జూన్లో కేవలం 5వేల ప్రత్యేక దర్శనాలు
అలిపిరి నుంచి తిరుమలకు వెళ్ళే నడకదారి నిర్మాణం పనులు వేగంగా పూర్తి చేస్తామని అదనపు ఈవో ఎవి ధర్మారెడ్డి చెప్పారు. తిరుమల అన్నమయ్య భవనంలో బుధవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు.కొరోనా తీవ్రత దృష్ట్యా జూన్ నెలలో రోజుకు 5 వేల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు మాత్రమే ఇచ్చామని ధర్మారెడ్డి చెప్పారు. రాత్రి 8 గంటలకు దర్శనం పూర్తి అవుతున్నందున 9 గంటలకు స్వామివారి ఏకాంత సేవ నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. కొరోనా తీవ్రతను అంచనా వేశాక టీటీడీ చైర్మన్, ఈవో తో సమీక్షించి టికెట్ల సంఖ్య పెంచడమో, తగ్గించడమో నిర్ణయం తీసుకుంటామన్నారు. అలిపిరి నుంచి తిరుమలకు వచ్చే నడక దారి పైకప్పు నిర్మాణం పనులు వేగంగా చేయడం కోసం జూలై 30 వరకు భక్తులను అనుమతించడం లేదన్నారు.
కొరోనా వల్ల నడక దారిలో భక్తులు చాలా తక్కువ సంఖ్యలో వస్తున్నారన్నారు. పైకప్పు పనులు వేగంగా పూర్తి చేయడానికి ఇదే సరైన సమయమనే అభిప్రాయంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. తిరుమలకు నడచి రావాలనుకునే భక్తులు శ్రీవారి మెట్టు మార్గంలో రావాలని ఆయన కోరారు. ఇందుకోసం తిరుపతి రైల్వే స్టేషన్, అలిపిరి నుంచి శ్రీవారి మెట్టు వరకు ఉచిత బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ మార్గంలో భక్తులను అనుమతిస్తామన్నారు. ఈ మార్గంలో అవసరమైన భద్రత ఏర్పాట్లు చేశామన్నారు.