‘‘అమరుల త్యాగాలను మరిచి పాలకులు తన స్వార్ధ ప్రయోజనాల కోసం ఎనిమిది మండలాలను ఆంధ్రప్రదేశ్‌కు తాకట్టుపెట్టిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిది. లక్షలాది మంది ఆదివాసుల జీవితాలను బలిపెట్టి ప్రాజెక్టును నిర్మిస్తున్న ఘనత ఆంధ్రసర్కారుది. ఇవాళ ప్రజా కంఠక పాలకులంతా ఒకటే అని నిరూపిస్తున్న వైనం కళ్లారా చూస్తున్నాం’’
లక్షలాది మంది ఆదివాసీల జీవితాలను ఫణంగా పెట్టి నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇవాళ అత్యంత ప్రతిష్టాత్మకమైనది. వేల కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు బలితీసుకున్న జీవితాలెన్నో, బలితీసుకోనున్న జీవితాలింకెన్నో! కోస్తా కారిడార్‌లోని బహుళజాతి కంపెనీలకు నీళ్లిచ్చేందుకు చేపట్టిన ఈ ప్రాజెక్టు కింద లక్షలాది ఎకరాల అటవీ, వ్యవసాయ భూములు ముంపుకు గురవుతున్నాయి. ఊళ్లకు ఊళ్లు మునిగిపోతున్నాయి, లక్షలాది మంది నిర్వాసితులవుతున్నారు, ఈ విధ్వంసాన్ని ఇవాళ ప్రశ్నించేదెవరు? పశ్న్రించే గొంతుల్ని నొక్కివేసేందుకు గత ప్రభుత్వాలు ప్రయోగించిన అణచివేత విధానాల్నే ప్రస్తుత ప్రభుత్వాలూ ప్రయోగిస్తున్నాయి.
సరిగ్గా 15 ఏళ్ల క్రితం రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఓ అర్థరాత్రి అడవి మీద తూటాల వర్షం కురిసింది. తెల్లవారితే కొత్త సంవత్సరం పలకరిస్తుందనగా 2006 డిసెంబర్ 31 రాత్రి ఖమ్మం జిల్లా కుకునూరు అడవుల్లో ముగ్గురు విప్లవ కారులు నేలకొరిగారు. ఎప్పటిలాగే ఎదురు కాల్పుల కట్టుకథ. కామ్రేడ్స్ క్రాంతి, కరీం, విజయ్ అమరులయ్యారు. అడవితల్లి మోసుకొచ్చిన ఈ నెత్తుటి వార్తతోనే కొత్త సంవత్సరం ఆరంభమైంది. ఎందుకు అక్కడ తూటాల వర్షం కురిసింది? అ నవ యువకుల పోరుదారి ఎందుకంత కంటగింపుగా మారింది? పోలవరం ప్రాజెక్టు కట్టొద్దన్నందుకు, ఆదివాసీలను నిర్వాసితుల్ని చేయొద్దన్నందుకు, అడవి మీద హక్కు ఆదివాసీలదే అన్నందుకు రాజ్యం ఎదురు కాల్పుల నాటకంలో ముగ్గురు పోరు బిడ్డల్ని బలితీసుకుంది.
పోరాటాల ఖిల్లా నల్లగొండ జిల్లా ఊటుకూరు ముద్దు బిడ్డడు కామ్రేడ్ బొడ్డు రామలింగయ్య అలియాస్ క్రాంతి సాయుధ పోరాట యోధుడు. వెట్టిచాకిరి, బానిస బ్రతుకులు మారాలనుకునే నిత్య ఆలోచనల శీలి. అతను ఆలోచనలకే పరిమితం కాలేదు, ఆ ప్రగతిశీల ఆలోచనల్ని జీవితాంతం ఆచరించాడు, ఆచరణలో భాగంగా అమరుడయ్యాడు. పీడిత ప్రజల విముక్తి కోసం జరిగిన పోరాటంలో ముందు భాగాన నిలిచిన యనాల మల్లారెడ్డి వారసత్వం పుణికి పుచ్చుకున్న వీరయోధుడు. ఆయన చూపిన మార్గములో తుది శ్వాస వరకు వెనకడుగు వెయ్యని ధైర్యశీలి. తెలంగాణ రాష్ట్ర సాధన, పోలవరం ప్రాజెక్టు రద్దు, ఆదివాసీ హక్కుల కోసం కడదాకా పోరాడిన యోధుడు. పోలవరం రద్దు కోసం కొట్లాడుతూ కరీం, విజయ్‌లతో కలిసి ప్రాణం విడిచాడు. ప్రజల గుండెల్లో నేటికి ఆ అమరులు పదిలంగా ఉన్నారు. ఊటుకూరు చిన్నవాడా, ఉద్యమాల బాలుడా / అడివిలోన రాలిన ఆకు మల్లె పువ్వునువ్వు /గొల్లల బిడ్డ నీకు ఎంత గుండె ధైర్యం అంటూ ఇప్పుడా అమరుడిని స్మరిస్తూ ప్రజలు పాడుకుంటున్నారు. అమరుల త్యాగాలను మరిచి పాలకులు తన స్వార్ధ ప్రయోజనాల కోసం ఎనిమిది మండలాలను ఆంధ్రప్రదేశ్‌కు తాకట్టుపెట్టిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిది. లక్షలాది మంది ఆదివాసుల జీవితాలను బలిపెట్టి ప్రాజెక్టును నిర్మిస్తున్న ఘనత ఆంధ్రసర్కారుది. ఇవాళ ప్రజా కంఠక పాలకులంతా ఒకటే అని నిరూపిస్తున్న వైనం కళ్లారా చూస్తున్నాం.
తెలంగాణ రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం 2014లో అధికారం చేపట్టిన తరువాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి పౌర, ప్రజాస్వామిక హక్కులను కాల రాసింది. కనీస హామీలను అమలు చేయలేని దుర్మార్గపు ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వము, దళిత ముఖ్యమంత్రి అని మాట్లాడిన కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఆయనే అధికారము తీసుకున్నాడు. రైతులకు అండగా ఉంటుందని చెప్పిన మాయ మాటలు నేడు రైతుల చేతులకు బేడీలు వేయడం వరకు ముందుకు సాగినవి. విద్యార్థులకు ఉచిత విద్య ఊసే లేకుండా పోయింది. తెలంగాణ వస్తే కొలువులు వస్తాయి అని కొట్లాడిన వారు ఇప్పుడు కొలువుల కోసం కొట్లాట చేయక తప్పడం లేదు. సభ పెట్టుకునే హక్కు లేకుండా చేస్తున్న ప్రభుత్వం, ధర్నా చౌక్ వెత్తివేసిన తెరాస ప్రభుత్వం, ధర్నా చౌక్’లోనే ధర్నా చేసిన తీరును చూసాం. కనీసం రాజ్యాంగం కల్పించిన హక్కులు కూడా లేకుండా చేస్తున్నది. తెలంగాణలో ఎన్కౌంటర్లు ఉండవు అని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ అడవి అంతా రక్తము ఏరులై పారిస్తున్నాడు. ఏజెన్సీ ప్రాంతంలో పాలమిలీటరి బలగాలను మోహరించి అడవి అంత జల్లడ బట్టి ఆదివాసుల పై దాడులు చేసేందుకు చర్యలు చేపట్టారు. భూపాలపల్లి జిల్లాలోని గుత్తి కొయ్యలను చెట్లకు కట్టేసి తన నియంతృత్వాన్ని ప్రదర్శించినది. ప్రజాస్వామిక తెలంగాణ గొంతుకైన వరవరరావు ,ప్రొఫెసర్ సాయిబాబా తదితర ప్రజా స్వామిక వాదులు,కవులు, కళాకారుల పై అక్రమ కేసులను మోపి జైల్లో నిర్బంధించింది. పోలవరం ప్రాజెక్టులో ఆదివాసీ ప్రజలను తాకట్టు పెట్టి తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడము అంటే తెలంగాణ అమరుల ఆశయాలను అవమాన పరచడమే. ఇలాంటి వంచన పాలనలో మనమున్నాం. అమరుల ఆశయాలు సాకారం కావాలంటే పోరాటమే మనముందున్న ఏకైక మార్గం. ప్రజాస్వామిక తెలంగాణలోనే ప్రజల నిజమైన ఆకాంక్షలు నెరవేరుతాయి. అ దిశలో ఐక్య ఉద్యమాలు నిర్వహించి, ప్రజాస్వామిక తెలంగాణ సాధనకై పోరాటమనేది మన ముందున్న తక్షణ కర్తవ్యం. కామ్రేడ్ క్రాంతి, కరీం, విజయ్ అమరత్వాన్ని స్మరించుకుందాం. ప్రజాస్వామిక తెలంగాణ ఉద్యమానికి పునరంకితమవుదాం.
– వేముల గోపీనాథ్, జర్నలిస్ట్ విద్యార్థి
9666800045