జీఎస్టీ పరిహారం చెల్లించే బాధ్యత.. కేంద్రానిదే
సెస్ తగ్గినప్పుడు రాష్ట్రాల అప్పులపై ఆంక్షలు సరికాదు
కేంద్రానికి అత్యధిక సెస్ చెల్లిస్తున్న రాష్ట్రాలలో తెలంగాణ
జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్రావు
జీఎస్టీలో చేరడం వల్ల రాష్ట్రాల ఆదాయానికి ఎలాంటి నష్టం వాటిల్లదని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందనీ, ఆమేరకు రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం చెల్లించే బాధ్యత పూర్తిగా కేంద్రానిదేనని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీష్రావు స్పష్టం చేశారు. రాష్ట్రాలు జీఎస్టీలో చేరడం వల్ల దాదాపు 60 నుంచి 70 శాతం ఆదాయాన్ని కోల్పోయాయనీ, అందువల్ల కేంద్రం జీఎస్టీ పరిహారాన్ని చెల్లించాల్సిందేనని పేర్కొన్నారు. గురువారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు బీఆర్కే భవన్ భవన్ నుంచి పాల్గొన్నారు. గతంలో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశాల్లో సైతం ఆదాయంలో రాష్ట్రాలకు లోటు ఏర్పడితే కేంద్ర ప్రభుత్వం ఏదో రూపంలో పరిహారం చెల్లిస్తుందని చెప్పారనీ, కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి లేదా అప్పు తీసుకుని అయినా చెల్లిస్తామని హామీ ఇచ్చినందున ఇప్పుడు దీనిపై చర్చ అనవసరమని స్పష్టం చేశారు. జీఎస్టీ పరిహారంలో సెస్ మిగిలితే కేంద్రం కన్సాలిడేటెట్ ఫండ్లో జమ చేసి వాడుకుంటోందనీ, సెస్ తగ్గినప్పుడు రాష్ట్రాలు అప్పులు తీసుకోవాలనడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్రమే జీఎస్టీ పరిహారం చెల్లించాలనీ, రాష్ట్రాలు అప్పులు తీసుకుంటే రాష్ట్రానికో వడ్డీ రేటు ఉంటుందనీ, ఎంత కాల పరిమితితో తీసుకోవాలి, ఎన్ని సంవత్సరాలు చెల్లించాలి, ఎఫ్ఆర్బిఎం పరిమితులు వంటి సమస్యలు తలెత్తుతాయని చెప్పారు.
దేశంలో కోవిడ్ ఎంత కాలం ఉంటుందో తెలియని పరిస్థితి నెలకొందనీ, రెవెన్యూ లోటు ఎంత ఉంటుండో అర్ధం కాని పరిస్థితి ఉందనీ, ఈ స్థితిలో ఆర్థిక పరిస్థితులు ఎప్పుడు చక్కబడతాయో తెలియని అయోమయంలో అందరూ ఉన్నారనీ, కాబట్టి కేంద్రమే బాధ్యత తీసుకుని గతంలో హామీ ఇచ్చిన విధంగా రెండు నెలలకోసారి జీఎస్టీ పరిహారాన్ని రాష్ట్రాలకు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రానికి ఎక్కువ సెస్ చెల్లిస్తున్న ఐదు రాష్ట్రాలలో తెలంగాణ ఒకటనీ, అలాగే, తక్కువ సెస్ తీసుకుంటున్న రాష్ట్రం కూడా తెలంగాణయేననీ, ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో రాష్ట్రం గట్టెక్కాలంటే జీఎస్టీ పరిహారం రూ.5420 కోట్లు, ఐజీఎస్టీ రూ. 2700 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని హరీష్ రావు జీఎస్టీ సమావేశంలో కోరారు. తెలంగాణ వంటి అభివృద్ధి చెందుతున్న రాష్ట్రానికి ఇలా కోవిడ్ అనీ, జీఎస్టీ అమలు వల్ల వచ్చిన నష్టమని చెబితే ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతుందనీ, జీఎస్టీ అమలు చేసిన మొదటి సంవత్సరంలో తెలంగాణ కేవలం రూ. 169 కోట్లు మాత్రమే పరిహారంగా తీసుకుందని గుర్తు చేశారు. రెండో ఏడాది పరిహారం సున్నా, మూడో ఏడాది స్వల్ప మొత్తమే పరిహారంగా దక్కిందనీ, సెస్ వచ్చే ఈ ఏడాది కోవిడ్ అనీ, జీఎస్టీ అమలు వల్ల నష్టమని విభజిస్తే తీవ్రంగా నష్టపోతామనీ, అందువల్ల రాష్ట్రానికి రావాల్సిన సెస్ మొత్తం చెల్లించాలనీ ఈ సందర్భంగా జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో హరీష్ రావు గట్టిగా విజ్ఞప్తి చేశారు. కాగా, అన్ని రాష్ట్రాల అభిప్రాయం తెలుసుకున్న జీఎస్టీ కౌన్సిల్ కేంద్ర ప్రభుత్వమే రుణం తీసుకుని రాష్ట్రాలకు ఇవ్వాలనీ, ఈ ప్రతిపాదనలో కేవలం జీఎస్టీ అమలులో ఏర్పడిన రెవెన్యూ లోటు రూ. లక్షా 65 వేలు రాష్ట్రాలకు ఇవ్వడం జరుగుతందని ప్రతిపాదించింది. అలాగే, జీఎస్టీ, కోవిడ్ కారణాల వల్ల ఏర్పడిన రెవెన్యూ లోటు రూ. 3 లక్షల కోట్లను రుణంగా తీసుకుని రాష్ట్రాలకు చెల్లించడం జరుగుతుందనీ, ఈ రుణం రాష్ట్రాల పేరు మీద జీఎస్టీ కౌన్సిల్ తీసుకుని వడ్డీతో సహా రుణాన్ని చెల్లించడం జరుగుతుందన్నారు. ఈ రెండు ప్రతిపాదనలపై పని దినాలలో రాష్ట్రాలు తమ అభిప్రాయాలను వెల్లడించాలని జీఎస్టీ కౌన్సిల్ చైర్పర్సన్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు.