Take a fresh look at your lifestyle.

డాక్టర్‌ ‌బి.ఆర్‌ అం‌బేద్కర్‌ ‌మేధోమథనం ప్రతిరూపం… గణతంత్ర దినోత్సవం ..!

ప్రతి సంవత్సరము 1950 జనవరి 26 గణతంత్ర దినోత్సవము జరుపుకుంటున్నాము . ఇది దేశ వ్యాప్తముగా అందరూ జరుపుకొనే జాతీయ పండగ. 200 సంవత్సరాల పైగా మన దేశాన్ని ఆంగ్లేయులు పరిపాలించిరి. వారు పరిపాలించినంత కాలము మనదేశములోని పరిపాలనా విదానము బ్రిటిష్‌ ‌రాజ్యాంగము ప్రకారము జరిగేది. వారు వెళ్లిపోయాక మన దేశాన్ని మనమే పరిపాలించుకునేందుకు రాజ్యాంగాన్ని తయారుచేసుకోవాల్సి వచ్చింది. ఇదొక కృతనిశ్చయం ఇది వాగ్దానం భద్రత, వీటన్నిటికి మించి మనమంతా చిత్తశుద్దితో అంకితం కావలసిన బృహత్తర లక్ష్యం’ రాజ్యాంగ నిర్ణాయక సభలో 1946 డిసెంబర్‌ ‌లో భావి భారత రాజ్యంగం ఏ విధంగా ఉండాలని నిర్దేశించే తీర్మానాన్ని ప్రవేశ పెడుతూ జవహర్‌ ‌లాల్‌ ‌నెహ్రూ చెప్పిన మాటలివి. డాక్టర్‌ ‌బి.ఆర్‌ అం‌బేద్కర్‌ ‌నేతృత్వంలోని రాజ్యాంగ నిర్ణాయక సభ ఆ తర్వాత ఏన్నిటినో విపులంగా అధ్యయనం చేసి, ఎంతో మేధోమథనం జరిపి రూపొందించిన రాజ్యాంగ నిర్ణాయక సభ రాజ్యాంగం తన ప్రస్థానాన్ని ప్రారంభించి రేపటితో 71 సంవత్సరాలు పూర్తవుతుంది.

డాక్టర్‌ అం‌బేద్కర్‌ ‌రాజ్యాంగ సభ లోని ఇతర పెద్దలు వీటన్నింటినీ తట్టుకొని కర్తవ్యనిష్టతో తమకు అప్పగించిన బాధ్యతను పరిపూర్తి చేశారు తమ అధ్యయన ఫలితాలకు తమ సమిష్టి విజ్ఞతను రంగరించారు. వెలుపలి నుంచి ఏన్ని ఒత్తిళ్ళు వచ్చిన తమలో తమకు ఎన్ని వైరుద్యాలు ఉన్న దేశ ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కలిసికట్టుగా వ్యవహరించారు. జవాబుదారీతనంతో పనిచేశారు పర్యవసానంగా ప్రపంచములోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగం రూపుదిద్దుకుంది. కానీ మన సమాజం ఎలాంటిదో, అందులోని గుణదోషాలు ఏమిటో డాక్టర్‌ అం‌బేద్కర్‌ ‌కు బాగా తెలుసు, వాటిని సరిదిద్దక పోతే ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో ఆయన సరిగానే గ్రహించారు. అందుకే రాజ్యాంగ నిర్ణాయక సభలోనే ఆయనోక హెచ్చరిక చేశారు. ‘మనం రాజకీయ సమానత్వాన్ని సాధించాం కాని, సామాజిక ఆర్థిక జీవితంలో అత్యధికులకు దాన్ని నిరాకరిస్తున్నాం ఈ వైరుధ్యాన్ని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించకపోతే ఈ అసమానతల కారణంగా బాధ పడేవారు రాజకీయ ప్రజాస్వామ్య నిర్మాణ సౌధాన్ని ధ్వంసం చేస్తారని ఆయనన్నారు కనుక ఈ 71 సంవత్సరాల గణతంత్ర ప్రజాస్వామ్యం ప్రస్థానాన్ని సింహావలోకనం చేసుకోవాలి. ఆ ప్రస్థానం రాజ్యాంగ నిర్మాతల ఆకాంక్షలకు అనుగుణంగానే సాగిందా…అది సామాజిక న్యాయాన్ని సంపూర్ణంగా సాధించిందా..దాని అసరాతో మనంసురాజ్యాన్ని స్థాపించు కోగలిగామా అని ప్రశ్నించుకోవాల్సి ఉంది.

మన రాజ్యాంగం కాలానుగుణంగా ఉండాలని, అందుకోసం అవసరానికి తగినట్టు దాన్ని సవరించేందుకు అవకాశం కల్పించాలని రాజ్యాంగ నిర్మాతలు భావించారు.ఈ రాజ్యాంగానికి న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం సౌభ్రాతృత్వాలే మూల స్తంబాలు అయితే వీటిని ఆధారం చేసుకుని మనం సామాజిక అసమానతలను, పెత్తందారీ పోకడలను తుది ముట్టించగలిగామా? దేశంలో ఆకలి ,అనారోగ్యం, అవిద్య , నిరుద్యోగం రూపుమాపగలిగామా? యువతరానికి ఆశావహమైన భవిష్యత్తు కలిగించగలమా? సకల రంగాల్లో స్వయంసమృద్ది సాధించగలిగామా?ఈ ప్రశ్నలకు ఖచ్చితంగా జవాబు చెప్పగల పరిస్థితులు లేవు. అలాగని సాధించిన విజయాలు తక్కువేమి కాదు. శాస్త్ర సాంకేతిక రంగాలలో మన దేశం మెరుగ్గానే ఉంది. తిండి గింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించగలిగాం. సగటు ఆదాయం పెరిగింది .గతంతో పోలిస్తే జీవన ప్రమాణాలు మెరుగు పడ్డాయి. సంపద వృద్ది జరిగింది. ప్రాణాంతక వ్యాధులను అరికట్టినాం.కానీ అంతరాలు, అసమానతలు నానాటికీ పెరుగుతున్నాయి. ప్రపంచీకరణ విధానాలను అమలు చేయడం ప్రారంభించాక సంక్షేమ రాజ్య భావన నీరసపడింది. ప్రపంచీకరణ విధానాల వల్ల జరిగిన కొంతమందికే దక్కింది. ఎలాంటి పలుకుబడిలేని సాధారణ ప్రజానీకం ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు, సామాన్య పౌరులకు నమ్మకం చెక్కు చెదరలేదు. కానీ నమ్మకం లేనిదల్ల ప్రజాజీవన రంగాల్లో పెత్తనం చెలాయిస్తున్న పెద్దలకి మాత్రమే..

- Advertisement -

గాంధీజీ ఆమరణ నిరాహారదీక్షతో అంబేడ్కర్‌ ‌తదితరులకు ఇష్టంలేకున్నా సరిగ్గా 83 ఏళ్ల క్రితం పూనా ఒప్పందం జరిగింది. దాని ఫలితంగానే నేటికీ దళితులకు నిజమైన రాజకీయ అధికార భాగస్వామ్యం అందలేదు. రాజకీయ రిజర్వేషన్లు పాక్షిక ప్రయోజనాన్నే అందించాయి. సవర్ణ హిందువులు లేదా దళితేతరులు తమకు అనుకూలమైన దళితులే ఎన్నికయ్యేలా చేస్తున్నారు. అవీ లేకుండా చేయాలని జరిగిన కుట్రలను అంబేడ్కర్‌ ‌ప్రతిఘటించడం వల్లనే ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు దక్కాయి. లేకుంటే ఆ అవకాశమూ దక్కేది కాదు.శతాబ్దాలుగా అణచివేతకు, తరతరాలుగా వెలివేతకు గురవుతున్న వర్గాలకు విముక్తిని కలిగించడంలో రాజకీయాధికారం కీలకపాత్ర వహిస్తుందని రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అం‌బేడ్కర్‌ ‌భావించారు. రాజ్యాంగపరంగా అది అక్షరాలా అమలు జరిగేలా చూసేందుకు అహరహం తపించారు. కానీ అంబే డ్కర్‌ ‌తన ఆలోచనలకు ఆచరణ రూపాన్నిచ్చే ప్రతి సందర్భంలోనూ కొందరు మోకాలడ్డారు. ఆయన ఆశించినది ఆశించినట్టు జరగకుండా, అణగారిన వర్గాలకు ఫలితాలను అందకుండా చేయడంలో కొంత మేరకు కృతకృత్యుల య్యారు. 83 ఏళ్ళ క్రితం 1932 సెప్టెంబర్‌ 24‌న, సరిగ్గా ఇదే రోజున ‘పూనా ఒడంబడిక’ పేరిట దళితులకు ద్రోహం జరిగింది. ఇది రెండు విభిన్న సామా జికవర్గాల మధ్య కుదిరిన ఒప్పందం. అంబేడ్కర్‌, ‌గాంధీలు ప్రత్యర్థులుగా నిలిచి పూనాలో కుదుర్చుకున్న ఆ ఒప్పందం దుష్ఫ్రభావం ఫలితంగానే నేటికీ దళితులకు నిజమైన రాజకీయాధికార భాగస్వామ్యం అందలేదు.

భారత రాజ్యాంగానికి 1935 భారత ప్రభుత్వ చట్టం మూలాధారం అయినప్పటికీ అనేక అంశాలు ఇతర రాజ్యాంగాల నుంచి గ్రహించారు. వాటిలో ముఖ్యమైనవి. బ్రిటన్‌ ‌నుంచి ఏక పౌరసత్వం, పార్లమెంటరీ విధానం, స్పీకర్‌ ‌పదవిలను ప్రామాణీకంగా తీసుకున్నారు. ఇక అమెరికా నుంచి ప్రాథమిక హక్కులు, సుప్రీం కోర్టు, న్యాయ సమీక్షాధికారాన్ని తీసుకున్నారు. భారతదేశంలో ఆదేశిక సూత్రాలు, రాష్ట్రపతిఎన్నిక, రాజ్యసభ సభ్యుల నియామకాన్ని ఐర్లాండ్‌ ‌దేశం నుంచి తీసుకున్నారు. ఇక భారతదేశంలో ప్రాథమిక విధులను రష్యా నుంచి, కేంద్ర రాష్ట్ర సంబంధాలను కెనడా నుంచి, అత్యవసర పరిస్థితిని జర్మనీ నుంచి ప్రామాణికంగా తీసుకుని మన రాజ్యాంగాన్ని రూపొందించారు.ఇలా మనం ఏర్పాటు చేసుకున్న రాజ్యాంగం ప్రకారం మనల్ని మనం పరిపాలించుకోవడం ప్రారంబించుకున్న రోజు కనుకనే రిపబ్లిక్‌ ‌డే కి అంత ప్రాముఖ్యత. ఈ రోజున సాహస బాలలకు అవార్డులతో సహా దేశవ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయి. భారత రాష్ట్రపతి ప్రసంగిస్తారు. దేశ ప్రజలందరూ అట్టహాసంగా ఈ వేడుకల్ని జరుపుకుంటారు.

డా. సంగని మల్లేశ్వర్‌, ‌జర్నలిజం విభాగాధిపతి, కాకతీయ విశ్వవిద్యాలయం,వరంగల్

Leave a Reply