- ఇటు లంచం తీసుకుంటూ
- ఏసిబికి ‘ఛీ’క్కిన మెదక్ అదనపు కలెక్టర్ అరెస్టు
- ఎన్వోసి కోసం రూ. 1.12కోట్ల లంచం
- అందు కోసం ప్రాపర్టీ రాయించుకున్న వైనం..!
- నర్సాపూర్ ఆర్డీవో అరుణారెడ్డి, తదితరుల అరెస్టు?
రెవెన్యూ శాఖలో అవినీతి గణనీయంగా పెరిగిపోయిందన్న ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గత మూడేళ్లుగా రెవె‘న్యూ’ చట్టాన్ని తెచ్చేందుకు కసరత్తు చేసి ఎట్టకేలకు బుధవారం అసెంబ్లీలో కొత్త రెవెన్యూ చట్టానికి సంబంధించి బిల్లును ప్రవేశపెట్టారు. ఓ పక్కన చట్ట సభల్లో నూతన రెవెన్యూ చట్టానికి సంబంధించిన బిల్లును ప్రవేశపెడుతున్న సమయంలోనే…ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన అదనపు కలెక్టర్ నగేష్ భారీగా లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ(ఏసిబి)అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడు. మొన్నటికి మొన్న కీసర మాజీ తహశీల్దార్ నాగరాజు అవినీతి ఉదంతాన్ని మరిచిపోకుండానే…తాజాగా అదనపు కలెక్టర్ హోదాలో ఉన్న నగేష్ భూమికి సంబంధించి ‘నో అబ్జెక్షన్ సర్టిఫికెట్’(ఎన్వోసి) ఇచ్చేందుకు ఏకంగా ఒక కోటి 12లక్షల రూపాయల లంచం తీసుకుంటుండగా…ఏసిబి అధికారులు పక్కా ప్రణాళికతో అదనపు కలెక్టర్ నగేష్‌ను పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్లితే..నర్సాపూర్ డివిజన్లోని తిప్పల్‌తుర్తి గ్రామంలో 112 ఎకరాల భూమికి సంబంధించి ఎన్వోసీ కోసం ఏకంగా రూ.1.40 కోట్లు డిమాండ్ చేశారు నగేష్. నర్సాపూర్ మండలం తిప్పల్‌తుర్తి గ్రామానికి చెందిన 112 ఎకరాలకు ఎన్వోసి కోసం అడిషనల్ కలెక్టర్ నగేష్ రూ.కోటి 40 లక్షలు డిమాండ్ చేశారు. ఎకరాకు 10 లక్షల చొప్పున..మొత్తం కోటి 12 డిమాండ్ చేశారు. అయితే, తొలి విడతగా రూ.40 లక్షలు లంచం తీసుకుంటుడగా ఏసీబీ అధికారులు బుధవారం రెడ్‌హ్యాండెండ్‌గా పట్టుకున్నారు.
ఆడియో క్లిప్ సహా అడ్డంగా దొరికిపోయారు నగేష్. ఈ క్రమంలో ఉదయం మాచవరంలోని నగేష్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆయన నివాసంతో మరో 12 చోట్ల తనిఖీలు చేస్తున్నారు. లంచం డబ్బులు ఇవ్వడానికి ఏకంగా అగ్రిమెంట్ కూడా చేయించుకున్నాడు. రంగంలోకి దిగిన అధికారులు.. మాచవరంలోని నగేష్ ఇంట్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. చెక్కుతో పాటు ప్రాపర్టీ అగ్రిమెంట్, ఆడియో క్లిప్‌లతో సహా దొరికిపోయాడు నగేష్. లంచంగా కోటి 12 లక్షల డబ్బు, కోటి రూపాయల ప్రాపర్టీ కూడా రాయించుచున్నట్టు తెలుస్తోంది. మరోవైపు..నగేష్ వ్యవహారంతో ఏకకాలంలో 12 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు ఏసీబీ అధికారులు. ఈ కేసులతో అడిషనల్ కలెక్టర్‌తో పాటు రెవెన్యూ సిబ్బంది పాత్రపై విచారణ చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే నగేష్ భార్యను విచారణ నిమిత్తం బోయిన్‌పల్లికి తరలించారు. ఏసిబి డిఎస్పీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ సోదాల్లో సీఐలు ఫయాజ్, గంగాధర్, ఎస్ఐలు మజీద్ అలీ ఖాన్, నాగేంద్ర బాబు, రామలింగారెడ్డి, శంకర్ రెడ్డి, శ్రీధర్ తదితరులు ఉన్నారు.
శేరిలింగంపల్లికి చెందిన మూర్తి అనే వ్యక్తికి నర్సాపూర్ మండలం తిప్పల్‌తుర్తి గ్రామంలో గల 112 ఎకరాలకు ఎన్వోసి ఇచ్చేందుకుగానూ అడిషనల్ కలెక్టర్ నగేష్ 1.12 కోట్లు లంచం అడిగిన నేపథ్యంలో ఫిర్యాదు అందుకున్న ఏసి అధికారులు ఏకకాలంలో 12 చోట్ల సోదాలు చేసి నగేష్‌పై కేసు నమోదు చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ ఆర్డీవో అరుణారెడ్డి ఇంట్లోనూ ఏసిబి అధికారులు సోదాలు నిర్వహించగా…26 లక్షల రూపాయల నగదుతో పాటు, అరకిలో బంగారు ఆభరణాలు లభ్యం కాగా వీటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే, భారీ మొత్తం లంచంగా తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా అడిషనల్ కలెక్టర్ పట్టుబడడం తెలంగాణలో సంచలనంగా మారింది. మొన్న కీసర మాజీ తహిశీల్దార్ నాగరాజు…ఇవాళ మెదక్ జిల్లా అదనపు కలెక్టర్. తెలంగాణలో లంచం తీసుకోవడంలోనూ రికార్డులు సృష్టిస్తున్నారు. నాగరాజు లంచం తీసుకున్న ఘటన మర్చిపోక ముందే.. మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్.. కోటి 12 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు. కిందిస్థాయి సిబ్బంది తప్పు చేస్తే మందలించాల్సింది పోయి…కలెక్టర్ లంచం తీసుకోవడం విమర్శలు వెల్లువెత్తున్నాయి. జిల్లా కలెక్టర్ స్థాయి అధికారిగా ఉండి ఇంత భారీ మొత్తంలో లంచం తీసుకోవడం ఇదే తొలిసారి.