Take a fresh look at your lifestyle.

‘‘‌తిరోగమనంలో పోరాటాల ఫలితాలు’’

‘‘పోరాడితే పోయేదేమీలేదు బానిస సంకెళ్లు తప్ప ‘‘ అని శీశ్రీ అన్నట్లు….. ఉపాధ్యాయ సంఘం పెట్టుకునే హక్కు నుండి అర్ధరూపాయి ఇంక్రిమెంట్‌ ‌పొందడానికి పోరాటం చేసిన చరిత్ర ఉపాధ్యాయ సంఘాలకు ,ఉపాధ్యాయులకు ఉంది. సమాజ ప్రగతి ఆకాంక్షిస్తూ కృషి చేస్తున్న ఉపాధ్యాయులను, సంఘాలను తప్పుబడుతూ వ్యక్తిగత ప్రతిష్ట గా తీసుకొని ఉపాధ్యాయులు, ఉద్యోగులు వేరు అని చెప్పి విభజన గీతగీయ ప్రయత్నించడం సహించరాని విషయం. , ఉపాధ్యాయులకు పని ఒత్తిడి లేదని వారికి వేతన పెంపు, ఉద్యోగ విరమణ వయసు పెంపు అవసరం లేదని ప్రభుత్వం భావించడం విడ్డూరం. వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాల్సిన అవసరం లేదని, స్థానిక సంస్థల ఉద్యోగులుగా గుర్తించాలనే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తున్నది.

1969 కి ముందు తెలంగాణలో ఉపాధ్యాయులంతా ప్రభుత్వ పరిధిలోనే పనిచేసేవారు. స్థానిక సంస్థలకు ఆర్థిక వనరుల లేమితో ఉపాధ్యాయులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. సుదీర్ఘ పోరాట ఫలితంగా 1998లో ఉపాధ్యాయులను ప్రభుత్వ పరిధిలోకి తీసుకువచ్చారు. న్యాయమైన కోరికలను సాధించుకోవడానికి నిరసనలు, ధర్నాలు హర్తాళ్లు చేయడం సహజం. అంతమాత్రాన ఉపాధ్యాయు లను అవమానపరిచే విధంగా వారికి న్యాయంగా వచ్చే రాయితీలను అడ్డుకుంటామనడం భావ్యమా? ఉపాధ్యాయ వృత్తిలో వారిని ప్రపంచ దేశాలు గౌరవిస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో అగౌరపరచడం సరైంది కాదు. ఉద్యమాలు లేకుండానే తెలంగాణ సాధన సాధ్యమయ్యేదా ? విజ్ఞులకి తెలియనిది కాదు. ఉపాధ్యాయులంతా తెలంగాణ ఉద్యమంలో వీరోచితంగా పాల్గొన్నారు.

తెలంగాణ ఏర్పాటు అనంతరం ఉద్యోగ ఉపాధ్యాయులకు తెలంగాణ ఇంక్రిమెంటు తోపాటు గత పిఆర్సి లో 43% ఫిట్మెంట్‌ ఇచ్చి అన్నింటికీ ఇదే మందు అన్నారు. గత పిఆర్సి మాదిరి ఫిట్మెంట్‌ ‌కావాలని ఉపాధ్యాయులు, ఉద్యోగులు కోరడం సహజం. పిఆర్సి అమలకు ముప్పై రెండు నెలలుగా కంట్లో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. ఈ విషయంలో అనేక మార్లు విజ్ఞాపన పత్రాలు సమర్పించినా ఫలితం లేక విసిగివేసారి ఉపాధ్యాయులు గొంతెత్తి రోడ్‌ ఎక్కారు. ఆరున్నర సంవత్సరాల్లో ఒకే ఒక్కసారి ఉపాధ్యాయ సంఘాల నాయకులతో మే 18, 2018 న సమీక్ష జరిపి సమస్యలపై రాతపూర్వక హామీలు ఇచ్చి నా.. నేటికీ ఒక్క సమస్య కూడా పరిష్కరం కాలేదు. వేలాది మంది ఉద్యోగులు , ఉపాధ్యాయులు పదోన్నతులు లేకుండా ఉద్యోగ విరమణ చేయడం బాధాకరం.

భద్రతతో కూడిన పాత పెన్షన్‌ ‌విధానం అమలు చేసే అవకాశం ప్రక్కన పెట్టి నూతన పెన్షన్‌ ‌పథకం అమలు చేస్తామని కేంద్రానికి లేఖ ఇవ్వడం ఉద్యోగులను విస్మయానికి గురిచేసింది. ఎంత సహనం వహించినా ప్రభుత్వం స్పందించకపోగా ఉద్యమాలను అణిచివేసే ప్రయత్నం చేయడం విచారకరం. కరోనా నేపథ్యంలో లాక్‌ ‌డౌన్‌ ‌ప్రకటించడంతో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో, ఉద్యోగ ఉపాధ్యాయుల వేతనాలు కోత పెట్టడం తో ఆర్థిక ఇబ్బందులతో పలువురు ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రభుత్వ ఆదాయం క్రమక్రమంగా పెరుగుతుండడంతో వేతన సవరణ పెంపుపై ఒత్తిడి పెంచిన ఫలితంగా ప్రభుత్వం త్రిసభ్య కమిటీని నియమించి 7.5 శాతం ఫిట్మెంట్‌ ‌ప్రకటించడంతో ఆశలు పెంచుకున్న ఉపాధ్యాయ ఉద్యోగుల ఆశ లు ఆవిరైపోయాయి!

ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజల కుటుంబ పెద్దలా వ్యవహరిస్తూ ఆదుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రజలందరినీ ఆదుకోని సంతృప్తి పరచవలసిన అవసరం ఉంటుంది. ఉద్యోగులు ఉపాధ్యాయులు తమ కోరికలు సాధించుకోవడానికి బిగ్గరగా మాట్లాడినా, పాలక పెద్దలు వ్యక్తిగత ప్రతిష్టకు పోకుండా వ్యవస్థా పరంగా చూడాలి. కానీ ప్రస్తుతం ఉపాధ్యాయులు ఎక్కువ నిరసన కార్యక్రమాలు చేస్తున్నారని, కక్ష సాధింపు చర్యలకు ప్రయత్నించడం విచారకరం.

ప్రపంచ దేశాలలో, మన దేశంలోని వివిధ రాష్ట్రాలలో పని దినాలు దాదాపు తెలంగాణ మాదిరే ఉన్నాయి. ఒక్క తెలంగాణ ఉపాధ్యాయులు పని భారం లేకుండా, ఒత్తిడి లేకుండా ఉన్నారానడం హాస్యాస్పదం.. కాలానుగుణ్యంగా, కొన్ని అదనపు ప్రయోజనాలను కల్పించి ఉద్యోగుల సంక్షేమం నిర్ణయాలు తీసుకోవాల్సిన సందర్భంలలో, ఆమోదయోగ్యం కాని విధానాలు కొనసాగించే ప్రయత్నం చేయబూనడం ముమ్మాటికి తిరోగమనమే. సుదీల్ఘ శ్రమ తరువాత ఉద్యోగం పొంది … 2 సంవత్సరాలు అప్రెంటిస్‌ ‌పేరుతో 398 రూపాయల వేతనం, 1200 రూపాయల వేతనాలకు వెట్టి చాకిరీ చేసి ఉద్యోగం వెలగబెడుతున్నారు. తల్లిదండ్రులకు, కన్నబిడ్డలకు ఓ మోస్తారుగా కనీస అవసరాలు తీర్చే లేని స్థితిలో బ్యాంకు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.

పెద్దలు విజ్ఞతతో , దొడ్డ మనసుతో ఆలోచించి ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హక్కులను, ప్రయోజనాలను పొందడానికి ఐక్యంగా నడుం బిగించాల్సిన తరుణంలో యూనియన్లు పరస్పరం విమర్శలు గుప్పించు కుంటూ ఉంటే సమస్యలు పరిష్కరంకాకపోగా, ప్రస్తుత ప్రయోజనాలు ఒక్కొక్కటి కనుమరుగయ్యే ప్రమాదం ఉన్నదని ఉద్యోగులు ఉపాధ్యాయ నాయకులు గమనించాలి.

Leave a Reply