Take a fresh look at your lifestyle.

విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు కీలకం

  • సుస్థిర వ్యవసాయాభివృద్ది లక్ష్యం కావాలి
  • ఆత్మనిర్భర భారత్‌ ‌లక్ష్యం కూడా ఇదే
  • కొరోనా పాఠాలతో సేంద్రియ వ్యవసాయానికి డిమాండ్‌
  • ‌జయశంకర్‌ ‌వ్యవసాయ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో గవర్నర్‌ ‌తమిళి సై

వ్యవసాయాన్ని సుస్థిరంగా మార్చాలన్నా,  రైతుల ఆదాయాలను రెండింతలు చేయాలన్నా వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు కీలకమని గవర్నర్‌ ‌డాక్టర్‌ ‌తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. సంప్రదాయ వ్యవసాయిక విజ్ఞానాన్ని, ఆధునిక టెక్నాలజీతో కూడిన వ్యవసాయిక పద్ధతుల కలయికతో వ్యవసాయాన్ని సుస్థిర చేయాల్సిన అవసరం ఉందని గవర్నర్‌ ‌స్పష్టం చేశారు. కోవిడ్‌ ‌సంక్షోభం ఆర్గానిక్‌ ‌ఫార్మింగ్‌ అవసరాన్ని మరొక్కసారి  చాటిచెప్పిందన్నారు. ఈ వైపుగా రైతులను చైతన్యం చేయాల్సిన బాధత్య ఉందన్నారు. ప్రొఫెసర్‌ ‌జయశంకర్‌ ‌తెలంగాణ అగ్రికల్చరల్‌ ‌యూనివర్సిటీ ఐదవ స్నాతకోత్సవంలో చాన్సలర్‌  ‌హోదాలో గవర్నర్‌ ‌ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆత్మనిర్భర్‌ ‌భారత్‌ ‌సాధనలో వ్యవసాయరంగం పాత్ర కీలకమన్నారు. రాజ్‌ ‌భవన్‌ ‌ద్వారా చేపట్టిన ఒక సర్వేలో ఆదిమజాతి గిరిజనులకు వ్యవసాయ భూమి ఉన్నప్పటికీ,  వ్యవసాయం చేసే విధానం తెలియక వారు సాగు చేయలేకపోతున్నారని తెలిసిందన్నారు. వారికి వ్యవసాయం, పాడి పశువుల పోషణ తదితర అంశాలలో ప్రోత్సాహం ఇచ్చినట్లయితే వారి ఆదాయాలు పెరగడంతో పాటు, వారిలో పోషకాహారం స్థాయిలు కూడా పెరుగుతాయని డాక్టర్‌ ‌తమిళిసై వివరించారు. వ్యవసాయ పట్టభద్రులు ఈ దిశగా కృషి చేయాలని గవర్నర్‌ ‌పిలుపునిచ్చారు. ప్రపంచం వేగంగా మారుతుందని, కొత్త ఆలోచనలు,  కొత్త ఆలోచనా విధానం, వినూత్న ఆవిష్కరణలు మరింత అవసరమని గవర్నర్‌ ‌తెలిపారు. సుస్థిర వ్యవసాయ పద్ధతులతో భారత్‌ను, రాష్ట్రాన్ని వ్యవసాయ రంగంలో మరింత ముందుకు తీసుకు వెళ్లాల్సిన బాధ్యత వ్యవసాయ విశ్వవిద్యాలయంపై, వ్యవసాయ పట్టభద్రులపై ఉన్నదని డాక్టర్‌ ‌తమిళిసై ఉద్భోదించారు.

తెలంగాణ రాష్ట్రం రైతు సంక్షేమ కార్యక్రమాలతో  రైస్‌ ‌బౌల్‌ ఆఫ్‌ ఇం‌డియాగా అవతరించిందని గవర్నర్‌ అభినందించారు. సాగును లాభసాటిగా చేయడం, సుస్థిర పద్ధతులు అనుసరించడం, భవిష్యత్‌ ‌తరాలకు ఆహార భద్రత కల్పించడం అత్యంత కీలక అంశాలని గవర్నర్‌ ‌స్పష్టం చేశారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం అగ్రి హబ్‌ను, ఇన్నోవేషన్‌ ‌సెంటర్‌ను ఏర్పాటు చేసి ఈ రంగంలో ఆధునిక పరిశోధన పద్ధతులను, ఎంటర్‌‌ప్రెన్యూర్షిప్‌ను ప్రోత్సహించడం అభినందనీయమని గవర్నర్‌ ‌ప్రశంసించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న నీతి ఆయోగ్‌ ‌సభ్యుడు రమేష్‌  ‌చంద్‌కు వ్యవసాయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ను ప్రధానం చేసింది. వర్చువల్‌ ‌పద్ధతిలో జరిగిన ఈ స్నాతకోత్సవంలో గవర్నర్‌ ‌పుదుచ్చేరి నుండి పాల్గొని విద్యార్థులకు, పరిశోధకులకు పట్టాలను ప్రధానం చేశారు. విజేతలకు మెడల్స్ అం‌దజేశారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్‌ ‌వి ప్రవీణ్‌ ‌రావు, రిజిస్ట్రార్‌, ‌ఫ్యాకల్టీ సభ్యులు, విద్యార్థులు ఈ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు.

Leave a Reply