Take a fresh look at your lifestyle.

మూడు వ్యవసాయ చట్టాలు వాపస్ 

పార్లమెంటులో ఆమోదించి రద్దు చేస్తాం
జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రకటన
రైతు సంఘాలు, రాజకీయ పార్టీల హర్షం

 ‌దేశ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతలు విజయం సాధించారు. రైతుల అకుంఠిత దీక్షతో, చెక్కు చెదరని పట్టుదలతో సర్వ అడ్డంకులను ఎదుర్కుని ఏడాదికి పైగా చేసిన ఉద్యమంతో కేంద్రం ఎట్టకేలకు వెనక్కు తగ్గింది. సాగుచట్టాలు రద్దు చేయించడంతో వారు విజయం సాధించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వివాదాస్పద సాగుచట్టాలను రద్దుచేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం ఉదయం సంచలన ప్రకటన చేశారు.  వ్యవసాయ చట్టాలను రద్దు చేసేందుకు రాజ్యాంగబద్ధమైన చర్యలు తీసుకుంటామని మోదీ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఉదయం 9 గంటలకు జాతిని ఉద్ధేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రధాని ప్రకటన చేశారు. మేం మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడానికి నిర్ణయం తీసుకున్నామని ప్రధాని దేశప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో చెప్పారు. కొత్త వ్యవసాయ చట్టాలపై రైతుల్లో ఒక వర్గాన్ని ఒప్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పారు. ‘నేను దేశానికి క్షమాపణలు చెబుతున్నాను, స్వచ్ఛమైన హృదయంతో…మేం రైతులను వ్యవసాయ చట్టాలపై ఒప్పించలేకపోయాం. మేం మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించడానికి నేను ఇక్కడ ఉన్నాను…ఈ నెల పార్లమెంటు సమావేశాల్లో రద్దు లాంఛనాలను పూర్తి చేస్తాం’ అని ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగంలో వెల్లడించారు. ఇదే సందర్భంలో రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. చిన్న రైతుల కోసం అనేక పథకాలు తెచ్చామని పేర్కొన్నారు. 10 కోట్ల మందికి పైగా రైతులకు 2 హెక్టార్ల కంటే తక్కువ భూమే ఉందని, అదే వారికి జీవనోపాధని అన్నారు. వ్యవసాయ బ్జడెట్‌ను 5 రెట్లు పెంచిన ఘటన తమ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. రూరల్‌ ‌మార్కెట్‌ ‌మౌలిక సదుపాయాలను బలోపేతం చేశామని చెప్పారు. కర్తార్‌పూర్‌ ‌కారిడార్‌ను తిరిగి తెరవనున్నట్లు చెప్పారు. అంతకముందు సిక్కుల మొదటి గురువు, సిక్కు మతస్థాపకులు గురునానక్‌ ‌దేవ్‌ ‌జీ జయంతి  సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. సుమారు సంవత్సర కాలం నుండి ఈ సాగు చట్టాలు రద్దు చేయాలని ఢిల్లీ  సరిహద్దుల్లో అన్నదాతలు ఆందోళనలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ చట్టాల రద్దు రైతుల విజయంగా భావిస్తున్నారు. అదేవిధంగా వొచ్చే ఏడాది పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌తో సహా ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోనే ఈ ప్రకటన ఇవ్వాల్సి వొచ్చిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Leave a Reply