గణేష్ నవరాత్రి ఉత్సవాలపై ప్రభుత్వ నిర్బంధానికి వ్యతిరేకంగా నిరసన
రాష్ట్రంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలపై ప్రభుత్వ ఆంక్షలు, నిర్బంధానికి వ్యతిరేకంగా విశ్వ హిందూ పరిషత్ ఇచ్చిన పిలుపు మేరకు పలు హిందూ సంఘాలు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. వీహెచ్‌పి పిలుపుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం సంపూర్ణ మద్దతు తెలపడంతో ఆ పార్టీ కార్యకర్తలు కూడా నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. ఈ మేరకు వీహెచ్‌పి, భజరంగ్‌దళ్, బీజేపీ కార్యకర్తలు జిల్లా, మండల కేంద్రాలు, గ్రామాల్లోని ప్రధాన కూడళ్లు, వినాయక మంటపాలు తొలగించిన స్థలాల్లో నల్ల జెండాలతో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.
హిందూ పండుగలపైనే ఆంక్షలు…ప్రభుత్వ వినాశనం మొదలు అంటూ రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయా సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలపై నిర్బంధంతోనే కేసీఆర్ పాలన పతనం మొదలైందన్నారు. రంజాన్, బక్రీద్ సమయంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన స్వేచ్చను, బోనాలు, వినాయక చవితి సందర్భంగా విధించి ఆంక్షలను ప్రజలు గమనించారని తెలిపారు. ఒవైసీ సోదరుల మెప్పు, ఓ వర్గం ప్రజల సంతుష్టీకరణ కోసమే కేసీఆర్ నవరాత్రి ఉత్సవాలపై నిర్బంధం విధిస్తున్నారని మండిపడ్డారు. పోలీసు పహారా, నిఘా అధికారుల పర్యవేక్షణలో ఆంక్షల మధ్య హిందువుల ఉత్సవాలు జరుపుకునే భయంకర పరిస్థితిని కల్పించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.