- ప్రభుత్వం కీలక నిర్ణయం
- విపక్షాల వొత్తిళ్లకు తలొగ్గిన ప్రభుత్వం
వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై ఎల్ఆర్ఎస్ నిబంధనను తెలంగాణ ప్రభుత్వం ఎత్తివేసింది.. ఈమేరకు రిజిస్ట్రేషన్స్, స్టాంప్స్ కమిషనర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే నిర్దేశించిన ఎల్ఆర్ఎస్ ఫీజును తప్పనిసరిగా చెల్లించాలని ప్రభుత్వం నిబంధన విధించింది. ధరణి పోర్టల్ ద్వారా ప్రస్తుతం ఎల్ఆర్ఎస్ రుసుము చెల్లించిన ప్లాట్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు మాత్రమే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరుగుతున్నాయి. అయితే, దీనిపై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రభుత్వంపై దీనిపై తీవ్ర విమర్శలు గుప్పించాయి. ఎల్ఆర్ఎస్కు వ్యతిరేకంగా త్వరలోనే భారీ నిరసన కార్యక్రమాలకు రూపకల్పన చేశాయి.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్లకు ఎల్ఆర్ఎస్ నిబంధన విషయంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఆటంకాల దృష్ట్యా ఈ నిబంధనను ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. దీంతో ఇప్పటికే రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లు నిర్మాణాలకు అడ్డంకులు తొలగినట్లయింది. రిజిస్ట్రేషన్ అయిన వాటికి తదుపరి రిజిస్ట్రేషన్ కొనసాగించవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, అనుమతులు లేని, క్రమబద్ధీకరణ కాని కొత్త ప్లాట్లకు మాత్రం రిజిస్ట్రేషన్లు చేసేందుకు అనుమతి నిరాకరించింది. అనుమతులు ఉన్న క్రమబద్ధీకరణ అయిన ప్లాట్ల రిజిస్ట్రేషన్లు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. కొత్త ప్లాట్లకు మాత్రం సంబంధిత సంస్థల అనుమతి పొందిన తరువాతనే రిజిస్ట్రేషన్ ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. కాగా, ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ కోసం 25.59 లక్షల దరఖాస్తులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు అందాయి. రిజిస్ట్రేషన్లకు ఎల్ఆర్ఎస్ నిబంధన కారణంగా వేలాది రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసిన రశీదు ఉన్న ప్లాట్లకు రిజిస్ట్రేషన్లు చేసుకునే వీలు కల్పించేందుకు క్రయవిక్రయాలు జరిగేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఉపయోగపడనుంది.