ముల్కీరూల్స్ కొత్తగా నిర్వచించి 1956 స్థానికతను పరిగణలోకి తీసుకొని విద్య, ఉద్యోగ అవకాశాల్లో అన్ని నియామకాలలో ఈ సూత్రం పాటించాలి. ఇక్కడి భూమి పుతృలకు అవకాశాలు దక్కే విధంగా ఖచ్చితమైన నిబంధనలు రూపొందించకపోతే భవిష్యత్ తరాలు బాగుపడవు. తెచ్చుకున్న తెలంగాణాకు అసలు అర్దం ఉండదు, చరిత్ర మనల్ని క్షమించదు. నియామకాల్లో ఈ అంశాన్ని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. ప్రభుత్వం ద్వారా భూమి మరియు ఇతర సదుపాయాలు పొందుతున్న ప్రైవేటు యాజమాన్యాలు కూడా ఇక్కడి స్థానికులకు అధిక అవకాశాలు ఇవ్వాలనే ఖచ్చితమైన నిబంధనలు తీసుకురావాలి.ముల్కీ రూల్స్ పునరుద్ధరణనే అన్ని సమస్యలకు ఏకైక పరిష్కారం.‘ముల్కీరూల్స్ పునరుద్ధరణ’ డిమాండ్‌పై దృష్టి సారించాల్సిన బాధ్యత తెలంగాణాలోని అన్ని రాజకీయ పార్టీలు, మేధావులు, విద్యావంతులు, రచయితలు, కవులు, కళాకారులు, విధ్యార్థులు, యువకులు, నిరుద్యోగుల అందరి పైన ఉంది.
ఆది నుండి ఉద్యోగ నియామకాల విషయంలో ఇక్కడి భూమి పుత్రులకు, స్థానికుకు అన్యాయమే జరుగుతుంది.స్థానికేతరులు వచ్చి ఉద్యోగాలు దక్కించుకోవడం వల్ల స్థానిక, నిరుద్యోగులు నిరంతరం ఆందోళనలు లేచేయవలసి వచ్చింది. 1919లో ఏడవ నిజామ్ మీర్ ఉస్మాన్అలీ స్థానిక నివాస నిబంధనలు (ముల్కీరూల్స్) క్రమబద్ధం చేశారు.హైదరాబాద్ రాష్ట్రంలో జన్మించిన వారు, మరియు వరుసగా 15 సంవత్సరాలపాటు స్థానికంగా నివాసం ఉన్న వారిని ముల్కీలుగా పరిగణించవచ్చని ఫర్మానా జారీచేశారు. అయినా సరే ఒకవైపు ముల్కీరూల్స్ ఉల్లంఘనలు జరగడం,మరోవైపు నిబంధనలు అమలు చేయానీ ఆందోళనలు తరచుగా జరిగాయి.

సురేష్ కాలేరు
రాష్ట్ర సహాధ్యక్షులు
తెలంగాణ ఉద్యోగుల సంఘం