ్యతిరేక విధానాలకు స్వస్తి చెప్పి , చిత్తశుద్ధితో రైతు సంక్షేమం కోసం పని చేసినప్పుడే దేశం సుభిక్షంగా ఉంటుంది. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం   రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదనే  విషయాన్ని గ్రహించి   రాజకీయాలకతీతంగా  యుద్ధ ప్రాతిపదికన సత్వర చర్యలు గైకొని అన్నదాతలను  ఆదుకోవాలని ఆశిద్దాం…

tanda-sadhanandha
– తండా సదానందం, టీపీటిఏఫ్‌ ‌జిల్లాఉపాధ్యక్షుడు, మహబూబాబాద్‌ ‌జిల్లా                          

 

Leave a Reply