(నేడు జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం )
లాక్ డౌన్ కాలంలో ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డ వలస కూలీలు, ప్రైవేటు టీచర్లు, హైదరాబాద్ వరదల సమయంలో తిండి గింజలు కూడా లేక ఆకలితో అలమటించిన పేదలు- పస్తులతో పడుకునే ఇలాంటి ఎంతో మంది నిస్సహాయులను ఆదుకున్న రాము గారి రైస్ ‘ఏటీఎం’. తినడానికి తిండి లేని సమయంలొ వారికి నేను ఉన్నా అని ఇంటిముందు వాలిపోయే గొప్ప హృదయం రాము గారిది. కొరోనావైరస్ లాక్డౌన్ రోజులలో, వలస కార్మికులు, పేదలు ఉద్యోగాలు, డబ్బు లేకుండా చిక్కుకుపోవడం చూసిన ఉత్తరాది సినీ నటుడు సోను సూద్ వారికి సహాయం చేయడానికి బయలుదేరినట్లే తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో, మరో రియల్ హీరో దోసపాటి రాము. కార్పొరేట్ సంస్థలో హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న రాము 2020 ఏప్రిల్ నుండి హైదరాబాద్‌లో అవసరమైన వారికి వారం రోజులూ, 24 గంటలూ బియ్యం ఇతర నిత్యా వసరాలు ఉచితంగా, ప్రతిఫలం ఆశించకుండా సరఫరా చేస్తూ ‘రైస్ ఎటిఎం’ నడుపుతున్న నిజమైన హీరో.
ఎల్బీనగర్ రైస్ ఏటీఎం దగ్గరే 250 రోజులపాటు రోజుకు 100 కుటుంబాలకు బియ్యం నిత్యావసర సరుకులు అందించారు. అర్దరాత్రి ఫోన్ చేసినా వారి దగ్గరకు నేరుగా వెళ్లి సహాయం చేసిన వ్యక్తి. నగరాన్ని వర్షాలు ముంచెత్తిన సమయంలో గల్లీ గల్లీకి వెళ్లి ఆహారం అందించారు. కొరోనా కాలంలో ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు జీతం చెల్లించని ఉపాధ్యాయులు సుమారు వెయ్యి మందికి నెలవారీ కిరాణా సామాగ్రి పంపిణీ చేసారు. ఆపదలో ఉన్నవారికి నేనున్నా అంటూ హైదరాబాద్‌లో రాత్రి పగలు తేడా లేకుండా ఆయనే ఒక సైన్యమై వరద బాధితులకు సహాయం చేశారు. పని కోసం ప్రయత్నించు, పస్తులు ఉండాల్సి వస్తే ఇక్కడకి వచ్చి నిత్యావసర సరుకులు తీసుకెళ్ళు అని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడ్తూ ఎందరికో భరోసా కల్పించాడు. ప్లాస్టిక్ కవర్లు వద్దంటూ హైదరాబాద్‌లో ప్లాస్టిక్ మీద ఒక యుద్దమే చేశాడీయన. రాబోయే తరం యువతకు సేవ చేయడానికి స్ఫూర్తి ఈ రాము….
పొలిటికల్ సైన్స్ లెక్చరర్. నల్గొండ జిల్లా.