Take a fresh look at your lifestyle.

జగ్గారెడ్డి మాట్లాడుతున్నాడా? మాట్లాడిస్తున్నారా?

  • కాంగ్రెస్‌లో ఆధిపత్య పోరు
  • రేవంత్‌ ‌వర్సెస్‌ ‌జగ్గారెడ్డి
  • మరింతగా ముదిరిన రచ్చ…అధిష్టానం మౌనం

(ఎ.సత్యనారాయణరెడ్డి / ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్‌): ‌టిపిసిసి చీఫ్‌ ‌రేవంత్‌రెడ్డి లక్ష్యంగా టిపిసిసి వర్కింగ్‌ ‌ప్రెసిడెంటు, సంగారెడ్డి శాసనసభ్యుడు తూర్పు జయప్రకాష్‌రెడ్డి అలియాస్‌ ‌జగ్గారెడ్డి మధ్య రోజు రోజుకూ ఆగాధం పెరుగుతూనే ఉంది. రచ్చబండ పార్టీలో రచ్చ రచ్చ చేస్తూనే ఉంది. ‘సారీ’అంటూనే… జగ్గారెడ్డి తనదైనశైలిలో రేవంత్‌ను లక్ష్యంగా చేసుకుని ప్రశ్నలు సంధిస్తున్నాడు. మాటల తూటాలు పేలుస్తూన్నాడు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే కాంగ్రెస్‌ ‌పార్టీలో రేవంత్‌రెడ్డికి జగ్గారెడ్డి కొరకురాని కొయ్యగా మారాడు. పక్కలో బల్లెమయ్యాడనీ చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా…టిపిసిసి చీఫ్‌ ‌రేవంత్‌రెడ్డిపై ఏకంగా కాంగ్రెస్‌ అధిష్టానానికి గ్గారెడ్డి లేఖ రాయడం…అది కాస్త మీడియాకు లీక్‌ ‌కావడంతో రేవంత్‌ ‌వర్సెస్‌ ‌జగ్గారెడ్డి అన్నట్లుగా పరిస్థితులు మారి చలికాలంలోనూ కాంగ్రెస్‌ ‌పార్టీ రాజకీయాలను ఒక్కసారిగా హీటెక్కించాయి. టిపిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ను లక్ష్యంగా చేసుకుని జగ్గారెడ్డి సంధించిన ప్రశ్నలు, రాస్తున్న లేఖలను చూస్తుంటే జగ్గారెడ్డే కావాలని మాట్లాడుతున్నాడా? ఆయనతో ఎవరైనా మాట్లాడిస్తున్నారా?అనే అనుమానం అందరిలో కలుగుతుంది. పార్టీ శ్రేణులందరూ దీని గురించి మాట్లాడుకుంటున్నారు. దీనికి కారణం లేకపోలేదు.

టిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంటు, సిఎం కేసీఆర్‌ ‌తనయుడు, రాష్ట్ర మునిసిపల్‌ ‌శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్‌) ఇటీవల సంగారెడ్డి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అదీ…కాంగ్రెస్‌ ‌పార్టీకి చెందిన వర్కింగ్‌ ‌ప్రెసిడెంటు, ఎమ్మెల్యే జగ్గారెడ్డితో కలిసి. ఈ పర్యటనలో మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆప్యాయత పలకరింపులు, చెవుల్లో గుసగసలు మాట్లాడుకోవడం చూసిన టిఆర్‌ఎస్‌ ‌పార్టీ నేతలు సైతం ఒకింత ఆశ్చర్యానికి గురి కావల్సి వచ్చింది. కేటీఆర్‌ ‌సంగారెడ్డి పర్యటన తర్వాత జగ్గారెడ్డి టిపిసిసి చీఫ్‌ ‌రేవంత్‌రెడ్డిపై తన దూకుడును మరింత పెంచాడు. ఈసారి ఏకంగా రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా పార్టీ అధిష్టానానికి లిఖితపూర్వకంగా లేఖ రాయడంతో అందరిలోనూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీలో సైతం ఇప్పుడు ఇదే హాట్‌ ‌టాపిక్‌. ‌రాజకీయాల్లో ఎక్కడైనా నాయకులు తమ ప్రత్యర్ధులపై మాటలతో విరుచుకుపడుతుంటారు. విమర్శలు చేస్తారు. రాజకీయంగా ప్రత్యర్ధులకు చెక్‌ ‌పెట్టాలనీ చూస్తారు. కానీ, తెలంగాణ కాంగ్రెస్‌ ‌పార్టీలో వెరైటీగా టిపిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌టార్గెట్‌గా టిపిసిసి వర్కింగ్‌ ‌ప్రెసిడెంటు జగ్గారెడ్డి విమర్శలు చేస్తుంటాడు. ప్రత్యర్ధులకు అవకాశం ఇవ్వకుండా సొంత పార్టీ నేతలే ఒకరినొకరు చెక్‌ ‌పెట్టుకోవడానికి చూస్తూ ఉంటారు. మొదట నుంచి కాంగ్రెస్‌ ‌పార్టీలో ఇదే రాజకీయం నడుస్తోంది.

ఇప్పుడు కూడా కాంగ్రెస్‌ ‌పార్టీలో అదే పరిస్థితి ఉంది. రేవంత్‌ ‌రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయిన దగ్గర నుంచి రచ్చ నడుస్తూనే ఉంది. రేవంత్‌కు వ్యతిరేకంగా పలువురు సీనియర్లు విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇక వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌జగ్గారెడ్డి అయితే ఎప్పటికప్పుడు ఏదొక రచ్చ చేస్తూనే ఉన్నారు. ఆ మధ్య హుజూరాబాద్‌ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ ‌డిపాజిట్‌ ‌కోల్పోవడానికి కారణం రేవంత్‌ అన్నట్లు మాట్లాడారు. మళీష్ట్ర• తర్వాత క్షమాపణ కూడా చెప్పారు. ఏ విషయం కూడా బహిరంగంగా మాట్లాడనని అన్నారు. కానీ జగ్గారెడ్డి వర్షన్‌ ‌మారలేదు. ఇటీవల రేవంత్‌ ‌రెడ్డి సిద్ధిపేట జిల్లాలోని కేసీఆర్‌ ‌ఫామ్‌హౌస్‌ ఉన్న ఎర్రవెల్లిలో రచ్చబండ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఆ కార్యక్రమానికి తనని పిలవలేదని చెప్పి జగ్గారెడ్డి టిపిసిసి చీఫ్‌ ‌రేవంత్‌పై ఫిర్యాదు చేస్తూ సోనియా గాంధీకి లేఖ రాశారు. రేవంత్‌ని పిసిసి నుంచి తప్పించాలని లేదా ఆయన తీరుని మార్చాలని కోరారు. దీనిపై పిసిసి కమిటీ సీరియస్‌ అయింది..ఇబ్బందులు ఉంటే చెప్పొచ్చు అని, కానీ రాసిన లేఖ ఎలా బహిర్గతమైందని ఫైర్‌ అయింది. జగ్గారెడ్డి క్రమశిక్షణ సంఘం ముందుకు రావాల్సిందే అని చిన్నారెడ్డి మాట్లాడారు. వరంగల్‌ ‌లోక్‌సభ నియోజకవర్గం ఇంచార్జినైన తనకు, తాజాగా భూపాలపల్లి రచ్చబండ కార్యక్రమానికి రేవంత్‌రెడ్డి వెళుతున్నట్లుగా సమాచారం ఇవ్వలేదని, ఆ వార్త తాను మీడియాలోనే చూశానని, ఇది క్రమశిక్షణ చర్యల కిందకు రాదా? క్రమశిక్షణ పాటించని టిపిసిసి అధ్యక్షుడిని క్రమశిక్షణలోకి తీసుకురావాలని చిన్నారెడ్డికి తెలియదా? అంటూ ఎదురు ప్రశ్నించారు.

దీంతో కమిటీ ముందుకు మొదట రేవంత్‌రెడ్డిని పిలిచి.. ఆ తర్వాతే తనను పిలవాలని, అప్పుడు తాను తప్పకుండా హాజరవుతానన్నారు. ఇలా రేవంత్‌పై జగ్గారెడ్డి ఫైట్‌ ‌చేస్తూనే ఉన్నారు. ఈ రచ్చ వల్ల కాంగ్రెస్‌కు డ్యామేజ్‌ ‌తప్ప..పావలా ఉపయోగం లేదనీ పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే, రాష్ట్ర కాంగ్రెస్‌లో అసమ్మతి సెగలు కొనసాగుతున్నాయి. టిపిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డిపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలను పార్టీ హైకమాండ్‌ ‌సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలో క్రమశిక్షణా కమిటీ ఛైర్మన్‌ ‌హోదాలో ఉన్న మాజీమం్రతి చిన్నారెడ్డి జగ్గారెడ్డిని క్రమశిక్షణా కమిటీ ముందుకు పిలుస్తామన్నారు. దీనిని జగ్గారెడ్డి తప్పుబడుతున్నాడు. మీడియా ద్వారా మాట్లాడిన చిన్నారెడ్డికి మీడియా ద్వారానే సమాధానం ఇవ్వాల్సి వస్తుందనీ తన వ్యాఖ్యలను సమర్ధించుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తుంది. జగ్గారెడ్డి తన లేఖలో అనేక అంశాలను వెల్లడించారు. పిసిసి అధ్యక్షుడుగా రేవంత్‌ ‌రెడ్డి.. పార్టీలో అందరినీ కలుపుకొని పోవడం లేదని ఆరోపించారు. ఆయన కేవలం తన సొంత ఇమేజ్‌ ‌కోసం పాకులాడుతున్నారని పేర్కొన్నారు. రచ్చబండ అంశం కూడా పార్టీలో చర్చించకుండా తన నివాసంలో ప్రెస్‌ ‌మీట్‌ ‌పెట్టి ప్రకటించారని ఆరోపించారు. ఇవన్నీ చూస్తుంటే కాంగ్రెస్‌ ‌పార్టీలో ఆధిపత్య పోరు, వర్గపోరు నడుస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఇంత జరుగుతున్నా కూడా పార్టీ అధిష్టానం మాత్రం మౌనంగా ఉండటం గమనార్హం. అయితే, కాంగ్రెస్‌ ‌పార్టీ శ్రేణులు మాత్రం రేవంత్‌ ‌వర్సెస్‌ ‌జగ్గారెడ్డి మధ్య సాగుతున్న మాటల వార్‌, ‌లేఖలు చివరకు ఎటు దారితీస్తాయోననీ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పార్టీ అధిష్టానం కలుగజేసుకుని దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి. అధిష్టానం ఆలోచన ఏమిటో మరి…!?

Leave a Reply