Take a fresh look at your lifestyle.

తిరగబడిన ప్రపంచంలో

విత్త ప్రపంచపు కొత్త వాకిళ్ళలో
ఎక్స్ప్రెస్‌ ‌హైవేలు, స్కై వేలు,
మల్టీ లేయర్‌ ‌ఫ్లై ఓవర్‌ ‌లు,
నింగిని తాకే టవర్స్, ‌మెట్రో పిల్లర్‌,
‌గ్లోబల్‌ ‌సిటీ, స్మార్ట్ ‌సిటీ, గ్రీన్‌ ‌సిటీ హై టెక్‌ ‌సొగసులు
అంతర్జాతీయ ప్రమాణాల రహదారులు, ప్రాజెక్టులు
ఆహా .. ఎంతగా పురోగమిస్తున్నాం ..
ఎటుచూసినా ఆధునికత చిగుర్లు తొడిగి మొగ్గలేస్తూ
రా రమ్మని ఆహ్వానించే స్వర్గధామం ఈ మహానగరం
ఆహా .. ఏమి అభివృద్ధి ఈ కళ్ళు చాలడం లేదు చూడ్డానికి
అని నిన్నటివరకూ మురిసిన నాకు
ఇప్పుడక్కడ అవేమి అగుపించడం లేదు

ఆ స్థానంలో
రాళ్ళల్లో , రప్పల్లో.. నిగనిగలాడే రహదారుల్లో
రక్తమోడుతున్న పాదాలే ..
చీమల బారులా అలుపు సొలుపూ
లేకుండా నిరంతరం సాగుతున్న గాయాలే ..
నెత్తిన తట్ట బుట్ట, చంకన పిల్లాపాపలతో
పాయలు పాయలుగా కదిలే వేదనలే
సొంతగూటికి సముద్రమై ఉప్పొంగుతూ
ఆశల ప్రయాణం సాగిస్తున్న దేహాలే ..
కళ్ళముందు కదలాడుతున్నాయి

ఆ గాయాల పాదాల  దేహాలన్నీ ..
నవనాగరక నగర నిర్మాణంలో
రాళ్ళెత్తిన కూలీలవి
పనితప్ప గుర్తింపు ఎరగని కూలీలవి
బతుకు ఆరాటమే తప్ప
హక్కులకోసం పోరాడని సైనికులవి
కమిలిపోతూ, కుమిలిపోతూ, నలిగిపోతూ
ప్యాకేజీల మడతల్లోని
మతలబులెరగని బహుదూర బాటసారులవి

కరోనాతో తిరగబడిన ప్రపంచంలో
తల్లడిల్లుతూనే ఆకలిదప్పులనదిమి
తల్లి ఒడి చేరాలన్న గుండె తడి
చేసే హడావిడిలో చేత చిల్లిగవ్వ లేకున్నా
ఇంటికే చేరతారో కాటికే చేరతారో
తెలియని ముళ్ళదారుల్లో మండే ఎండల్లో
బారులు బారులుగా కదిలే వలసకూలీలవి
దేశ అభివృద్ధి బండి చక్రాల కింద పడి
నలిగి నెర్రలు వాసిన ఆ హృదయాలు
నెత్తురు తాగుతున్న బాటల్లోని అతిథి కూలీలవి

మిలమిల మెరిసే మహానగరపు మెరుపుల్లో
తళతళ లాడే మాయానగరపు తళుకుల్లో
ప్రగతి దీపం కింద చీకటిలా..
ప్రజాస్వామ్యం కంటి కింది చారికల్లా..

నగరాన్ని దాటి వస్తుంటే .. ఆశ్చర్యం ..
ఎర్రటి ఎండల్లో.. సుడిగాడ్పుల్లో..
రాటుదేలిన సున్నితత్వం
ఆవిరైన ఆశల మూటగట్టుకు వెనుదిరిగిన
అతిథి కూలీల ఆదరించి అన్నంపెట్టి
సాదరంగా బండెక్కిస్తున్న మానవత్వం
నేను నుండి మనం కేసి సాగిన విశాలత్వం
రేపటి పట్ల ఆశలు చిగురింప చేస్తూ
జీవితపు సువాసనలు వెదజల్లుతూ
తిరగబడిన ప్రపంచంలో …
– వి. శాంతి ప్రబోధ•

Leave a Reply