దేశంలో ఎక్కడా లేని విధంగా చర్యలు: సిఎస్ సోమేష్ కుమార్
రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్ల రంగంలో దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తొలిసారిగా విప్లవాత్మక మార్పులను చేపట్టామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రిజిస్ట్రేషన్ల విధానాన్ని సరళీకృతం చేయడం, యూజర్ ఫ్రెండ్లీ, అవినీతి రహితంగా నియమిత కాలంలో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్లను అందించాలన్నదే నూతన విధాన లక్ష్యమని అన్నారు.
ఎంసిహెచ్ఆర్డిలో జరిగిన కార్యక్రమంలో సీఎస్ సోమేశ్‌కుమార్ మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో అక్రమాలను ఆరికట్టి మరింత నాణ్యాతాయుత సేవలను అందించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తెలిపారు. ఈ విధానం వల్ల మధ్యవర్తుల ప్రమేయం లేకుండా తమ ఆస్తుల విలువలను లెక్కించడం, చెల్లించాల్సిన సుంకాలను తామే సులభంగా తెలుసుకునే వెసులుబాటు ఉన్నందున ప్రజల నుంచి పెద్దయెత్తున సానుకూల స్పందన లభిస్తోందన్నారు. ఐటీ రంగంలో అత్యుత్తమ విధానాలను అనుసరించడం ద్వారా డిజిటలైజ్ చేసిన సమాచారం, చిత్రాలను సురక్షితంగా ఉంచేందుకు ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు చేపట్టిందని అన్నారు.