Take a fresh look at your lifestyle.

నేడు రిపబ్లిక్‌ ‌డే సందర్భంగా.. భారత రాజ్యాంగ అమలు… పాలకులతీరు..!

Today is the Republic Day .. Constitution of India1

భారత రాజ్యాంగం, దాని మౌలిక విలువలకు తిలోదకాలిస్తున్న నేటి సమాజంలో రాజ్యాంగ పరిరక్షణే ధ్యేయంగా భారతజాతిలో సామాజిక చైతన్యం, రాజ్యాంగ అధ్యయనం అన్ని వర్గాల ప్రజలకు అనివార్యంగా ఏర్పడింది. రెండు దశాబ్దాలకుపైగా జరిగిన సుదీర్ఘ స్వాతంత్య్ర పోరాటం ఎందరో మహనీయుల ఆత్మత్యాగాల ఫలితంగా మనదేశ దాస్యశృంఖాలాలకు విముక్తి లభించింది. స్వతంత్య్ర భారత తొలినాటి నేతలు పేదరికాన్ని మరియు దాని కవలలైన ఆకలి, అనారోగ్యం రూపుమాపి పౌరులందరికి గౌరవ ప్రదమైన జీవనానికి బాటలు వేస్తామనే ప్రతిజ్ఞలతో పాలన ఆరంభించారు. మనదేశ ప్రజల జీవితాన్ని క్రమబద్ధంగా నిర్వహించుకొనుటకు ఏర్పడ్డదే రాజ్యాంగం. మనదేశానికి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు. దానిలోని ప్రధానాంశాలైన… శాసన, కార్యనిర్వాహక, న్యాయశాఖల వ్యవస్థీకరణ, అధికారాలు, విధులు, పౌరుల హక్కులు, బాధ్యతలు, ఆదేశసూత్రాలు మొదలగునవన్ని పొందుపరుచుకున్న నిబంధనావళే రాజ్యాంగం. ఇది పాలకులకు, పాలితులకు మధ్య సంబంధాన్ని క్రమబద్ధం చేస్తుంది. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రూపొందించడం మామూలు అంశం కానేకాదు. మనదేశానికి రాజ్యాంగమే మూలస్తంబం. స్వాతంత్య్ర లక్ష్యాలు, ఫలాలు, రాజ్యాంగ ఆశయాలు, సంక్షేమ రాజ్య ఆకాంక్షలు నెరవేరి సుస్థిరాభివృద్ధి సాధించాలంటే రాజ్యాంగబద్ధ పాలన సాగాల్సి ఉంది. సంపద సమంగా పంచబడినప్పుడే ఆర్థిక అసమానతలు తొలగిపోయి, శ్రేయోరాజ్యంగా వర్థిల్లుతుంది. ఏడుదశాబ్దాల గణతంత్ర రాజ్యంలో పేదరికం, ఆకలి, అనారోగ్యాల పీడ విరగడైందా! సమస్యలు లేని సమ్మిళిత అభివృద్ధి సాధ్యమైందా ! అన్న ప్రశ్నలకు సమాధానం లేదు.

ముమ్మాటికి కాలేదనే ప్రభుత్వం ఏర్పరిచిన నీతి అయోగ్‌ ‌సమాధానం చెపుతుంది. స్వాతంత్య్రం వచ్చినప్పటి మొత్తం జనాభా కంటే అధికంగా నేటి భారతదేశంలో బీదలున్నారని గణాంకాలతో స్పష్టమౌతున్న విషయం చూస్తూంటే విస్మయానికి గురిచేస్తుంది. ఏడు దశాబ్దాలుగా పరిమితమైన అధికార గణాల, కుటుంబ, బంధుప్రీతీ, రాజకీయ వ్యవస్థలో అవినీతి, అవలక్షణాల పాపం దేశాభివృద్ధికి పెనుశాపంగా మారిందనడంలో సందేహమే వద్దు. ఇండియా ధనిక దేశమే గాని, భారతీయులే నిరుపేదలు అన్న నానుడి దశాబ్దాలుగా వాడకంలో ఉంది. రాజ్యాంగ అమలులో విఘాతం జరుగుచున్న వేళ ఇంకా ఇలాగే కొనసాగినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. ఆర్థిక అసమానతలు ప్రగతికి గుదిబండగా ఉన్నాయనే అనేక విశ్లేషణలే ఇందుకు తార్కాణం. పెరిగిన జాతి సంపదలో 73శాతం దేశంలోని ఒక్క శాతంగా ఉన్న కుభేరుల చెంతకే చేరింది. ఇది కాదనలేని నగ్న సత్యం. మరోపక్క అగ్రరాజ్యాలను శక్తిమంతం, సుసంపన్నులను చేయడంలో భారతీయ శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల పాత్ర గణనీయంగా ఉంది. అలాంటి అనుకూల వాతావరణం కల్పిస్తే భారతీయ మేథావులు వారి మేథో వికాసంతో అద్భుతాలు సృష్టించగలరు. మనదేశ ప్రవాస శాస్త్రవేత్తలను తిరిగి మనదేశానికి రప్పించాలి. వారికి సౌకర్యాలు కల్పించి దేశ అభివృద్ధికి బాటలు వేయాలి. నిరుద్యోగిత వెక్కిరిస్తుంది. వారి చిక్కులు తీర్చుటకు యువతకు శతకోటి మార్గాలు చూపి బాగుపరచాలి. మన యువతలో చేవగలదు. దానికి తోడు చేయూత నిస్తే ఉజ్వల భవిష్యత్‌ ‌మనదే. యువజనం నడుం కడితే భారతావని తలరాత మార్చగలరనే సత్యాన్ని మరువరాదు. అర్ధరాత్రి మగువ ఒంటరిగా నడవగల్గితే అదే స్వాతంత్య్రం అన్నారు మన మహాత్మా గాంధి. కాని నేడు మగువ కాదు కదా ! మాన్యులే బాట నడవరు. పూట గడవదు. పట్టపగలే భద్రత లేకుండా ఇలా ఉంది మన సమాజం. ఆ మధ్య ‘నిర్భయ’ నుండి మొన్న ‘దిశ’ వరకు ఆడవాళ్లపై ఆకృత్యాలు చేస్తూ మృగాళ్లలా వ్యవహరిస్తున్న తీరు భారతజాతికి తలవంపు తెచ్చి పెడుతుంది. నిర్భయ చట్టం, ఆ తర్వాత పోక్సోలాంటి ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా ఆడవారికి భద్రత కల్పించలేక పోవుచున్నారు. ఇంకా హృదయ విదారకంగా చిన్న పిల్లలను కూడా వదలకుండా హత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. ఆటవిక సమాజాన్ని తలపిస్తున్నది.

మరోపక్క యువతతోపాటు సమస్త భారతజాతికి స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలంటే కూడా కనీసం తెలియకుండా పోతుంది. ప్రింట్‌ ‌మరియు ఎలక్ట్రానిక్‌ ‌మీడియా వారు ఆయా సందర్భాల్లో కాలేజీల్లో అడిగితే వింత సమాధానాలు వస్తున్నాయి. అంటే సమాజం ఏమౌతుంది, ఎటుపోతుందని దిగ్భ్రాంతి కలుగుతుంది. స్వతంత్రపోరులో ప్రాణాలను పణంగా పెట్టిన వారి త్యాగాలు వృధానే అనిపిస్తుంది. భారతరాజ్యాంగం రూపొందించడంలో ఎంతో మంది మేధావులు మేథో మథనం చేసిండ్లు, ఎన్నో దేశాలు తిరిగి మనకు అనుకూల పాలన విధానాలను రూపొందించిన రాజ్యాంగంపై కనీస అవగాహన లేకపోవడం చూస్తుంటే ? రాజ్యాంగంతో పాటు నాటి స్వాతంత్య్ర సమర యోధుల నిస్వార్థ సేవలను ఈ తరం మెదళ్లలోకి నిర్బంధంగా ఎక్కించాల్సి ఉంది. ఇలా ఒకవైపు సమాజం ఇంతగా నిర్లక్ష్యంగా, బాధ్యతా రహితంగా వ్యవహరిస్తుంటే మరో ప్రక్క ‘‘రాజ్యాంగ బద్ధంగా పాలన జరపాల్సిన పాలకులు వారి స్వార్థ ప్రయోజనాల కోసం రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విఘాతం కల్గిస్తూ పాలనను సాగిస్తున్నారు. ఎన్నికల సంఘం, న్యాయవ్యవస్థ, సిబిఐ నాలుగో స్తంబమైన ప్రజల పక్షాన నిలవాల్సిన పత్రికలు ఇలాంటి వాటికి రాజ్యాంగ నిర్మాత డా।। అంబేద్కర్‌ ‌స్వయం ప్రతిపత్తిని, విశిష్టాధికారాలను కల్పించినాడు.

చాప కింద నీరులా వీటిలోనికి పాలక పక్షాలు, అధికారాన్ని అడ్డుపెట్టుకొని జోక్యం చేసుకుంటూ ‘‘రాజ్యాంగాని’’కి దాని మౌలిక విలువలకు విఘాతం కల్గిస్తున్నారు. ప్రజల హక్కులను హరిస్తున్నారు. ఇందుకు ఈ మధ్య జరిగిన అనేక సంఘటనలే నిదర్శనం. న్యాయమూర్తులే పత్రికలకెక్కడం, పత్రికా స్వేచ్ఛ, కార్పొరేట్‌ ‌శక్తుల చేతుల్లోకి వెళ్లడం, పాలకవర్గాలే పత్రికలు, మీడియా చానళ్లను పెట్టడం వారికి అనుకూలంగా బాకాలూదడం చూస్తూనే ఉన్నాము. ఎన్నికల సంఘానికి ఉన్న నామమాత్రపు అధికారాలతో కట్టడిచేయలేక ఉత్సవ విగ్రహంగా మారిందా! నేడు జరుగుచున్న ఎన్నికల్లో ‘‘ధన ప్రవాహం’’ చూస్తుంటే విస్మయానికి గురిచేస్తుంది. ఎన్నికల్లో ధనం లేనిది నిలబడలేని స్థితి పంచాయితి నుండి పార్లమెంటు సభ్యుడి వరకు వెళ్లింది. ఇంతగా ధన ప్రవాహం జరుగుచుంటే పేదవాడు ఎలా అధికారాన్ని చేప్టగలడు. ఎన్నికల హామీలపై చట్టం తేవాల్సి ఉంది. ఎన్నికల నిర్వహణకు రా•కీయ పార్టీలు గడిచిన ఐదేళ్ళుగా దేశంలో లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్లు తేలింది. ఇదంతా నల్లధనమే, ఇలాంటి పద్ధతుల వలన మనదేశం బలహీన పడుతుంది. దేశంలో ఆరోగ్యానికి కేటాయించే బడ్జెటుకన్నా ఎన్నికల వ్యయం ఎక్కువే ధన ప్రభావంతో రాజకీయాలు విధ్వంసకరంగా మారినాయి. రాజకీయాల్లో అవినీతి ఎక్కువైంది. అవినీతి వటావృక్షానికి తల్లివేరు రాజకీయాలేనని తేలిపోయింది. నేడు జరుగుచున్న నమ్మలేని నిజాలు రాజకీయ నైతికత పాటించకపోవడం ప్రధాన కారణం ‘‘రాజ్యాంగం’’ విలువలకు తిలోదకాలు ఇవ్వడమేనని రూఢి అయిపోయింది.

భారత రాజ్యాంగానికి ఏడు దశాబ్దాల ఉత్సవాలు జరుపుకుంటున్న వేళ ఓ విశ్లేషణ…
మనదేశానికి రాజ్యాంగమే మూలస్తంబం. ప్రజా శ్రేయస్సుకు అదే రక్షణ కవచం లాంటిది. ఆకాంక్షలు నెరవేరి మనదేశంలో పౌరసమాజం సుఖంగా జీవిస్తున్నారా అంటే లేదు…అని ఒప్పుకోకతప్పదు. రోజురోజుకూ క్షీణిస్తున్న నైతిక విలువలు పెరుగుతున్న సంకుచిత తత్వం, ప్రాంతీయ, భాషా మతోన్మాదులు, అవకాశవాద, నేరపూరిత రాజకీయాలు, ఆర్థిక సామాజిక అసమానతలు చూస్తుంటే ఇది గాంధీజీ కలలుగన్న దేశమేనా! అంబేద్కర్‌ ఆశయాలు కలగానే మిగిలాయి అంటే పాలన బాధ్యతల నిర్వహణలో పక్షాలన్నీ విఫలమవడమే ప్రధాన కారణం. తమ వైఫల్యాలకు పాలకవర్గాలు రాజ్యాంగం వైపు వేలెత్తి చూపిస్తున్నాయి. సమగ్రత, సమానత, ప్రగతికితోడు రాజ్యాంగ విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ప్రస్తుతం దేశంలో పౌరసత్వ సవరణ చట్టం వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో ప్రజల్లో ఉన్న అనిశ్చితిని తొలగించాల్సిన బాధ్యత పాలకులదే. రాజ్యాంగ మౌలిక విలువలు పరిరక్షిస్తూ, రాజ్యాంగ బద్ధంగా పాలన జరిగితే పౌర హక్కులు పరిరక్షించబడతాయి. స్వయం ప్రతిపత్తిగల సంస్థలు స్వేచ్ఛగా వ్యవహరిస్తాయి. సమాజంలోని పౌరులకు ప్రశ్నించే స్వేచ్ఛ ఏర్పడుతుంది. పత్రిక స్వేచ్ఛ పరిఢవిల్లుతుంది. ఆర్థిక, సాంఘిక, సామాజిక, రాజకీయ సమానత్వం ఏర్పడి, సమసమాజానికి బాటలు పడి శ్రేయోరాజ్యంగా మన భారతావని ప్రపంచ ప్రసిద్ధి గాంచుతాయి. స్వాతంత్య్ర యోధుల త్యాగాలు, రాజ్యాంగ నిర్మాతల ఆశయాలు, ఆశలు నెరవేరుతాయి. ప్రజలు ప్రశాంత జీవనం గడుపుతారు.

రాజ్యాంగం దృష్టిలో దేశంలోని ప్రజలందరూ సమానం. అందుకే ఒక మనిషి ఒక వోటు, ఒక విలువ అంటూ నొక్కి చెప్పారు రాజ్యాంగ నిర్మాత డా।। బి.ఆర్‌. అం‌బేద్కర్‌. ‌కాని నేటి పాలకులు ఆర్థిక, సామాజిక, రాజకీయ సమానతను ఏర్పరచలేక పోతున్నారు. వారి ఆశయాలకు తిలోదకాలిస్తున్నారు. రైతుల ఆత్మహత్యలు, విద్యార్థుల ఆత్మహత్యలు చూస్తుంటే విద్య, వైద్యం అంగడి సరుకైంది. కార్పొరేటు శక్తుల చేతిలో పాలకులు కీలుబొమ్మలుగా మారి దేశ ప్రతిష్టను, రాజ్యాంగ విలువలను, అమరుల త్యాగాలను, స్వార్థ ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టుచున్నారనిపిస్తుంది. ప్రజాస్వామ్యానికి రాజకీయ పార్టీలు మూలం. పార్టీలు ప్రజాస్వామ్య బద్ధంగా నడుచుకోకుండా దేశాన్ని, రాష్ట్రాలను సొంత ఆస్తులుగా, ప్రైవేటు జాగీర్లుగా భావించడం వలన ప్రజాస్వామ్యం నిస్సారంగా మారింది. అందుకే పార్టీలు ప్రజాస్వామ్య పునాదులపై నిలబడాలి. ప్రజల సంక్షేమం కోరి ప్రజలకు సేవలకులమనే రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేసిన విధంగా పాలన సాగాలి…
రాజ్యాంగ విలువ తెలుసుకుందాం ! …
పౌరస్వేచ్ఛను కాపాడుకుందాం !!

మేకిరి దామోదర్‌
‌వరంగల్‌
9573666650

Tags: Republic Day, Constitution of India, dr br ambedkar,Print and electronic media

Leave a Reply