కరువు సీమలో.. ప్రగతి పరుగులు
పోరుగడ్డలో మారిన పల్లె జీవన చిత్రం – దుర్భిక్షాన్ని దూరం చేసిన గోదావరి జలాలు
బాధల నుండి విముక్తమైన “హుస్నాబాద్”
నాడు.. (2014 కు ముందు)
గుక్కెడు నీటికి అలమటించిన నేల
కరవు కరాళనృత్యం చేసిన ప్రాంతం
తాగునీటికి బిందెలు, కుండలు పట్టుకుని.. మైళ్ళ దూరం వెళ్లే దుస్థితి
తుపాకుల తూటాలతో… మందుపాతరల పేలుళ్లతో.. దద్దరిల్లిన ప్రాంతం
ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియక..
అనుక్షణం భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం గడిపిన జనం
అభివృద్ధికి నోచుకోని పల్లెలు..
రోడ్లుకూడా లేని గిరిజన తండాలు
ఆ ఊరికి పిల్లను ఇవ్వాలంటేనే.. భయపడిన సందర్భం..
ఉపాధికోసం వలసబాట పట్టిన జనం
నీళ్లకోసం… బోర్లువేసి.. అప్పులపాలై… పంటలెండి… నష్టపోయి..
రైతుల నిత్య ఆత్మహత్యలతో… బాధిత కుటుంబాల రోదనలతో..
వల్లకాడును తలపించిన దైన్యం
పిల్లలను చదివించుకోలేక… పిల్లల వివాహాలు చేయలేక..
ఆర్థికంగా కుదేలైన కుటుంబాలు..
—
కానీ నేడు…
ఎక్కడ చూసినా పంట పొలాలు.. పచ్చని పైర్లు…
గోదావరి జలాల పరుగులు..
ఎక్కడ చూసినా ప్రశాంత మైన పల్లె వాతావరణం…
గిరిజన తండాల్లో జనం సందడి.. కొత్త గ్రామపంచాయతీలు
వలసబోయి తిరిగి సొంతూరికి వచ్చిన కూలీలు
పెరిగిన భూగర్భ జలాలు..
ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్లు..
ప్రతి పల్లెలో విద్యుత్తు వెలుగులు..
గురుకుల పాఠశాలల్లో నిరుపేదల చదువుల వెలుగులు..
గిరిజన తండాలకు రోడ్లు…
గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, స్మశానవాటికలు, పల్లె ప్రకృతి వనాలు
పెరిగిన భూముల ధరలు..
గ్రామాల్లో టూ వీలర్లు, ఫోర్ వీలర్ల పరుగులు..
గ్రామాల్లో కొత్త గృహాల నిర్మాణాలు..
అవును.. ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ నాయకత్వంలో..
అభివృద్ధి విషయంలో హుస్నాబాద్ నియోజకవర్గం దూసుకుపోతోంది.. ఒకప్పుడు కరువు సీమగా.. తీవ్ర దుర్భిక్ష ప్రాంతంగా ముద్రపడిన హుస్నాబాద్ క్రమంగా గత గాయాల నుండి కోలుకుంది.. ఆమ్మో.. హుస్నాబాదా… అనే పరిస్థితి నుండి.. “ఎస్.. మాది హుస్నాబాద్” అని గర్వంగా చెప్పుకునే పరిస్థితి ఏర్పడింది. దీనికి ఎన్నో కారణాలు.. స్థానిక ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ కృషితో… సి ఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ల సహకారంతో.. ఇటు ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి సంక్షేమంతో… హుస్నాబాద్ అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతోంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
అభివృద్ధి పట్టాలెక్కిందిలా !!
గతంలో హుస్నాబాద్ అంటేనే అత్యంత వెనుకబడిన, వెనుకబడవేయబడ్డ ప్రాంతం అని పేరు తెచ్చుకుంది. కానీ 2014 లో ఎమ్మెల్యేగా సతీష్ కుమార్ గెలిచిన తర్వాత.. క్రమ క్రమంగా అభివృద్ధి పట్టాలెక్కింది. సి ఎం కేసీఆర్ సహకారంతో హుస్నాబాద్ రెవిన్యూ డివిజన్ కేంద్రంగా మారింది. పోలీసు సబ్ డివిజన్ గా ఏర్పాటయింది. నియోజకవర్గంలో బిసి, ఎస్సి, ఎస్టీ, మైనారిటీ గురుకుల పాఠశాలలు ఏర్పాటయ్యాయి. హుస్నాబాద్ లో ప్రభుత్వ పాలిటెక్నిక్ ఏర్పాటైంది. జూనియర్ డిగ్రీ కళాశాలల భవనాల నిర్మాణం జరిగింది. చిగురుమామిడిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం నిర్మాణమైంది. చాలా గ్రామాల్లో కమ్యూనిటీ భవనాల నిర్మాణం జరిగింది. కొత్త గ్రామపంచాయతీలు ఏర్పాటయ్యాయి. కొత్త గ్రామపంచాయతీ కార్యాలయాల నిర్మాణం జరిగింది. హుస్నాబాద్ లో విద్యుత్ డి ఈ కార్యాలయ భవనం నిర్మితమైంది. ఎసిపి కార్యాలయం, ఫైర్ స్టేషన్ భవనాలకు నిధులు మంజూరయ్యాయి. అన్ని మండలాల్లో కొత్త సబ్ స్టేషన్లు మంజూరయ్యాయి. విద్యుత్ లో వోల్టేజి సమస్య, మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయే సమస్య లేకుండా చేసారు. గ్రామీణ, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి రోడ్ల నిర్మాణం జరిగింది. ఎల్కతుర్తి – సిద్ధిపేట హైవే నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయి. అక్కన్నపేట కొత్త మండలం గా ఏర్పాటైంది. 32 గ్రామాలను ఇందులో చేర్చారు. ఇందులో గిరిజన గ్రామాలున్నాయి. అక్కన్నపేటలో అభివృద్ధి ఊపందుకుంది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు అక్కన్నపేటలో అందుబాటులోకి వచ్చాయి. నియోజకవర్గంలో కొత్త గ్రామపంచాయతీలు ఏర్పాటయ్యాయి. రహదారుల నిర్మాణం జరిగింది. హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రిలో డయాలిసిస్ సెంటర్ నడుస్తోంది. మాతా శిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటైంది. ప్రభుత్వ ఆసుపత్రిలో మోకాలి శస్త్ర చికిత్సలు కూడా జరుగుతున్నాయి. బస్తీ దవాఖాన ఏర్పాటైంది. హుస్నాబాద్ లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం జరుగుతోంది. కొత్త మున్సిపల్ పరిపాలన భవనం నిర్మాణం జరుగుతోంది. గాంధీ నగర్ వద్ద ఇంటిగ్రేటెడ్ ఆఫీసెస్ కార్యాలయ నిర్మాణం జరుగుతోంది. చిన్న ముల్కనూర్ లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం జరిగింది. అలాగే.. హుస్నాబాద్ లోను డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం జరిగింది. మీర్జాపూర్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల గృహనిర్మాణం జరిగి గృహ ప్రవేశాలు కూడా పూర్తయ్యాయి. ఎల్లమ్మ చెరువు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. శనిగరం ప్రాజెక్టు మరమ్మతు పనులు జరిగాయి. గండి మహాసముద్రం, సింగరాయ ప్రాజెక్టు పనులు జరిగాయి. నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లోని చెరువులు కుంటలు మిషన్ కాకతీయ కింద అభివృద్ధి చెందాయి. ప్రతి వర్షాకాలంలో అన్ని చెరువులు మత్తళ్లు దూకుతున్నాయి. మిషన్ భగీరథ తో.. ప్రతి తండాకు మారుమూల గ్రామానికి కూడా తాగునీరు అందుతోంది. నిజానికి గతంలో తెగునీటి కోసం బిందెలు పట్టుకుని మైళ్ళదూరం మహిళలు నడిచి వెళ్లేవారు. వానా కాలం లో సైతం గతంలో ధర్నాలు జరిగేవి. చాలా చోట్ల కల్వర్టుల నిర్మాణం జరిగింది. అన్ని మండలాల్లో చెక్ డ్యాముల నిర్మాణం జరిగింది. హుస్నాబాద్, కోహెడ వ్యవసాయ మార్కెట్లను అభివృద్ధి చేసారు. సైదాపూర్ లో కొత్త వ్యవసాయ మార్కెట్ ఏర్పాటైంది. పివి స్వగ్రామం వంగరలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు జరిగాయి. పివి స్మృతి వనం పనులు జరుగుతున్నాయి. ఎల్కతుర్తిలో ఫారెస్ట్ పార్క్ ఏర్పాటైంది. కొత్తకొండ దేవస్థానాన్ని గతంలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి చేసారు. అక్కడ టూరిజం శాఖ ఆధ్వర్యంలో హరిత హోటల్ కూడా ఏర్పాటైంది. ఎల్కతుర్తి గతంలో కరీంనగర్ జిల్లాలో ఉండేది. కానీ జిల్లాల పునర్విభజన, కొత్త జిల్లాల ఏర్పాటైన తర్వాత ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాలు హనుమకొండ జిల్లాలో కలిసాయి. జీ డబ్ల్యూ ఎం సి పరిధిలో కూత వేటు ఉండడంతో.. అభివృద్ధి పథంలో పయనిస్తోంది. రియల్ వ్యాపారం ఎల్కతుర్తిలో జోరుగా సాగుతోంది. ఇవే కాకుండా ఎమ్మెల్యే సతీష్ కుమార్ తన సొంత ఖర్చుతో గతంలో కళాశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టించారు. నిరుద్యోగ గ్రూప్ వన్, గ్రూప్ 2 గ్రూప్ 4 అభ్యర్థులకు ఉచిత శిక్షణతో పాటు స్టడీ మెటీరియల్ అందజేశారు. ఉచిత భోజన వసతి కల్పించారు. పోలీసు ఉద్యోగాల అభ్యర్థులకు కూడా పెద్ద ఎత్తున రెండు సార్లు శిక్షణ శిబిరాలు సొంత ఖర్చు తో నిర్వహించడం గమనార్హం. తద్వారా ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యోగాలు పొందారు.
ఎన్నో ఆటంకాలు.. సవాళ్లు అధిగమించి… బీడు భూముల చెంతకు గంగమ్మ
మెట్ట ప్రాంత రైతుల కలల సౌధం “గౌరవెల్లి”ఫలించిన సతీష్ భగీరథ యత్నం
చిరకాల స్వప్నం నెరవేరుతున్న వేళ
హుస్నాబాద్ అంటేనే మొదట గుర్తుకు వచ్చేది గౌరవెల్లి ప్రాజెక్టు. ప్రాజెక్టు నిర్మాణానికి అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి శంఖుస్థాపన చేసారు. కానీ నాటి ప్రభుత్వంలో పనులు మాత్రం ముందుకు కదలలేదు. అప్పుడున్న ప్రజాప్రతినిధులు ఈ విషయమై ఎలాంటి చొరవ తీసుకోలేకపోయారు. అప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తట్ట మట్టిని కూడా తీయలేకపోయారనే విమర్శలున్నాయి. అప్పుడు డిజైన్ చేసిన ప్రకారం దాని సామర్థ్యం 1-12 టీ ఎం సి.. కానీ టీఆరెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టు రీ డిజైనింగ్ చేసి.. ప్రాజెక్టు సామర్థ్యం 8-23 టీఎంసీలకు పెంచారు. నిర్వాసితులకు ఎక్కడ చెల్లించని విధంగా నష్టపరిహారం చెల్లించారు. నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించే విషయంలో ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ గారు చూపిన చొరవ మరువలేనిది. నిర్వాసితులకు నష్టపరిహారం ప్రభుత్వం ద్వారా అందించేందుకు అయన అనుక్షణం పరితపించారు. కొత్తగా ఏర్పాటైన నిర్వాసితుల కాలనీలో విద్యుత్తూ, రోడ్లు, తాగునీటి, ఇతర మౌళిక సౌకర్యాల కల్పనకు కృషి చేసారు. ప్రాజెక్టు నిర్మాణం దాదాపుగా పూర్తయింది. మిగిలిన పనులు కూడా మరో నెల రోజుల్లో పూర్తి కానున్నాయి. గౌరవెల్లికి సాగునీరు మిడ్ మానేరు నుండి తోటపల్లి స్టోరేజ్ రిజర్వాయర్ కు అక్కడి నుండి సొరంగ మార్గం ద్వారా పంపింగ్ ద్వారా గౌరవెల్లికి చేరుతాయి. ఇందుకు సంబంధించిన పనులన్నీ పూర్తయ్యాయి. గౌరవెల్లి మోటార్ల ట్రయల్ రన్ కూడా విజయవంతంగా పూర్తయింది. మిగిలిన కట్ట పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. మెట్ట ప్రాంత రైతుల కలల సౌధం.. చిరకాల స్వప్నం త్వరలోనే నెరవేరనుంది. నిజానికి ఈ ప్రాజెక్టును ప్రతిపక్షాలు అడ్డుకోవాలని చూశాయి. నిర్వాసితులను రెచ్చగొట్టి కేసులు వేయించారు. గ్రీన్ ట్రిబ్యునల్ లోను కేసులు వేయించారు. కానీ హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ చొరవ తీసుకుని ప్రశాంత వాతావరణంలో ప్రభుత్వంతో అధికారులతో ఎప్పటికప్పుడు చర్చిస్తూ.. ఒకవైపు ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేస్తూనే మరోవైపు ప్రాజెక్టు నిర్మాణం ముందుకు తీసుకుపోయేందుకు కృషి చేసారు. ప్రాజెక్టు నిర్మాణం అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు ఎన్నో ఆటంకాలు సృష్టించినా.. ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్ని అడ్డంకులు అధిగమిస్తూ ముందుకు వెళ్లారు. ఇక్కడి రాజకీయాలలో ప్రధాన అంశమైన గౌరవెల్లి నిర్మాణం తుది దశకు చేరుకోవడం గమనార్హం. ఈ ప్రాజెక్టు ద్వారా హుస్నాబాద్ కు పర్యాటక కళ రావడంతో పాటు… ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు పెరగనున్నాయి. తాగు, సాగునీటి కష్టాలు శాశ్వతంగా తీరనున్నాయి. గోదావరి జలాలు మెట్ట ప్రాంత పంటపొలాలకు, బీడు భూములకు చేరనున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు లక్ష ఎకరాలకు సాగునీరు అందనుంది. సుమారు రూ. 2100 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణం జరిగింది.
హుస్నాబాద్ నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు జరిగాయి. అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తోంది. ప్రస్తుతం సిద్ధిపేట – ఎల్కతుర్తి ప్రధాన రహదారి నేషనల్ హైవేగా మారుతోంది. రోడ్డు నిర్మాణం పనులు శర వేగంగా జరుగుతున్నాయి. కరీంనగర్ నుండి హుస్నాబాద్ మీదుగా జనగాం వరకు నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణానానికి కూడా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసారు. హుస్నాబాద్ ప్రస్తుతం.. హనుమకొండ, జనగాం, సిద్ధిపేట, కరీంనగర్ జిల్లాలకు ముఖ్య కూడలిగా మారుతోంది. ఇక్కడి భూముల ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. మిడ్ మానేరు ద్వారా జలాలు చిగురుమామిడి, సైదాపూర్ మండలాలకు అందుతున్నాయి. దేవాదుల ద్వారా ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాలకు సాగునీరు అందుతోంది. గతంలో కాకతీయ ప్రధాన కాలువ ద్వారా.. ఎప్పుడు సాగునీరు వస్తుందో.. ఎప్పుడు రాదో తెలిసేది కాదు. కానీ.. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత… కాకతీయ కాలువ నిత్యం ప్రవహిస్తోంది. ఎల్కతుర్తి మండలం మొత్తం.. కాకతీయ కింద సాగు అవుతోంది. గతంలో చెరువులు అధ్వాన్నంగా ఉండేవి. సర్కారు తుమ్మలతో. తూములు శిధిలమై కనిపించేవి.. మిషన్ కాకతీయ ద్వారా.. చెరువుల మరమ్మతులు జరగడంతో.. మండు వేసవి లో కూడా చెరువుల్లో నీళ్లు కనిపిస్తున్నాయి. ఒక ప్రాంతం, నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే.. స్థిరమైన, సమర్థవంతమైన నాయకత్వం కావాలని, అది ఉన్నందువల్లే.. గడచినా 9 ఏళ్లలో అంతకుముందెన్నడు లేని విధమైన అభివృద్ధిని హుస్నాబాద్ నియోజకవర్గం సాధించిందని అక్కన్నపేట మండలానికి చెందిన ఒక రైతు వ్యాఖ్యానించాడు. ఏదిఏమైనా ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ నాయకత్వంలో హుస్నాబాద్ అభివృద్ధి పరుగులు పెడుతోంది. హుస్నాబాద్ ముఖ చిత్రం, ఇక్కడి ప్రజల జీవన శైలి గడచిన పదేళ్లలో పూర్తిగా మారిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
– ప్రజాతంత్ర డెస్క్