- వరద సాయం పేరుతో వోట్లు దండుకోవాలన్న ఆతృత
- ప్రజల కష్టాలు వీరికి పట్టడం లేదు కాంగ్రెస్ ఎంపి రేవంత్ రెడ్డి
వరద సాయం పంపిణీ పేరుతో గ్రేటర్ ఎన్నికల్లో వోట్లు దండుకోవాలన్న ఆతృత తప్ప టీఆర్ఎస్ సర్కారుకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించారు. అందుకే పరిస్థితి ఇంత దారుణంగా దాపురించిందని, మీ సేవా కేంద్రాల సామర్థ్యంపై సరైన అవగాహన, అంచనాలు లేకపోవడం, సాయం పంపిణీలో సరైన పద్ధతి పాటించకపోవడం, అడ్మినిస్ట్రేషన్ ఘోర వైఫల్యానికి నిదర్శనమని మండిపడ్డారు. బుధవారం ఆయన ఒక పత్రిక ప్రకటన విడుదల చేస్తూ …ఓ వైపు మహిళలు, పిల్లలు మీ సేవా కేంద్రాల వద్ద గంటల తరబడి పడిగాపులు పడుతుంటే కేసీఆర్, కేటీఆర్ కనీసం ఆ సమస్యను గుర్తించేందుకు సిద్ధంగా లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. తండ్రీ కొడుకులు ఇద్దరు ఎలక్షన్లలో ఎలా డబ్బులు పంచాలి, ప్రజలను ఎలా మభ్యపెట్టాలి, మళ్లీ గ్రేటర్ పీఠాన్ని ఎలా కైవసం చేసుకోవాలన్న ఆతృతే తప్ప ప్రజల కష్టాలు వీరికి పట్టడం లేదన్నారు.
సాయం పంపిణీలో ఇప్పటికే గులాబీ గద్దలు 200 కోట్లకు పైగా దోచేశాయని ఈ దోపిడీకి గ్రేటర్ ప్రజలే ప్రత్యక్ష సాక్షులని, పీకల్లోతు కష్టాల్లో ఉన్న ప్రజల పట్ల టీఆర్ఎస్ నేతలకు కనీస సానుభూతి లేదని వరద సాయంలో కమీషన్లు దండుకున్న ఈ ముఠాని గజదొంగలు అనక ఇంకేమనాలని అన్నారు. అయ్యా కొడుకుల నిర్వాకం వల్ల నిండు ప్రాణం బలైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. క్యూలైన్లో నిలబడ్డ హకీంపేట మహిళ మున్నవర్ కుప్పకూలి చనిపోయిందని, ఆమె చావుకు సర్కారే బాధ్యత వహించాలని, మీసేవా సెంటర్ల వద్ద తోపులాటలో
అనేకమంది మహిళలకు గాయాలయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ చేసిన పాపం ఊరికే పోదని సాయం మాటున రాజకీయం చేస్తూ పేదోడి ఆత్మగౌరవంతో ఆడుకున్న టీఆర్ఎస్కు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. సాయంలో కమీషన్లు దండుకున్న టీఆర్ఎస్ కు గ్రేటర్ ఎన్నికల్లో దిమ్మతిరిగే షాక్ ఇవ్వాలని వోటర్లకు పిలుపునిచ్చారు. వోట్ల కోసం గల్లీకి వచ్చే టీఆర్ఎస్ లీడర్లను చొక్కాలు పట్టుకుని నిలదీయాలన్నారు. కాంగ్రెస్ గెలిస్తే అన్యాయాన్ని ప్రశ్నిస్తుందని, పేద, మధ్య తరగతికి న్యాయం జరిగే వరకు పోరాడుతుందని, గ్రేటర్ ప్రజలంతా టీఆర్ఎస్ నిర్వాకాన్ని కళ్లారా చూశారని తగిన విధంగా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని దీమా వ్యక్తం చేశారు.