Take a fresh look at your lifestyle.

ప్రశ్నిస్తే దేశ ద్రోహం కేసులా ..? కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆగ్ర‌హం

2019లో కేవలం ఒక్క దేశద్రోహం కేసు మాత్రమే నమోదైందన్న సహాయ మంత్రి కిషన్ రెడ్డి
ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ,న్యూ దిల్లీ .మర్చి 16; కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ స‌ర్కారు విధానాలను, పాలసీలను తప్పుపట్ట‌డం, విమ‌ర్శించ‌డం లేదా ప్రశ్నిచటం చేస్తే వారిపై దేశద్రోహం కేసులు పెట్ట‌డం ఏంట‌ని టీ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కేంద్ర ప్ర‌భుత్వ పెద్ద‌లు అమాయ‌కుల‌పై ఇష్టారీతిన కేసులు పెట్టి వేధిస్తున్నారని రేవంత్ ఆరోపించారు. 2014 నుంచి ఇప్పటి వరకు నమోదైన దేశ ద్రోహం కేసుల వివరాలు కోరుతూ రేవంత్‌రెడ్డి లేవనెత్తిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి ఇచ్చిన సమాధానం అరకొరగా ఉందని రేవంత్‌రెడ్డి త‌ప్పుబ‌ట్టారు. ప్రభుత్వాన్ని ఎవరైనా విమర్శించినా, ప్రశ్నించినా, ప్రభుత్వ బాధ్యత గుర్తు చేయడం దేశ ద్రోహం కిందకు రాదని, కానీ ప్రస్తుతం కేంద్రప్రభుత్వం అలా ప్రశ్నించిన వారిపై 124ఏ కింద దేశద్రోహం కేసులు నమోదు చేస్తోందని రేవంత్‌రెడ్డి మండిప‌డ్డారు. రైతుల ఉద్యమానికి మద్ధతిచ్చారన్న ఒకే కారణంతో బెంగ‌ళూరుకి చెందిన‌ దిశరవిపై దేశ ద్రోహం కేసు నమోదు చేశారని అన్నారు.

ఈ ఏడాది జనవరి 26న రైతుల ర్యాలీకి మద్దతు ఇచ్చారన్న కారంణంతో ర్యాలీ అనంతరం అనేకమందిపై నమోదు చేసిన దేశ ద్రోహం కేసులు ఎత్తివేయాలని రేవంత్‌ డిమాండ్ చేసారు. దేశంలో యువత, రైతులపై దేశ ద్రోహం కేసులు నమోదు చేస్తున్నారని,అటుపై ఆ కేసులపై విచారణకు జరపకుండా నాలుగైదేళ్లు పెండింగ్‌ లో పెడుతున్నారని రేవంత్ ధ్వ‌జ‌మెత్తారు. కేసులు ఉన్నాయన్న కారణంగా ఉద్యోగాలు రాక, పాస్‌ పోర్టు, వీసాలు రాక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని రేవంత్‌ రెడ్డి లోక్‌సభలో ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. అందుచేత‌, ఈ విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం పున‌రాలోచ‌న చేయాలనీ డిమాండ్ చేసారు.

2014 నుంచి దేశద్రోహానికి సంబంధించిన కేసుల వివరాలను ఎన్సీఆర్‌బీ సేకరించడం ప్రారంభించిందని, ప్రస్తుతం కేంద్రప్రభుత్వం వద్ద కేవలం 2019 వరకు గణాంకాలు మాత్రమే ఉన్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి లోక్‌సభలో తెలిపారు. ఎన్సీఆర్‌బీ గణాంకాల ప్రకారం ఢిల్లీలో 2019లో కేవలం ఒక్క దేశద్రోహం కేసు మాత్రమే నమోదైందని వెల్లడించారు. నేర సంబంధిత న్యాయ సంస్కరణల కోసం నేషనల్‌ లా యూనివర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్‌ అధ్యక్షతన ఒక కమిటీని 2020 ఫిబ్రవరి 5వ తేదీన కేంద్రప్రభుత్వం నియమించిందని కిషన్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే సంస్కరణలకు సంబంధించిన సలహాలు, సూచనలు ఇవ్వాలని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాలకు, యూనివర్సిటీలకు, జ్యుడిషియల్‌ అధికారులకు లేఖలు రాసారని కిషన్‌రెడ్డి తెలిపారు.

- Advertisement -

రైతు ఉద్యమంలో ప్రాణాలొదిలిన వారి కుటుంబీకుల‌కి ప‌రిహార‌మివ్వాలి : రేవంత్
ఢిల్లీ రైతు ఉద్యమంలో ప్రాణాలొదిలిన వారి కుటుంబీకుల‌కి ప‌రిహార‌మివ్వాలి అంతేకాదు ప్రాణాలు కోల్పోయిన రైతులను ‘రైతు అమరవీరులు’గా గుర్తించాలి అని డిమాండ్ చేసిన కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన మూడు సాగు చ‌ట్టాల‌పై దేశ రాజధాని సరిహద్దుల్లో జరుగుతున్న రైతు ఉద్యమంలో అమరులైన రైతులను ‘రైతు అమరవీరులు‘గా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వాన్నితెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘ రైతు ఉద్యమంగా చరిత్రలో దేశ రాజధాని సరిహద్దుల్లో జరుగుతున్న ఉద్యమం నిలిచిపోయిందన్నారు. మంగళవారం రైతు ఉద్యమం, రైతు ఆందోళనలు,మరణాల గురించి లోక్‌సభలో రేవంత్‌ ప్రస్తావించారు.

కేంద్ర ప్రభుత్వం బలవంతంగా ఆమోదించిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. జై జవాన్‌ జై కిసాన్‌ అనే నినాదంతో ముందుకు వెళ్లే మన దేశంలో రైతు ఉద్యమంలో రైతులు చనిపోయే పరిస్థితి దాపురించింది అన్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో చలికాలంలో వాతావరణ సవాళ్ళను ఎదుర్కొన్న రైతులు, ఇప్పుడు వేసవిలో మరింత ఇబ్బందులు పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. మూడు వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ 270 మందికి పైగా రైతులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. అలాంటి రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని, వారిని ‘రైతు అమరవీరులు’గా గౌరవించాలని కేంద్ర ప్రభుత్వాన్ని రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

Leave a Reply