స్థానిక చట్టాలకు లోబడి ఉండేందుకు తమ సంస్థ కట్టుబడి ఉందని గూగుల్ సిఇఒ సుందర్ పిచాయ్ తెలిపారు. సోషల్ మీడియా నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం బుధవారం నుంచి ఐటి నిబంధనలను అమల్లోకి తీసుకువచ్చిన సంగతి విదితమే. ఈ విషయంపై వాట్సప్, కేంద్రానికి మధ్య వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో గూగుల్ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చినట్లు తెలుస్తోంది. స్థానిక చట్టాలకు తమ కంపెనీ కట్టుబడి ఉంటుందని, వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో వేగవంతం అయ్యేందుకు రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్ చేస్తోన్న ప్రభుత్వాల నిర్మాణాత్మక చర్యలకు అనుగుణంగా తాము సేవలు అందించనున్నట్లు సుందర్ తెలిపారు. తాము పనిచేస్తోన్న ప్రతి దేశంలో స్థానిక చట్టాలకు ఎప్పుడూ గౌరవిస్తామని, నిర్మాణాత్మకంగా పనిచేస్తామని అన్నారు. దీని నిమిత్తం ఏర్పడిన స్థానిక టీమ్స్ అదే పనిలో నిమగమై ఉన్నాయని తెలిపారు. తమ వద్ద పారదర్శకతతో కూడిన నివేదికలు ఉన్నాయన్నారు. ఫ్రీ, ఓపెన్ ఇంటర్నెట్ వ్యవస్థీకఅతమైందని, భారత్‌లో ఆ సాంప్రదాయం ముందు నుంచే ఉందన్నారు.
రాజ్యాంగ విధానాలను తమ కంపెనీ గౌరవిస్తుందని, అవసరమైన చోట వెనక్కి తగ్గినట్లు కూడా ఆయన తెలిపారు. టెక్నాలజీ సమాజాన్ని మార్చివేసిందని, విస్తృత మార్గాల్లో నడుస్తోందని, ప్రపంచ రూపురేఖలు మారిపోయేంతగా అభివృద్ధి చెందిందని అన్నారు. సాంకేతిక ఇంత అభివృద్ది చెందుతుండటం వల్ల నియంత్రణ ఫ్రేమ్ వర్క్ ఉండాలని భావించడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. యూరోప్‌లో కాపీరైట్ ఆదేశాలు ఉన్నాయని, భారత్‌లో సమాచార నియంత్రణ ఉందని, ఇలా వివిధ దేశాల్లో ఉన్న సమస్యలను పరిగణించి తాము ముందుకు వెళ్తున్నట్లు సుందర్ పిచాయ్ తెలిపారు. ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్‌స్టా, గూగుల్ లాంటి సోషల్ వి•డియా కంపెనీల వినియోగం భారత్‌లో విపరీతంగా పెరుగుతుండటంతో వాటిలో వస్తున్న కంటెంట్‌కు అవే జవాబుదారీ తనం వహించేలా కేంద్రం ఈ నూతన ఐటి నిబంధనలను తీసుకువచ్చింది.