Take a fresh look at your lifestyle.

‘‘‌పరిశోధనా పత్ర కవితా ఖండిక

స్థలం: అంగారక గ్రహం
తేదీ: జనవరి 1వ తేదీ, 2520

ఇదొక అద్భుత విజయం!
ఎన్నాళ్ల నుంచో మనందరం
ఎదురు చూస్తున్న పరిశోధన!!

ఇది ఐదు వందల సంవత్సరాల
గ్రహాంతర మానవుల చరిత్ర!

అనగనగా ఒక భూగోళ గ్రహం
అందులో ప్రాణ వాయువుని ప్రసాదించే పచ్చని చెట్లు..
తివాచీలా పరిచిన పచ్చని
కనుదోయ పచ్చిక బయళ్లు..
వివిధ రకాల అమృత రుచుల
రస ఫలాలను చేతికి అందించే
చెట్లమ్మల అనురాగ దీవెనలు!

పోషకాహార పంట సిరులతో
మానవుల ఆకలి తీర్చే
పంట పొలాల ఆదరణ
ప్రాంగణాల సముదాయాలు!

జీవుల దాహార్తిని తీర్చడానికి
ఉరుకులు పరుగులు పెట్టే
జీవ నదీనదాల సోయగాల పరవళ్ళు!

తమ కుహూ నాదాల స్వరార్చనతో
భూపాలరాగ స్వర జతులతో
నిత్యం ప్రకృతి మాతను మేలుకొలుపే
పక్షుల ఆనంద కేళీ విన్యాస
సుప్రభాత సూర్యోదయాలు!

ఈ అమూల్య భోగాలను
అనుభవించడం కోసం
భగవంతునిచే సృజింపబడిన
మానవ చైతన్య స్వరూపాలు!

భగవత్‌ ‌ప్రసాదిత చతుర్వేద వేద వ్మాయం
రుషి ప్రోక్త మంత్ర సంహిత బీజాక్షర జ్ఞాన సంపద
ఎందరెందరో ఘన చరితుల
మానవ కళ్యాణ సంరంభ
సమిధికోత్సవాలతో
అలలారిన పుడమి కథనం
చర్విత చరణ కాంతోదయం!

క్రమేణా నానాటికి విస్తరించిన
జనాభా పెరుగుదల
మానవ పురోగతికి పెను శాపమై పరిణమించింది!
సుఖమయ జీవనం కోసం
మొదలైన మానవ ప్రయత్నాలు
ఎన్నో అఖండ విజయాలు
చేకూర్చి స్వాగతించాయి!
విజయ పరంపర గర్వంతో
పరుగులెత్తిన మానవుని
దురాశ
కాలుష్య కోరలకు చిక్కి
హాహాకారాలు చేసింది!

కలుషితమైన గాలి, నీరు
ఆయుష్షును హరించాయి!
పచ్చని పంట పొలాలు
అధిక రాబడి కోసం
మానవులు పన్నిన ఉచ్చులో
గిలగిలాడాయి!
కార్లు, కర్మాగారాలు, ఎ.సీలు
విసర్జించే విషతుల్య ఉద్గార
చక్రబంధంలో మానవ ఆనంద జీవితాలు మసిబారాయి!

క్షణం..క్షణం పెరిగిన అధిక భూ ఉష్ణోగ్రతలు
ప్రకృతి సమతౌల్యతకు గొడ్డలి పెట్టులా పరిణమించాయి!

కపటం, కుట్ర, మోసం, వంచనలతో
మితిమీరిన ధనదాహంతో
నీతి తప్పి, నైతికతను పోగొట్టుకున్న మానవ మనుగడ
ప్రమాద గాటిన పడింది

కొత్తగా పుట్టుకొచ్చిన పలు రోగాలు
మానవల పీకను పట్టుకొని ప్రాణాంతకమయ్యాయి!

మానవ మేధస్సుకు అందని
పలు విషయాలు
పరిశోధనలకే పెను సవాలు విసిరి మీసం దువ్వాయి!
మానవుల ఉనికిని ప్రశ్నార్థకం చేశాయి!

అధిక ఉష్ణోగ్రతల బారిన పడిన
సమస్త జీవరాసులు
దిక్కు తోచక దారులు వెతికాయి!
మంచు ధృవాలు కరిగి సముద్ర మట్టాలు పెరిగి
జల ప్రళయానికి దారి తీసాయి!

చుట్టూ కమ్ముకొచ్చిన ప్రాణాంతక పరిస్థితులు
తను కూర్చున్న కొమ్మను తనే నరుక్కున్న చెందాన
మానవ మనుగడ చరితకు
మంగళం పాడాయి!

సమస్త భూగోళం జలప్రళయంలో మునిగి
నీళ్లపై తేలియాడింది!

– వంగర. పరమేశ్వరరావు, హైదరాబాద్‌- 38,
9491400534

Leave a Reply