- తెలుగు ప్రజల మధ్య కలహాలు వద్దు..
- మూడో పక్షం జోక్యం అనివార్యం
- సుప్రీమ్ కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సూచన
- ప్రభుత్వంతో మాట్లాడి చెబుతామన్న ఇరు రాష్ట్రాల అడ్వకేట్లు
మధ్యవర్తిత్వం ద్వారా జల వివాదాన్ని పరిష్కరించుకోవాలని సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి రెండు తెలుగు రాష్ట్రాలకు సూచించారు. ఇందుకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సిద్ధపడినట్లైతే సమాఖ్య స్పూర్తికి, రాజ్యంగ సూత్రాలకు అనుగుణంగా నీటి వివాదాల పరిష్కారానికి సహాయ సహకారాలు అందిస్తామని సిజేఐ ఎన్వీ రమణ అన్నారు. ఇరు రాష్ట్రాలకి మధ్యవర్తిత్వం ఆమోదయోగ్యం అయితేనే ఈ కేసును తాను చేపడుతానని స్పష్టం చేశారు. ఇందుకు ఇరు రాష్ట్రాలు ఒప్పుకోకోకుండా కేంద్ర ప్రభుత్వంతో పాటుగా ఇతరల జోక్యంతో న్యాయపరంగా దీన్ని పరిష్కరించుకోవాలనుకుంటే కేసు విచారణను మరోక ధర్మాసనానికి బదిలీ చేస్తానన్నారు. ఎగువ రాష్ట్రంగా ఉన్న తెలంగాణ తమ జీవనాధారంపై దెబ్బ కొడుతుందని, అక్రమంగా, ఏకపక్షంగా కృష్ణా జలాలను విడుదల చేసి విలువైన లక్షల క్యూసెక్కుల నీరు సముద్రం పాలు చేసేలా వ్యవహరించిందని ఆరోపిస్తూ, ఏపి సర్కార్ దాఖలు సుప్రీమ్ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
ఈ పిటిషన్‌పై సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని బెంచ్ విచారణ చేపట్టింది. విచారణ ప్రారంభం కాగానే తాను న్యాయపరమైన అంశాల విచారణలోకి వెళ్లదలచుకోలేదని సిజెఐ స్పష్టం చేశారు. తాను రెండు రాష్ట్రాలకు చెందిన వాడినని పేర్కొంటూ…తెలుగు రాష్ట్రాలు మధ్యవర్తిత్వం ద్వారా జల వివాదం పరిష్కారించుకోవాలని సూచించారు. సీజేఐ ఎన్వీ రమణ చేసిన సూచనపై ఏపీ తరపున సీనియర్ అడ్వకేట్ దుష్యంత్ దవే స్పందిస్తూ…ఇది ఎంతో న్యాయమైన సూచన అని అన్నారు. రాజకీయ ప్రాధాన్యత ఉన్న కేసు అయినందున ఏపి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వారి అభిప్రాయాన్ని తెలుసుకుంటానని బెంచ్‌కు విన్నపించారు. అయితే, కేంద్ర ప్రభుత్వం కృష్ణా జలాల వివాదంపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిందనందున ఏపి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ అనవసరమని తెలంగాణ తరపు న్యాయవాది వైద్యనాథన్ ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. అంతే కాకుండా ప్రస్తుతం కృష్ణా జలాలు అపరిమితంగా ఉన్నాయని అన్నారు.
ఈ ఏడాది అక్టోబర్ నుంచి గెజిట్ అమలులోకి వొస్తుందని న్యాయవాది దుష్యంత్ దవే విన్నపించారు. అందువల్ల ఈ మూడు, నాలుగు నెలల పాటు తమకు అన్యాయం జరగకుండా, వెంటనే గెజిట్ అమలులోకి తీసుకురావాలని బెంచ్‌ను కోరారు. దీంతో జోక్యం చేసుకున్న సిజెఐ ఎన్వీ రమణ నీటి ఎద్దడి వొచ్చినప్పుడే సమస్యలు వొస్తాయని, తాను ఈ విషయంలో చాలా సార్లు వాదించానని గుర్తు చేశారు. ఈశాన్య రాష్ట్రాలలో జరుగుతున్న ఘర్షణలను ఈ సందర్భంగా దుష్యంత్ దవే ప్రస్తావనకు తేగా… తెలుగు రాష్ట్రాల మధ్య కలలో కూడా అలాంటి ఆలోచనలు రానీయవద్దని సిజేఐ అన్నారు. తెలుగు వారంతా సోదరులని చెప్పారు. తెలుగు ప్రజలు ఒకరి అభివృద్ధికి మరొకరు సహకరించుకోవాలే తప్ప కలలో కూడా కలహలు పెట్టుకోకూడదని అన్నారు. ఇరు రాష్ట్రాలకు చెందిన న్యాయవాదులు తమ తమ ప్రభుత్వాలను మధ్యవర్తిత్వానికి వొప్పిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. అవాంఛితమైన మూడోపక్షం జోక్యానికి తావు ఇవ్వకండని హితవు పలికారు. మధ్యవర్తిత్వం ప్రభుత్వంతో మాట్లాడి చెపుతామని ఇరు రాష్ట్రాల న్యాయవాదులు ధర్మాసనానికి తెలిపారు. దీంతో కేసు విచారణను సిజేఐ బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.